బొబ్బిలిలో బడుగుల గర్జన

24 Nov, 2023 06:24 IST|Sakshi
బొబ్బిలిలో మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు

ఘనంగా సామాజిక సాధికార బస్సు యాత్ర 

నియోజకవర్గం నలు దిక్కుల నుంచి వేలాదిగా ప్రజలు రాక 

జై జగన్‌.. జై వైఎస్సార్‌సీపీ నినాదాలతో హోరెత్తించిన జనం 

సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సామాజిక సాధికార విజయ నినాదంతో గర్జించారు. బుధ­వారం బొబ్బిలిలో జరిగిన వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలకు నియోజకవర్గం నలు దిక్కుల నుంచి ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. వందలాది బైక్‌లతో యువకులు ర్యాలీగా వచ్చారు. ముందుగా మెట్టవలసలో కొత్తగా నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం (ఆర్‌బీకే), భారత్‌ నిర్మాణ్‌ సేవా కేంద్రం–వెల్‌నెస్‌ సెంటర్‌ భవనాలను డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, వైఎస్సార్‌సీపీ రీజినల్‌ కోఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి, బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకటచిన్న అప్పలనాయుడు ప్రారంభించారు. అనంతరం నియోజకవర్గంలో అట్టహాసంగా యాత్ర నిర్వహించారు. బొబ్బిలి శ్రీకళాభారతి ఆడిటోరియం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వేలాది మంది పోటెత్తారు. జై జగన్‌... జై వైఎస్సార్‌సీపీ నినాదాలతో ప్రజలు హోరెత్తించారు. 

నాలుగేళ్లలో ఎంతో మేలు: శంబంగి 
రైతులు ఎక్కువగా ఉన్న బొబ్బిలి నియోజకవర్గంలో ఈ నాలుగేళ్లలో కొత్తగా 11,500 ఎకరాలకు సాగునీరు అందించామని, మరో 4,500 ఎకరాలకు నీరందించడానికి పనులు చేయాల్సి ఉందని ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్నఅప్పలనాయుడు చెప్పారు. ఈ సభలో ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, బొత్స అప్పలనర్సయ్య, బడ్డుకొండ అప్పలనాయుడు, అలజంగి జోగారావు, ఎమ్మెల్సీ డాక్టర్‌ పెనుమత్స సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. 
విజయనగరం జిల్లా బొబ్బిలిలో నిర్వహించిన సామాజిక సాధికార యాత్ర సభకు హాజరైన అశేష జనవాహినిలో ఓ భాగం 

బలహీనవర్గాలకు పెద్ద పదవులిచ్చిన సీఎం జగన్‌: ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు 
పెత్తందారులకు మాత్రమే పెద్దపీట వేసిన టీడీపీ పాలనకు భిన్నంగా బలహీనవర్గాలకు పెద్ద పదవులు కట్టబెట్టిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు చెప్పారు. సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వారికీ సీఎం జగన్‌ సముచిత స్థానం ఇచ్చారన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిచ్చారని తెలిపారు. ధనవంతుల పిల్లల్లాగే పేదల బిడ్డలకు ఇంగ్లిష్‌ మీడియం విద్యను అందుబాటులోకి తెచ్చారన్నారు. బడుగు, బలహీన వర్గాలు సాధించిన సాధికారత కొనసాగాలంటే సీఎం వైఎస్‌ జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు.  

సంక్షేమ పాలన జగన్‌తోనే సాధ్యం:  పుష్పశ్రీవాణి 
సంక్షేమ పాలన సీఎం వైఎస్‌ జగన్‌తోనే సాధ్యమని కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి అన్నారు. వివిధ సంక్షేమ పథకాల కింద దళితులకు రూ.75 వేల కోట్లు, గిరిజనులకు రూ.25 వేల కోట్ల ఆర్థిక ప్రయోజనం అందించారని చెప్పారు. 

బొబ్బిలి గడ్డపై జనసునామీ: మజ్జి శ్రీనివాసరావు 
సీఎం వైఎస్‌ జగన్‌ పిలుపుతో జరుగుతున్న సామాజిక సాధికార యాత్రకు బొబ్బిలి గడ్డపై జనసునా­మీ పోటెత్తిందని విజయనగరం జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు చెప్పారు. బొబ్బిలి ప్రజల చిరకాల వాంఛ రెవెన్యూ డివిజన్‌ను సీఎం జగన్‌ సాకారం చేశారని చెప్పారు. చెరకు రైతుల బకాయిలు సుమారు రూ.35 కోట్లు చెల్లించారన్నారు. గతంలో ఇక్కడ గెలిచిన బొబ్బిలి రాజులు పదవుల కోసం పార్టీ మారారని, ఆస్తులు పెంచుకోవడమే తప్ప ప్రజల కష్టాలను పట్టించుకోలేదని విమర్శించారు.   

మరిన్ని వార్తలు