ఈ నెలాఖరుకు వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు

12 Apr, 2020 04:30 IST|Sakshi

వీటి నుంచే రైతులకు అన్ని వ్యవసాయ సేవలు

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12 వేల కేంద్రాలు

భూసారం, విత్తనాల నాణ్యత పరీక్షల కిట్ల కొనుగోలుకు ఏర్పాట్లు

సాక్షి, అమరావతి: వ్యవసాయ సంబంధ సేవలన్నింటినీ గ్రామాల్లోనే రైతులకు అందించేందుకు ఉద్దేశించిన వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు ఈ నెలాఖరులోగా రాష్ట్రంలో ఏర్పాటు కానున్నాయి. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మానస పుత్రికలుగా భావించే ఈ రైతు భరోసా కేంద్రాలన్నీ వచ్చే ఖరీఫ్‌ నుంచి రైతులకు సాగు సంబంధ సేవలను అందిస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు కానున్న 12 వేల రైతు భరోసా కేంద్రాల్లో 3 వేల కేంద్రాలు ఇప్పటికే ముస్తాబయ్యాయి.

లాక్‌డౌన్‌ పూర్తయ్యాక మిగతా 9 వేల కేంద్రాలకు పెయింటింగ్, బ్రాండింగ్‌ పూర్తి చేసేలా వ్యవసాయాధికారులు ఏర్పాటు చేశారు.   అవసరమైన ఫర్నీచర్, ఇతర సామగ్రి ఈ వారాంతానికి అందుతుందని భావించినా లాక్‌డౌన్‌ ఆటంకంగా నిలిచింది. సాధ్యమైనంత త్వరలో ఫర్నీచర్‌ను సరఫరా చేయాల్సిందిగా కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఇక.. ఈ కేంద్రాల్లో కీలకమైన భూసారం, ఎరువులు, విత్తనాల నాణ్యత పరీక్షల మినీ కిట్ల కొనుగోలు బాధ్యతను వ్యవసాయ శాఖ కమిషనర్, ఏపీ సీడ్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు అప్పగించారు. రైతు భరోసా కేంద్రాల్లో కీలక స్థానాల్లో ఉండే గ్రామ వ్యవసాయ, ఉద్యాన, పట్టు సహాయకులకు ఇప్పటికే రైతులకు అందించే సేవలపై శిక్షణ ఇచ్చారు. 

రైతు భరోసా కేంద్రాలతో ప్రయోజనాలివే..
► రైతులకు అధిక ఆదాయం, ప్రజలకు ఆహార భద్రత  ప్రధాన ఉద్దేశం.
► ప్రతి కేంద్రంలో వ్యవసాయం, అనుబంధ రంగాలకు చెందిన సహాయకులు ఉంటారు. వీరు రైతులకు తలలో నాలుకలా ఉండి వాళ్లకు కావాల్సిన అన్ని రకాల సేవలు అందిస్తారు.
► రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సరఫరా అవుతాయి. భూసార పరీక్షలు జరుగుతాయి. 
► భూసార పరీక్షల ఆధారంగా ఏయే పంటలు వేసుకోవచ్చో సలహా ఇస్తారు. మంచి విత్తనాలు ఏవో గుర్తించి సూచిస్తారు. 
► అనవసరంగా ఎరువులు, పురుగు మందులు వాడకుండా ప్రకృతి, సేంద్రీయ పద్ధతుల్లో తెగుళ్ల నివారణకు మార్గాలు చెబుతారు.
► ఈ కేంద్రాలకు అనుబంధంగా ఉండే అగ్రి షాప్స్‌ నుంచి వ్యవసాయ పనిముట్లు, పంటల సాగు పద్ధతులు, తెగుళ్ల నివారణోపాయాలు, మార్కెటింగ్‌ మెళకువలు నేర్పుతారు. 
► ఇ–క్రాప్‌ బుకింగ్‌కు రైతుకు తోడ్పడతారు. ఏ గ్రామంలో ఎంతమంది రైతులు, కౌలు రైతులు ఉన్నారో గుర్తించి ప్రభుత్వ రాయితీలకు సిఫార్సు చేస్తారు.
► విత్తనం వేసింది మొదలు మార్కెటింగ్, గిరాకీ సరఫరా వరకు ఈ కేంద్రాలు రైతులకు తోడ్పడతాయని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు