డీజిల్‌ ధర పెరగడంతో ఆర్టీసీకి రూ.900 కోట్ల నష్టం

12 Dec, 2018 13:51 IST|Sakshi
రికార్డులను పరిశీలిస్తున్న ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు

బస్సు ప్రమాదాల్లో         ఈ ఏడాది 333 మంది మృతి

సమస్యల పరిష్కారానికి ప్రొద్దుటూరు డిపోను రోల్‌ మాడల్‌గా తీసుకోండి

ఆర్టీసీ డిపో గతేడాదితో పోలిస్తే భేష్‌గా ఉంది

ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు

ప్రొద్దుటూరు టౌన్‌ : డీజిల్‌ ధర పెరగడంతో ఆర్టీసీకి రూ.900 కోట్ల నష్టం వచ్చిందని, అది కార్మికుల వల్ల కాదని ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు అన్నారు. మంగళవారం ప్రొద్దుటూరు ఆర్టీసీ డిపోను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన డిపోలోని అన్ని సెక్షన్ల రికార్డులను తనిఖీ చేశారు. కార్మికులను పలు అంశాలపై అడిగి తెలుసుకున్నారు. కార్మికులకు పీఆర్‌సీలు, ఇంక్రిమెంట్లు ఇవ్వడం వల్ల  రూ.700 కోట్లు భారం సంస్థపై పడిందన్నారు. ఆర్టీసీకి ఉన్న ఆర్థిక ఇబ్బందుల వల్ల సమస్యలు ఉన్నాయన్నారు. మూడేళ్ల కిందట టికెట్‌ ధరలు పెంచామన్నారు. అప్పుడు డీజిల్‌ రూ.48 ఉండేదని, ఇప్పుడు రూ.68 ఉందన్నారు. తలకు మించిన భారం కార్మికులపై మోపితే సంస్థ దెబ్బతింటుందని పేర్కొన్నారు. కార్మికులు సంతోషంగా విధులకు వచ్చే విధంగా అధికారులు వ్యవహరించాలని తెలిపారు. కలిసికట్టుగా పని చేస్తే సమస్యలను అధికమిస్తామన్నారు. మేనేజ్‌మెంట్, కార్మికులు వేరు కాదన్నారు. ఆర్టీసీ మనందరిదీ అని అన్నారు. తాను ఒక డైవర్, కండెక్టర్‌గా ఉంటే ఎలాంటి సమస్యలు వస్తాయో అర్థం చేసుకుని అధికారులు కార్మికులతో వ్యవహరించాలన్నారు. సంస్థ పనితీరుపై కార్మికులు అవగాహన పెంచుకోవాలన్నారు. మేనేజ్‌మెంట్, కార్మికులు సమన్వయంతో సంస్థను ముందుకు తీసుకెళ్లాలన్నారు.

ప్రాణం ఎవరికైనా విలువైనది..
మన తప్పిదం వల్ల, మరి కొన్ని ఎదుటి వారి తప్పిదం వల్ల ప్రమాదాలు జరుగుతాయని ఎండీ అన్నారు. మన తప్పు లేనప్పుడు వారికి చార్జిషీట్‌ ఇవ్వకూడదన్నారు. రెండు రోజుల కిందట రాయచోటి డిపోకు చెందిన బస్సు తిరుపతి వద్ద జరిగిన ప్రమాదంలో 22 ఏళ్ల వయస్సున్న ముగ్గురు యువకులు మృతి చెందారన్నారు. ఇది చాలా బాధకరమని పేర్కొన్నారు. వారికి ఏమి ఇచ్చినా తక్కువేనన్నారు. ప్రాణం చాలా విలువైనదన్నారు.  ఈ ఏడాది ఆర్టీసీ రోడ్డు ప్రమాదాల్లో 333 మంది మృతి చెందారని తెలిపారు. ప్రతి రోజూ ఏ డ్రైవర్‌ అయినా క్షేమంగా బస్సును తిరిగి అప్పగిస్తామని అనుకోవాలన్నారు. మద్యం తాగి బస్సు నడపడంపై సీరియస్‌గా ఉన్నామన్నారు. రెండు, మూడు సార్లు వస్తే ఉద్యోగం నుంచి తొలగిస్తున్నామని హెచ్చరించారు. లగేజీ టికెట్‌ ఇచ్చి, ప్రయాణికునికి టికెట్‌ ఇవ్వని సందర్భాలు చాలా ఉన్నాయన్నారు.

డబుల్‌ డ్యూటీకి రూ.300 ఇస్తున్నా సరిపోదు
ఎండీ కార్మికులతో మాట్లాడుతూ డబుల్‌ డ్యూటీకి రూ.300 ఇస్తున్నామని, అయినా అది సరిపోదని తెలిపారు. అందుకే ఖర్చులు తగ్గించుకోవాలని ఆర్టీసీ డీఎంకు సూచించారు. ప్రతి ఒక్కరూ  సంస్థ బాగు కోసం ఆలోచించాలన్నారు. ఆర్టీసీలో పని చేసే ప్రతి ఉద్యోగి ఉద్యోగ భద్రతతో పని చేయాలన్నారు. ఒక మంచి పని చేయడం వల్ల కొన్ని సమస్యలు అధికమిస్తామన్నారు. మాకు గతంలో కంటే వెసులు బాటు వచ్చింది అని ప్రతి డిపోను పరిశీలించిన సందర్భంలో కార్మికులు చెప్పారన్నారు. నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగిందని నిర్ధారించలేం కాబట్టి వారిపై ఉన్న చార్జిషీట్‌లు తొలగించాలని ఆదేశించామన్నారు. వారి నుంచి రికవరీలు చేసి ఉంటే అవి కూడా వెనక్కి ఇవ్వాలని చెప్పానన్నారు. 50 శాతం కేసులు రూ.30 లోపు డబ్బు ఉన్నవే ఉన్నాయన్నారు. సమస్యలను తీరేందకు ఏమైనా చేశామా లేదా అని పరిశీలించుకోవాలన్నారు. చీకటిలో కూర్చొని ఏడుస్తూ కుర్చుంటే అది పోదన్నారు.

ప్రొద్దుటూరు డిపోను రోల్‌ మాడల్‌గా తీసుకోండి
సమస్యలను అధిక మించడానికి ఏ విధంగా వ్యవహరించాలన్న విషయంపై ప్రొద్దుటూరు డిపోను రోల్‌ మాడల్‌గా తీసుకొని దాన్ని అన్ని డిపోల్లో అనుసరించాలని ఎండీ తెలిపారు. సంస్థకు నష్టం చేకూరిస్తే సహించమన్నారు. ప్రొద్దుటూరు ఆర్టీసీ డిపో గత ఏడాదితో పోలిస్తే అన్ని వాటిల్లో ముందంజలో ఉందని ఎండీ అభినందించారు. ఎండీ వెంట అడ్మినిస్ట్రేషన్‌ ఈడీ కోటేశ్వరరావు, కడప రీజియన్‌ ఈడీ కేవీఆర్‌ ప్రసాద్, కమర్షియల్‌ ఈడీ విజయరావు, ఈడీ రామకృష్ణ, కడప ఆర్‌ఎం విజయరత్నం, ప్రొద్దుటూరు డిపో మేనేజర్‌ హరి, అసిస్టెంట్‌ డిపో మేనేజర్‌ శ్రీలత తదితరులు ఉన్నారు. 

మరిన్ని వార్తలు