పండగకు వస్తానని.. తిరిగి రాని లోకాలకు

12 Dec, 2018 13:54 IST|Sakshi
గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందిన జార్జి (ఇన్‌సెట్‌) జార్జి (ఫైల్‌ )

గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి

మృతునిది మైదుకూరు మండలం గంజికుంట గ్రామం

శోకసంద్రంలో కుటుంబ సభ్యులు

బద్వేలు అర్బన్‌ : ఈ సారి పనికి వెళ్లి పండుగ (క్రిస్మస్‌) నాటికి తిరిగి వస్తా .. కుటుంబ సభ్యులమంతా సంతోషంగా పండుగ జరుపుకుందాం అని చెప్పి బయలుదేరిన ఆ యువకుడిని విధి చిన్నచూపు చూసింది. మృత్యుశకటంలా దూసుకొచ్చిన గుర్తు తెలియని వాహనం ఆ యువకుడిని బలిగొంది. కుటుంబ సభ్యుల ఆశలపై నీళ్లుచల్లింది. ఇంటికి పెద్దదిక్కుగా ఉంటూ అటు తల్లిదండ్రులను, తమ్ముళ్లను, భార్యబిడ్డను పోషించే ఆ యువకుడి అకాల మరణం ఆ కుటుంబంలో విషాదం నింపింది. వివరాల్లోకి వెళితే బద్వేలు సమీపంలోని తొట్టిగారిపల్లె వద్ద మంగళవారం తెల్లవారుజామున ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొని మైదుకూరు మండలం గంజికుంట గ్రామానికి చెందిన దాసరిజార్జి (22) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. డి.బాబు, మేరమ్మలకు ముగ్గురు కుమారులు కాగా వారిలో పెద్దవాడైన జార్జి సెంట్రింగ్‌ పని చేసి కుటుంబాన్ని పోషిస్తుండేవాడు.

ఇతనికి బి.మఠం మండలం రేకలకుంట గ్రామానికి చెందిన తులసితో రెండేళ్ల క్రితం వివాహం కాగా వీరికి ఏడాది పాప ఉంది. జార్జి నెల్లూరుజిల్లా కావలిలో గత కొన్ని రోజులుగా సెంట్రింగ్‌ పని చేస్తూ ఉన్నాడు. శనివారం స్వగ్రామానికి వెళ్లిన జార్జి ఆది, సోమవారాలు కుటుంబ సభ్యులతో గడిపి తిరిగి కావలికి వెళ్లేందుకు మంగళవారం తెల్లవారుజామున 2–30 గంటలకు తన ద్విచక్ర వాహనంలో బయలుదేరాడు. 4 గంటలకు బద్వేలు సమీపంలోని తొట్టిగారిపల్లె వద్దకు వచ్చేసరికి గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. గ్రామంలోని మృతుని బంధువులు మృతదేహాన్ని పరిశీలించి జార్జిగా అనుమానించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారంతా సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని జార్జిగా గుర్తించి బోరున విలపించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అర్బన్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఘటనా స్థలంలో మూడు గేదెలు మృతి
తొట్టిగారిపల్లె సమీపంలో జార్జి మృతి చెందిన స్థలంలో మూడు గేదెలు కూడా మృతిచెంది ఉన్నాయి. అంతేకాకుండా ప్రమాదస్థలంలో వాహనానికి సంబం ధించిన చివరి నాలుగు అంకెల నంబర్‌ ప్లేటుతో పాటు ఫుట్‌బోర్డు కూడా లభించింది. దీనిని ప్రకారం ఏదైనా భారీ వాహనం గేదెలను ఢీకొని జార్జిని కూడా ఢీకొట్టి ఉండవచ్చని మృతుని బంధువులు, పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కూడా ఆ కోణంలోనే విచారిస్తున్నారు.

మరిన్ని వార్తలు