నారా లోకేష్‌కు ఎదురుదెబ్బ | Issue Notices To Nara Lokesh Over His Threatening Comments On Officials - Sakshi
Sakshi News home page

నారా లోకేష్‌కు ఎదురుదెబ్బ

Published Fri, Dec 29 2023 5:32 AM

Issue notices to Lokesh - Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో అవినీతి కేసుల్లో చంద్రబాబుకు రిమాండ్‌ విధింపును తప్పుబట్టడంతోపాటు కీలక సాక్షులుగా ఉన్న  అధికారులను బెదిరిస్తూ వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ వ్యవహారంలో ఆయనకు నోటీసులు జారీచేయాలని విజయవాడ ఏసీబీ న్యాయస్థానం గురువారం ఆదేశించింది. లోకేష్‌ను అరెస్ట్‌ చేసేందుకు అనుమతించాలన్న సీఐడీ పిటిషన్‌పై న్యాయస్థానం కీలక ఆదేశాలివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.

గతంలో 41ఏ నోటీసు కింద సీఐడీ విచారణకు హాజరైన సందర్భంగా విధించిన ఆంక్షలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడం, ఈ కేసుల్లో కీలక సాక్షులుగా ఉన్న అధికారులు, న్యాయస్థానంలో వాంగ్మూలాలు ఇచ్చిన అధికారుల పేర్లను రెడ్‌బుక్‌లో రాశానని.. వారి సంగతి తేలుస్తానని లోకేశ్‌ ఇటీవల పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూ  లలో బెదిరించడం కలకలం రేపింది.


గతంలో విధించిన ఆంక్షలను ఉల్లంఘించడంతోపాటు కేసు దర్యాప్తును ప్రభావితం చేసేందుకు యత్నిస్తున్న ఆయన్ని అరెస్ట్‌ చేసేందుకు అనుమతి కోరుతూ సీఐడీ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌పై విచారించిన విజయవాడ ఏసీబీ న్యాయస్థానం ఈ అంశంలో లోకేశ్‌కు  నోటీసులు జారీచేయాలని ఆదేశించింది. ఆయన్ని అరెస్ట్‌ చేసేందుకు అనుమతించాలన్న సీఐడీ పిటిషన్‌పై సమాధానం చెప్పాలని ఆ నోటీసుల్లో పేర్కొనాలని తెలిపింది. ఈ కేసులో తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 9కు వాయిదా వేసింది. 

ఇవాళ రావాలని సీఐడీ అధికారులకు చెప్పిన లోకేశ్‌ వ్యక్తిగత సిబ్బంది
ఏసీబీ న్యాయస్థానం ఆదేశించిన మేరకు లోకేశ్‌కు నోటీసులు అందించేందుకు సీఐడీ అధికారులు తాడేపల్లి కృష్ణా కరకట్ట మీద ఉన్న ఆయన నివాసానికి గురువారం సాయంత్రం వెళ్లారు. ఆ సమయంలో లోకేశ్‌ నివాసంలో ఉన్నప్పటికీ బయటకు రాలేదు. అధికారులు చాలాసేపు నిరీక్షించినా ఫలితం లేకపోయింది. నోటీసులు అందించేందుకు శుక్రవారం ఉదయం రావాలని లోకేశ్‌ వ్యక్తిగత సిబ్బంది చెప్పారు. దీంతో లోకేష్‌కు నేడు నోటీసులు అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement
Advertisement