ఉచిత రీచ్‌లలో... దేశం వసూలు

11 Apr, 2016 01:21 IST|Sakshi
ఉచిత రీచ్‌లలో... దేశం వసూలు

లారీకి రూ. 300 కట్టాల్సిందేనని హుకుం..
ఓ నాయకుడి ఆదాయం రోజుకు రూ. 60 వేలు
రోడ్ల నిర్మాణం పేరిట తమ్ముళ్ల దందా

 
ప్రాతూరు (తాడేపల్లి రూరల్) : తాడేపల్లి మండల పరిధిలోని ఉచిత ఇసుక రీచ్‌లలో లోడింగ్ కన్నా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు డబ్బులు వసూలు చేసే కార్యక్రమాన్ని ఆదివారం నుంచి ప్రారంభించారు. గతంలో కూడా ఇదే విధంగా వసూలు చేస్తే మంగళగిరి సీఐ హరికృష్ణ నేతృత్వంలో వారిని అడ్డుకుని నిలువరించారు. అయితే తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ నాయకుడు తన ఆధీనంలో ఉన్న 40 లారీలకు ట్రిప్పుకు రూ. 300 చొప్పున వసూలు చేస్తున్నారు.

రూ. 300 చెల్లించిన లారీ యజమాని సీరియల్ లేకుండా డెరైక్టుగా లోపలకు వెళ్లి ఇసుక లోడు చేయించుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. అలా ఒక్కో లారీ రోజుకు 5-6 ట్రిప్పులు వేస్తుండగా, ఆ నాయకుడి ఆదాయం రోజుకు రూ. 60 వేలుగా ఉంది. వాస్తవానికి ఇసుక రీచ్‌లలోకి పొక్లెయిన్ యజమానులు రోడ్లు నిర్మించాల్సి ఉండగా, గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు రోడ్లు తాము వేస్తామని, డబ్బులు కట్టాల్సిందేనని గ్రామానికి చెందిన లారీ యజమానుల దగ్గర వసూలు చేస్తూ తమ జేబులు నింపుకుంటున్నారు.


గతంలో రోడ్లు వేసేందుకు మూడు రోజుల వ్యవధిలో రూ. 2.30 లక్షలు వసూలు చేసిన వీరు మళ్లీ కొత్తగా వసూలు కార్యక్రమం మొదలుపెట్టారు. నగదు వసూలు చేసేందుకు గ్రామానికి చెందిన ఇద్దరు యువకులను కూడా రోజుకు రూ. 1000 ఇచ్చి ఏర్పాటు చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే సీరియల్‌లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్న లారీలకు లోడు చేస్తారా? లేదా? అని డ్రైవర్లు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎవరైనా లారీ యజమానులు లోడు చేయమని అడిగితే, తమ గ్రామంలో ఇసుక లోడు చేస్తున్నాం,  కాబట్టి తరువాతే మీవి లోడు చేస్తామని అంటున్నారంటే ఉచిత ఇసుక విధానంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు తమ హవా ఏ విధంగా కొనసాగిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

>
మరిన్ని వార్తలు