కపటపు పొత్తుల ఎత్తులు... చిత్తు! | Sakshi
Sakshi News home page

కపటపు పొత్తుల ఎత్తులు... చిత్తు!

Published Fri, Dec 29 2023 12:03 AM

Sakshi Guest Column On Janasena TDP

మరో మూడు మాసాల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల సమర శంఖరావం వినిపించనుంది. ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ గెలుపు సాధ్యాసాధ్యాలను విశ్లేషించుకుంటున్నాయి. గెలుపు గుర్రాలకు టిక్కెట్లు కూడా ఖరారు చేసే పనిని వేగవంతం చేస్తున్నాయి. అధికార వైసీపీ తన అభ్యర్థుల ప్రకటనను రెండు వారాల క్రితం నుండే ప్రారంభించింది. దీనిని దృష్టిలో పెట్టుకున్న తెలుగుదేశం, జనసేన పార్టీలు కూడా అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టాయి. ఈ క్రమంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ ఏపీ రాజకీయాల్లో అడుగు పెట్టారు. అది కూడా తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వడానికి మాత్రమే. ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్య ఇదే అసలు సమస్యగా మారినట్లు కనిపిస్తోంది. 

సీఎం అభ్యర్ధి ఎవరు అన్నదానిపై ఉన్న సందిగ్ధాన్ని పటాపంచలు చేస్తూ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబేననీ, ఇందులో రెండో ఆలోచనే లేదనీ చెప్పారు.  అందుకు పవన్‌ కూడా అంగీకరించారని అన్నారు. దీంతో ఇప్పటి వరకూ ‘సీఎం ... సీఎం ...’ అంటూ గొంతు చించుకుని నినాదాలు చేసిన జన సైనికులు నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. లోకేశ్‌ బాహా టంగా సీఎం అభ్యర్థిని ప్రకటించినా... జనసేనాని మాత్రం కిమ్మనకుండా ఉండి పోవడంతో రా్రçష్టంలో ఆ పార్టీని నమ్ము కున్న సామాజికవర్గ నేతలు, కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంది. 

ఇదిలా ఉండగా పీకే వ్యూహాలు మొట్ట మొదటిగా జన సేన పార్టీపైనే ప్రయోగించడం మొదలుపెట్టారన్న వాదన ఇపుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. లోకేశ్‌ ఇంత బాహాటంగా చంద్రబాబే సీఎం అని చెప్పడానికి ప్రశాంత్‌ కిశోర్‌ సలహానే కారణమని అంటున్నారు. ఇప్పటికే తెలంగాణ ఎన్నికల్లో జనసేనను బరిలోకి దింపి కనీసం డిపాజిట్లు కూడా రాకుండా చేసిన చంద్రబాబు వ్యూహానికి ఇప్పుడు ప్రశాంత్‌ కిశోర్‌ సలహా మరింతగా ఉపయోగడిందని అంటున్నారు.

పవన్‌ కల్యాణ్‌ను జీరో చేయడం ద్వారా వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ ప్రభావం ఏమీ ఉండబోదని, వచ్చే సీట్లన్నీ కేవలం తెలుగుదేశం, చంద్ర బాబు ఇమేజ్‌తోనే వచ్చాయని ప్రజల్లోకి, పార్టీ కేడర్‌లోకి తీసుకెళ్లడంలో ప్రశాంత్‌ కిశోర్‌ సూచన గన్‌ షాట్‌గా పనిచేసిందన్నది విశ్లేషకుల మాట. 

నిన్న మొన్నటి వరకూ టిక్కెట్ల కేటాయింపు అంశంలో జనసేనాని అలిగితే చంద్రబాబు ఆయన ఇంటికి వెళ్లినట్లు ప్రచారం జరిగింది. తెలుగుదేశం – జనసేన పొత్తులో భాగంగా తమకు దక్కాల్సిన సీట్లు పోతున్నాయన్న బాధ తెలుగు తమ్ముళ్లలో ఉంది. ఇక జనసేనానిని నమ్ముకుంటే తమ రాజకీయ భవిష్యత్తు అంధకార బంధురమే అన్న ఆందోళన కూడా జనసేన కార్యకర్తల్లో కనిపిస్తోంది.

