ఓటుపై వేటు!

11 Apr, 2019 11:20 IST|Sakshi
నిరసన వ్యక్తం చేస్తున్న ఆర్టీసీ కార్మికులు

ఒంగోలు డిపో ఆర్టీసీ డ్రైవర్లు110 మంది ఆందోళన

పట్టించుకోని దర్శి రిటర్నింగ్‌ అధికారి కృష్ణవేణి

ముందుగానే దరఖాస్తులు ఇచ్చినా ఇవ్వని బ్యాలెట్లు

సాక్షి, దర్శి (ప్రకాశం): తమ ఓటు హక్కును పథకం ప్రకారం కోల్పోయేలా చేశారని ఒంగోలు ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్లు ఆర్వో కృష్ణవేణి ఎదుట గురువారం నిరసన వ్యక్తం చేశారు. వారం రోజుల క్రితం తమకు ఎన్నికల డ్యూటీలు వేశారని, బ్యాలెట్ల కోసం ముందస్తు దరఖాస్తు చేసుకున్నామని చెప్పారు. తమకు పోస్టల్‌ బ్యాలెట్‌లు ఇవ్వకుంటే డ్యూటీలకు రామన్న అనుమానంతో దర్శిలో పోస్టల్‌ బాలెట్‌లు ఇస్తారని అబద్దాలు చెప్పి డ్యూటీకి పంపారని డ్రైవర్లు మండిపడుతున్నారు. ఇక్కడ ఆర్వోను పోస్టల్‌ బ్యాలెట్‌లు అడగగా తనకు సంబంధం లేదని సమాధానం చెప్పారని వాపోయారు. 

ఎన్నకల విధులకు వెళ్లే తాము ఇప్పడు ఓటు ఎలా వేయాలని డ్రైవర్లు ప్రశ్నిస్తున్నారు. ఈ విధంగా మోసం చేయడం మంచి పద్ధతి కాదంటున్నారు. తమకు పోస్టల్‌ బ్యాలెట్‌లు ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నారు. ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం గతంలో ఎప్పుడూ చూడలేదని, ఎన్నికల కమిషన్‌ ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని లక్షలు ఖర్చు చేసి ప్రకటనలు చేస్తున్నా తమ గోడు మాత్రం వినడం లేదని మండిపడ్డారు.

ఇలా చేయడం దారుణం 
ఓటు హక్కు లేకుండా చేయడం మనిషిని చంపడంతో సమానం. గతంలో ఇంత దారుణంగా వ్యవహరించడం నేను ఎప్పుడూ చూడలేదు. ఓటు హక్కును హరిస్తున్నారు. ముందుగా దరఖాస్తు చేసుకుంటే ఎందుకు పోస్టల్‌ బ్యాలెట్‌లు ఇవ్వడం లేదు.
- ఎం.మల్లికార్జునరావు

ఇది మంచి పద్ధతి కాదు 
అధికారులు వ్యవహార శైలి బాగాలేదు. మాకు ఓటు హక్కు కల్పించాల్సిందే . లేదంటే ప్రజలు సరైన బుద్ధి చెప్పాలి. ఇలాంటి కుట్రలు చేసే వారికి ఉద్యోగులందరూ సరైన బుద్ధి చెప్పండి. ఎన్నికల కమిషన్‌ మామొర ఆలకించాలి.
- బి.రమణయ్య, ఆర్టీసీ డ్రైవర్‌

నిలువునా మోసగించారు
ముందు పోస్టల్‌ బ్యాలెట్‌ ఇస్తామన్నారు. ఆ తర్వాత పట్టించుకోలేదు. ఇప్పడు అడిగితే సమాధానం లేదు. ముందే ఇలా చేస్తారని చెప్తే డ్యూటీలకు వచ్చే వాళ్లం కాదు. ఇది మంచి పద్ధతి కాదు. ఓటు హక్కు హరించేలా ఎన్నికల అధికారులు కుట్రలు చేస్తే ఎన్నికలు పెట్టడం ఎందుకు.
- కేవీ రెడ్డి, ప్రైవేటు స్కూల్‌ బస్‌ డ్రైవర్‌

మరిన్ని వార్తలు