ఆర్టీసీ గుర్తింపు ఎన్నికలు రచ్చ..రచ్చ

19 Feb, 2016 01:30 IST|Sakshi
ఆర్టీసీ గుర్తింపు ఎన్నికలు రచ్చ..రచ్చ

 మాచర్ల బస్టాండ్‌లో రెండు యూనియన్ల మధ్య ఘర్షణ
పోలీసుల లాఠీచార్జ్
బస్టాండ్‌లో భారీ బందోబస్తు
అధిక శాతం పోలింగ్

  
 మాచర్ల : మాచర్ల బస్టాండ్‌లో గురువారం జరిగిన ఆర్టీసీ గుర్తింపు ఎన్నికలు ఘర్షణకు దారితీశాయి.  ఎంప్లాయీస్, ఎన్‌ఎంయూ యూనియన్ల నేతలు ఒకరినొకరు నెట్టుకుంటూ దాడులకు దిగడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. 451 ఓట్లు కలిగిన డిపోలో ఉదయం 5 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. అమరావతి నుంచి వచ్చిన కార్మిక శాఖ అధికారి జి.నాగేశ్వరరావు, స్థానిక కార్మిక సహాయ అధికారి హరికృష్ణారెడ్డి, సిబ్బంది సీహెచ్ బాబు, శ్రీనివాసరావు ఎన్నికలకు ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నానికి 420 ఓట్లు పోలయ్యాయి. అప్పటి వరకు ప్రశాంతంగా జరిగిన పోలింగ్ కొద్దిసేపట్లోనే ఉద్రిక్తంగా మారింది. రెండు యూనియన్లకు చెందిన కొంత మంది కార్మికులు ఆధిపత్యం పేరుతో ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకున్నారు. దాడులకు సిద్ధమవుతున్న సమయంలో పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీచార్జి చేశారు. రెండు యూనియన్ల నాయకులను శిబిరాల్లోకి పంపించి వేశారు. ఘర్షణ జరగటంతో డీఎం శివశంకర్ పోలీసులతో చర్చించి మరింత బందోబస్తు ఏర్పాటు చేయించారు.

మరిన్ని వార్తలు