ఇప్పటికే తెలంగాణ ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు కూడా దక్కని పార్టీ ఆంధ్రలో కూడా అదే పరిస్థితి ఉంటుంది తప్ప గెలిచే అవకాశాలు ఉండవని వ్యూహాత్మకంగా ఒక వాదనను తెలుగు దేశం పార్టీకి చెందిన సీనియర్లు పార్టీ కేడర్‌లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఒక పథకం ప్రకారం జనసేనను పలుచన చేశారని తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలిపై జనసేన పార్టీ నేతలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. 

తమ అధినేత పవన్‌ను సీఎంగా చూడాలన్న అభిలాష నెరవేరకుండా ఉండేందుకు చంద్రబాబు కుయుక్తులు పన్ను తున్నారని జనసైనికులు ఆరోపిస్తున్నారు. సీట్ల సర్దుబాటు అంశంపై కూడా తెలుగుదేశం పార్టీ ఇంతకు ముందొకసారి 28 అసెంబ్లీ సీట్లతో పాటు రెండు లేదా మూడు పార్లమెంటు స్థానాలంటూ మీడియాకు లీకులిచ్చి తమను, తమ పార్టీని తక్కువగా జనానికి చూపిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అసెంబ్లీకి 20 సీట్లు మాత్రమే ఇస్తామంటూ చంద్రబాబు చెబుతున్నారన్న ప్రచారాన్ని కూడా సోషల్‌ మీడియా వేదికగా చేస్తూ వస్తున్నారని ఆరోపిస్తున్నారు.

సీట్ల సర్దుబాటు అంశంపై పవన్‌ కినుక వహిస్తే వచ్చే ఎన్నికల్లో జరగబోయే నష్టాన్ని ముందుగానే అంచనా వేసిన చంద్రబాబు పవన్‌ను కలిసి బుజ్జగింపు ప్రయత్నాలు చేశారని అంటున్నారు. అసలు పవన్‌ లక్ష్యాన్ని మరిచారా, లేక పవన్‌ సీఎం కాకుండా ఉండేందుకు చంద్రబాబు వేసిన ఎత్తుగడకు పవన్‌  గురయ్యారా అని రాష్ట్రంలో చర్చ నడుస్తోంది. 

పార్టీ ఏర్పాటుచేసి 10 ఏళ్లు దాటిన తరువాత కూడా ముఖ్యమంత్రి అవ్వాలన్న లక్ష్యం జనసేన అధినేతకు లేక పోవటం, అందివచ్చిన ప్రతి అంశాన్నీ రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకోవడంలో చంద్రబాబుకు ఉన్న నైపు ణ్యం వంటి కారణాల వల్ల తమ పార్టీ ప్రజాక్షేత్రంలో నిలబడ లేక పోతోందని జనసైనికులు వాపోతున్నారు. తాము బలంగా ఉన్నామని అనుకొంటున్న ఉభయ గోదావరి జిల్లా ల్లోనూ తమకు కావల్సిన సీట్లను అడిగి తీసుకోవడంలో జనసేనాని పూర్తిగా వైఫల్యం చెందారని జనసైనికుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

అంతేకాక తెలుగుదేశం ప్రస్తుతం నియమించుకున్న రాజకీయ సలహాదారు తెలుగుదేశానికి ఉపయోగ పడేలా సలహాలు ఇస్తారనీ, తమకు మాత్రం ఆ సలహాలు నష్టం చేకూర్చేలా ఉంటాయనీ వారి అభిప్రాయంగా కనిపి స్తోంది. మిత్రపక్షంగా ఉన్న జనసేనతో రానున్న రోజుల్లో పొంచి ఉన్న ప్రమాదాన్ని కనిపెట్టే... తెలుగుదేశంవారు పథకం ప్రకారం తమ పార్టీని నిర్వీర్యం చేసే కుట్రకు తెరలేపా రని జనసేన కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు. ఇంత జరుగుతున్నా జనసేనాని మాత్రం కిమ్మనకుండా ఉండటం ఇప్పుడు ఆ పార్టీలో పలు అనుమానాలకు తావిస్తోంది.
పూనూరు గౌతమ్‌ రెడ్డి 
వ్యాసకర్త వైఎస్సార్‌ టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు
మొబైల్‌: 98481 05455

Advertisement
Advertisement