ఒక్కరి కోసం రోడ్డు తవ్వేశారు..

25 Feb, 2019 12:34 IST|Sakshi
కృష్ణ మందిరం వీధిలో రోడ్డును తవ్వుతున్న జేసీబీ

సీసీ రోడ్డు నిర్మాణంలో టీడీపీ నేత ఇల్లు లోతుకు వెళ్లడమే కారణం

రోడ్డు వేసిన వారంలోనే 40 మీటర్లు తవ్విన వైనం

ప్రేక్షక పాత్ర పోషిస్తున్న పబ్లిక్‌ హెల్త్‌ అధికారులు

నెల్లూరు సిటీ: నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న సీసీ రోడ్డు నిర్మాణాల్లో ఇప్పటికే పేదల ఇళ్లు మూడడుగుల లోతుకు వెళ్లిపోయాయి. పాత సీసీ రోడ్డును పగలగొట్టకుండానే కాంట్రాక్టర్లు రోడ్డుపై రోడ్డు వేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. పేదలు కావడంతో కాంట్రాక్టర్లను ప్రశ్నించలేదని పరిస్థితి ఏర్పడింది. భవిష్యత్తులో తమ ఇళ్లలోకి నీరొస్తుందం టూ అధికారులు, కాంట్రాక్టర్లకు ఎన్నిసార్లు విన్నవిం చుకున్నా ప్రయోజనం కరువైంది. ఈ పరిస్థితులు సామాన్యులకు మాత్రమేనని స్పష్టమవుతోం ది.

నిబంధనలకు మంగళం
నగరంలోని ఉస్మాన్‌సాహెబ్‌పేట కృష్ణమందిరం వీధిలో టీడీపీ సీనియర్‌ నేత దగ్గు సుబ్బారావు కుమారుడి ఇంటి వద్ద ఇటీవల సీసీ రోడ్డును నిర్మించారు. అయితే రోడ్డు ఎత్తులోకి రావడంతో టీడీపీ నేత ఇళ్లు రెండడుగుల లోతుకు వెళ్లింది. దీంతో తాము నివసిస్తున్న ఇల్లు లోతులోకి వెళ్లిందని.. రోడ్డును పగలగొడతామని కాంట్రాక్టర్‌ను బెదిరించారు. దీంతో రోడ్డు వేసిన వారంలోనే జేసీబీ సాయంతో గంటల వ్యవధిలో పగలగొట్టారు. టీడీపీ నేతలకు సమస్య వస్తే మాత్రం వేసిన రోడ్డును సైతం పగలగొడుతున్నారని, అయితే ఇదే సమస్యను తాము ఎదుర్కొంటున్నామని తెలియజేస్తే పట్టించుకోవడంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణమందిరం వీధిలో దాదాపు 200 మీటర్ల రోడ్డును వేసి ఉండగా, టీడీపీ నేత ఇంటి వద్ద 40 మీటర్ల రోడ్డు తవ్వి తిరిగి వేయడం విమర్శలకు తావిస్తోంది.

కాంట్రాక్టర్‌కు హుకుం జారీ
టీడీపీ నేతల ఇళ్ల వద్ద సీసీ రోడ్డు వేసే క్రమంలో నేతలతో చర్చించి వారి సూచనల మేరకే రోడ్డు వేయాలని కాంట్రాక్టర్లకు మంత్రి నారాయణ హుకుం జారీ చేశారని సమాచారం. సీసీ రోడ్లు వేయడంతో ఇప్పటికే అనేక ప్రాంతాల్లోని వీధుల్లో ఇళ్లు మూడు నుంచి నాలుగడుగుల మేర లోతుకు వెళ్లాయి. పాత సీసీ రోడ్డును పూర్తిగా పగలకొట్టకుండా మరో సీసీ రోడ్డు వేయడంతో ఈ పరిస్థితి ఏర్పడుతోంది.

మరిన్ని వార్తలు