ఆ సెక్యూరిటీపైనే అవ్యాజ ప్రేమ

22 Nov, 2018 11:25 IST|Sakshi
విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డు

ఐదేళ్లుగా వాటికే కాంట్రాక్టు

గడువు ముగిసినా మళ్లీ వాటికే పొడిగింపు

సింహాచలం దేవస్థానంలో సిత్రాలు

సాక్షి, విశాఖపట్నం: సింహాచలం దేవస్థానంలో సెక్యూరిటీ కాంట్రాక్టు వ్యవహారంపై పెద్ద దుమారం రేగుతోంది. ఏళ్ల తరబడి ఒకే సంస్థకు సెక్యూరిటీ కాంట్రాక్టు ఖరారు కావడం, నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టును పొడిగించడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దేవస్థానంలో దాదాపు 120 మంది వరకు సెక్యూరిటీ గార్డులు విధులు నిర్వహిస్తుంటారు. సెక్యూరిటీ గార్డులను సరఫరా చేయడానికి దేవస్థానం ఏటా టెండర్లను ఆహ్వానిస్తుంది. ఇందులో ఎవరు తక్కువ సొమ్ముకు గార్డులను సరఫరా చేస్తారో వారికే టెండరు ఖరారు చేస్తారు. ఏడాది పాటు వీరి టెండరు అమలులో ఉంటుంది. గడువు ముగియడానికి రెండు నెలల ముందే కొత్తగా టెండర్లను పిలవాల్సి ఉంటుంది. ఇలా దాదాపు ఐదేళ్లుగా స్కాట్‌లాండ్‌ అనే సెక్యూరిటీ సంస్థ సింహాచలం దేవస్థానం అవసరాలకు సెక్యూరిటీ గార్డులను సరఫరా చేస్తోంది. 2016 అక్టోబర్‌తో స్కాట్‌లాండ్‌ సంస్థకు గడువు ముగిసినా మరో ఏడాదికి అంటే 2017 వరకు కొనసాగించడానికి అనుమతి పొందినట్టు సమాచారం. 2017లో టెండర్లు ఆహ్వానిస్తే ఇండియన్‌ సెక్యూరిటీ అనే సంస్థకు ఖరారు కాగా ఏదో మతలబుతో స్కాట్‌లాండ్‌ సెక్యూరిటీ చొరబాటుకు అనుమతించినట్టు చెబుతున్నారు. ఈ సంస్థ ఒప్పందం కూడా 2018 అక్టోబర్‌ ఆఖరుతో ముగిసింది.

ముందుగా టెండర్లను పిలవకుండా మళ్లీ ఆ సంస్థలకే సెక్యూరిటీ కాంట్రాక్టును ఏడాది పొడిగించడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. నిబంధనల ప్రకారం టెండర్లను ఆహ్వానిస్తే ఆసక్తి ఉన్న వారు టెండర్లలో పాల్గొంటారు. తక్కువ ధరకు కోట్‌ చేసిన వారికి టెండర్లు ఖరారు చేస్తారు. కా>నీ ఏదో విధంగా నాలుగైదేళ్లుగా ఒకట్రెండు సంస్థలే వీటిని దక్కించుకోవడం వెనక ఉన్నతాధికారుల ‘కృషి’ ఉందని చెబుతున్నారు. ఏటా వీరికే సెక్యూరిటీ కాంట్రాక్టు దక్కుతుండడంతో టెండర్ల సమయంలో ముందుగా లీకులిస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సెక్యూరిటీ కాంట్రాక్టరు అధికార పార్టీ ముఖ్య నేతలకు అత్యంత సన్నిహితులన్న ప్రచారం కూడా ఉంది. కాగా సెక్యూరిటీ కాంట్రాక్టు కొనసాగింపు వ్యవహారంపై సింహాచలం దేవస్థానం ఈవో రామచంద్రమోహన్‌ను వివరణకు ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరు. 

జీతాల్లోనూ కోత
మరోవైపు ఈ సంస్థల గార్డులకిచ్చే జీతాల్లోనూ కోత విధిస్తున్నారు. ఒక్కో గార్డుకు రోజుకు రూ.368.42 చొప్పున దేవస్థానం సంబంధిత కాంట్రాక్టరుకు చెల్లిస్తుంది. అంటే ఒక్కో గార్డుకు నెలకు రూ.11 వేలు జీతం అందాలి. కానీ కాంట్రాక్టరు రూ.6500–7000కి మించి చెల్లించడం లేదని చెబుతున్నారు. మిగలిన సొమ్ములో కొంత దేవస్థానం అధికారులకు మామూళ్లుగా చెల్లిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.  అంతేకాదు.. సెక్యూరిటీ గార్డులకు నెలనెలా పీఎఫ్, ఈఎస్‌ఐ సొమ్ము కూడా కాంట్రాక్టరు సక్రమంగా చెల్లించడం లేదని తెలుస్తోంది. దీనిపై కొన్నాళ్ల క్రితం గార్డులు ఆందోళనకు దిగడంతో నామమాత్రంగా కొద్దిమందికి చెల్లిస్తున్నారని అంటున్నారు.  

మరిన్ని వార్తలు