జగనన్న పథకాలే గెలిపిస్తాయి

25 Mar, 2019 10:38 IST|Sakshi

సాక్షి ,దేవరపల్లి :  27ఏళ్ల యుక్తవయస్సులోనే రాజకీయ ప్రవేశం చేసిన తలారి వెంకట్రావు 23 ఏళ్లపాటు ప్రజల్లోనే ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తరఫున చురుగ్గా పనిచేశారు. వైఎస్సార్‌సీపీ ఆవిర్భావంతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెనుక నడిచిన ఆయన గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయారు. మళ్లీ గోపాలపురం స్థానం నుంచి పోటీకి దిగారు. ఈ నేపథ్యంలో తలారి అంతరంగం  


ప్రశ్న : రాజకీయాల్లోకి రావడానికి స్ఫూర్తి?
వెంకట్రావు :  అంబేడ్కర్‌తోపాటు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి స్ఫూర్తి. ఆయన చేసిన ప్రజాప్రస్థానం నాకు రాజకీయ ఓనమాలు నేర్పింది.  


ప్రశ్న : 2014 ఎన్నికల్లో  ఓటమి బాధించిందా?
వెంకట్రావు : లేదు. నా ఎదుగుదలకు నాందిగా భావించా. 2014 ఎన్నికల్లో గోపాలపురం నుంచి పోటీచేసే అవకాశాన్ని వైఎస్‌ జగన్‌ కల్పించారు. నియోజకవర్గం మొదటి నుంచీ టీడీపీ కంచుకోటగా ముద్రపడింది. స్వల్పతేడాతోనే ఓడాను. టీడీపీ అభ్యర్థిని ఓటమి అంచుల వరకూ తీసుకొచ్చాను. అది నా తొలి విజయం. 


ప్రశ్న :  గెలుపు అవకాశాలెలా ఉన్నాయి?  
వెంకట్రావు: గెలుపు ఖాయం. భారీ మెజార్టీనే నా లక్ష్యం. ఐదేళ్లుగా నేను చేసిన పోరాటాలు, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్న పథకాలే నన్ను గెలిపిస్తాయి.  


ప్రశ్న: కుటుంబ సభ్యుల సహకారం?
వెంకట్రావు: చాలా బాగుంది. తల్లిదండ్రులు యేసుదాస్, విజయలక్ష్మి, భార్య పరంజ్యోతి, సోదరీమణులు నా తరఫున ప్రచారం చేస్తున్నారు.  


ప్రశ్న: నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు ఏమున్నాయి? 
వెంకట్రావు: పరిష్కారానికి నోచుకోని సమస్యలు అనేకం ఉన్నాయి. ప్రధానంగా పేదలకు ఇళ్లస్థలాలు, గృహాలు అందలేదు. వ్యవసాయరంగానికి విద్యుత్‌ కొరత ఉంది. మెట్ట భూములకు సాగునీటి ఎద్దడి నెలకొంది. వీటి పరిష్కారానికి కృషి చేస్తా.  


ప్రశ్న: చదువు, ఉద్యోగం గురించి చెబుతారా?  
వెంకట్రావు:  ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ డిప్లమా పూర్తి చేసిన అనంతరం  1992లో ఎస్సైగా ఎంపికయ్యా. కానీ రాజకీయాలంటే ఆసక్తి. అందుకే ఆ అవకాశాన్ని వదిలేశా. ప్రజాసేవే నాలక్ష్యం.  

మరిన్ని వార్తలు