‘జలసిరి’కి రూ.4.01 కోట్ల హారతి

18 Aug, 2018 03:52 IST|Sakshi
జలసిరి కార్యక్రమంలో భాగంగా హారతి ఇస్తున్న సీఎం చంద్రబాబు (ఫైల్‌)

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ నిధుల దుబారాకు ఇదో మచ్చుతునక. గతేడాది సెప్టెంబర్‌ 8న అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఇంద్రావతి గ్రామం వద్ద.. తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ అక్విడెక్టు వద్ద సీఎం చంద్రబాబు జలసిరికి హారతి కార్యక్రమం నిర్వహించారు. దానికి రూ.4.01 కోట్ల విడుదలకు ఆమోదం తెలుపుతూ జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఒక సభకు ఏర్పాట్లు, జన సమీకరణ కోసం రూ.4,01,08,000 ఖర్చు చేయడంపై ఇటు అధికార వర్గాల నుంచి.. అటు ప్రజా సంఘాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇంద్రావతి వద్ద బహిరంగ సభ ఏర్పాట్లు, జన సమీకరణకు భారీ ఎత్తున ఖర్చు చేయడానికి అనంతపురం జిల్లా కలెక్టర్‌కు సర్కార్‌ అనుమతివ్వడంతో ఆ మేరకు భారీగా ఏర్పాట్లు చేశారు. ఆ ఖర్చుకు సంబంధించి అక్టోబర్‌ 10, 2017న అనంతపురం జిల్లా కలెక్టర్‌.. ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలపై జలవనరుల శాఖ ఆమోదముద్ర వేసింది. సాగునీటి ప్రాజెక్టుల పనుల కోసం ఏపీడబ్ల్యూఆర్‌డీసీ (ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల అభివృద్ధి సంస్థ) ద్వారా జాతీయ, ప్రైవేటు బ్యాంకుల వద్ద అధిక వడ్డీకి తెచ్చిన రుణాలను రాష్ట్ర ప్రభుత్వం ఇలా దుబారా చేస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  

మరిన్ని వార్తలు