అభివృద్ధి పథంలో నడిపిస్తా

9 Apr, 2019 14:58 IST|Sakshi

గౌతు కుటుంబ పాలనలో నియోజకవర్గ ప్రజలు నలిగిపోయారు

అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తా

‘సాక్షి’తో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు

సాక్షి, పలాస (శ్రీకాకుళం): నియోజకవర్గానికి భౌగోళికంగా విశిష్టత ఉంది. జీడి పరిశ్రమకు పెట్టింది పేరు. ఇక్కడి నుంచి జీడి పప్పు ప్రపంచ నలుమూలలకు ఎగుమతి అవుతోంది. తీర ప్రాంతంతో పాటు సువిశాల అటవీ ప్రాంతం ఉంది. వాణజ్య కేంద్రంగా గుర్తింపు పొందింది. కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు వెళ్తోంది. అభివృద్ధికి కావాల్సిన అన్ని వనరులు ఉన్నాయి. అయినా వెనుకబడి ఉంది. తాగు, సాగునీరు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ పనులు ముందుకు సాగడం లేదు. ఏళ్లుగా ఒకే కుటుంబ పాలనలో ఉండడంతో అభివృద్ధి కుంటుపడింది. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తానని యువ వైద్యుడు ముందుకు వచ్చాడు. వైఎస్సార్‌సీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నారు. సాక్షితో ఆయన మనోగతాన్ని పంచుకున్నారు.

సాక్షి: నియోజకవర్గం ప్రజలతో ఎలా మమేకమయ్యారు?
అప్పలరాజు: నేను ఈ నియోజకవర్గంలోని వజ్రపుకొత్తూరు మండలం దేవునల్లాడలో జన్మించాను. ప్రాథమిక విద్యాభ్యాసం ఇక్కడే పూర్తి చేశాను. వైద్య వృత్తిలోకి వచ్చిన తర్వాత పలాసలోనే ప్రాక్టీసు పెట్టాను. పదేళ్లగా ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉన్నాను. వైద్యునిగా ప్రజల కష్టాను అతి దగ్గర నుంచి చూసిన వాడిని. సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనే వాడిని. ప్రజలతో మమేకమయ్యాను.

సాక్షి: నియోజకవర్గంలోని మీరు గుర్తించిన సమస్యలేమిటి?
అప్పలరాజు: నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ సమస్య చాలా తీవ్రంగా ఉంది. సమస్య పరిష్కారానికి గత పాలకులు చర్యలు తీసుకోలేదు. పలాసలో ప్రజలకు ప్రభుత్వ విద్య, వైద్యం అందడం లేదు. కనీసం ప్రభుత్వం డిగ్రీ కళాశాల లేదు. రైతులకు సాగునీరు, తాగునీటి సమస్యలు ఉన్నాయి. ఉద్దానంలో ఎక్కువగా ఉద్యాన పంటలు పండుతాయి. వారికి రైతు బజారు అవసరం ఉంది. కాశీబుగ్గలో ప్‌లైఓవరు బ్రిడ్జి పెండింగ్‌లో ఉంది. జీడి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాల్సి అవసరం ఉంది. మత్స్యకారలకు జెట్టీలు, ఫిషింగ్‌ హార్బరు నిర్మాణం, పరిశ్రమల అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలి. గిరిజన గ్రామాలను ఐదో షెడ్యూల్‌లో చేర్చాలి. అప్పుడే వారికి అభివృద్ధి ఫలాలు అందుతాయి.

సాక్షి: సమస్యల పరిష్కారానికి ఎలా కృషి చేస్తారు?
అప్పలరాజు: మనస్సు ఉంటే మార్గం లేకుండా ఉండదు. ప్రభుత్వం నుంచి ఎలాగైనా వీటిని సాధించి పెడతాను. ఇక్కడి సమస్యలన్నింటినీ జగన్‌మోహన్‌రెడ్డికి నివేదించాను. తన పాదయాత్రంలో కూడా ఆయన స్వయంగా తెలుసుకున్నారు. పరిష్కరిస్తానని హామీ కూడా ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కొక్క సమస్యను పరిష్కరిస్తాం.

సాక్షి: టీడీపీ పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు మీరు ఎలా న్యాయం చేస్తారు?
అప్పలరాజు: రాజకీయాలకు అతీతంగా ప్రజలందరికీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తాను. సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడతాము. గత పాలనలో నిర్లక్ష్యానికి గురైన ప్రతి ఒక్కరికీ అండగా ఉంటామని ఇప్పటికే జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. వారికి న్యాయం చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటాం.

సాక్షి: ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి మీ వ్యూహాలు ఏమిటి?
అప్పలరాజు: కుటుంబ పాలన పోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. రాష్ట్రంలో కూడా మార్పు కావాలని కోరుకుంటున్నారు. జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలనే నిర్ణయానికి ప్రజలు వచ్చేశారు. మాటమార్చని, మడం తిప్పని వైఎస్‌.రాజశేఖరరెడ్డి వలె ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డిని కూడా ప్రజలు అదే స్థాయిలో ఆదరిస్తున్నారు. ఇవే మా విజయానికి సోపానాలు. అంతేకాకుండా గౌతు కుటుంబ పాలనపై ప్రజలు విసిగు చెందిఉన్నారు. అది మాకు ప్లస్‌ అవుతుంది. ప్రజలు కొత్త నాయకత్వాన్ని కోరుతున్నారు. వైఎస్సార్‌ స్వర్ణపాలన రావాలంటే జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు.


 

మరిన్ని వార్తలు