నడిరోడ్డుపై నరకయాతన

8 Apr, 2018 10:52 IST|Sakshi

పెళ్లకూరు: అయ్యా.. కాళ్లు విరిగిపోయాయి, ఎటూ కదల్లేక ఇరుక్కుపోయాను, కాపాడండి అంటూ సుమారు మూడు గంటల సేపు నరకయాతనతో డ్రైవర్‌ అల్లాడిపోయిన ఘటన శనివారం పెళ్లకూరు మండలం, చెంబడిపాళెం గ్రామం వద్ద చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు బెంగుళూరు నుంచి కోడిగ్రుడ్లు లోడుతో ఓ లారీ కోల్‌కతా వెళుతోంది. మార్గమధ్యంలో చెంబడిపాళెం గ్రామం వద్ద నాయుడుపేట మండలం, అయ్యప్పరెడ్డిపాళెం నుంచి చిత్తూరు జిల్లా, తొట్టంబేడు మండలంలోని ఓ పరిశ్రమకు జామాయిల్‌ కర్రలతో వెళుతున్న ట్రాక్టర్‌ను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. 

ఈ ఘటనలో లారీ డ్రైవర్‌ వివేకానంద కుడికాలు నుజ్జునుజ్జయింది. లారీ ముందు భాగం బాగా దెబ్బతినడంతో డ్రైవర్‌ వివేకానంద కేబిన్‌లో ఇరుక్కుపోయాడు. కాలు విరిగి తీవ్ర రక్తస్రావంతో వివేకానంద ఆర్తనాదాలు చేశాడు. ప్రమాదం జరిగి రెండు గంటలైనా 108 వాహన సిబ్బంది, పోలీసులు స్పందించకపోవడంతో స్థానికులు జేసీబీ సాయంతో ఇరుక్కుపోయిన వాహనాలను విడదీసేందుకు తీవ్రంగా శ్రమించారు. చివరకు స్థానికులు శ్రమించి కేబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను వెలుపలికి తీశారు. 

తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ను ఆటోలో నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సుమారు 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. నాయుడుపేట సీఐ మల్లికార్జున్‌రావు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. నాయుడుపేటలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.   

>
మరిన్ని వార్తలు