నేను బతికే ఉన్నా సారూ!

11 Jul, 2020 12:48 IST|Sakshi
ఎంహెచ్‌ఓ వెంకటరమణకు ఫిర్యాదు చేస్తున్న కృష్ణమ్మ

పారిశుద్ధ్య కార్మికురాలు మృతిచెందినట్లు మరణ ధ్రువీకరణ పత్రం సృష్టి

ఆమె స్థానంలో మరో మహిళను పారిశుద్ధ్య కార్మికురాలిగా నియమించిన వైనం

2012లో జరిగిన ఘటన తాజాగా వెలుగులోకి..  

నెల్లూరు సిటీ: 2012వ సంవత్సరంలో పారిశుద్ధ్య కార్మికురాలిగా విధులు నిర్వహించిన ఓ మహిళను మృతిచెందినట్లుగా ధ్రువపత్రాలు సృష్టించి ఆమె స్థానంలో మరో మహిళను పారిశుద్ధ్య కార్మికురాలిగా నియమించిన ఘటన తాజాగా వెలుగుచూసింది. నెల్లూరు కార్పొరేషన్‌ పరిధిలో 2012 సంవత్సరంలో కృష్ణమ్మ అనే మహిళ పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తుండేది. అప్పట్లో ఆమె ఆరోగ్యం క్షీణించడంతో పారిశుద్ధ్య పనులకు వెళ్లలేకపోయేది. కొన్ని నెలలపాటు పనికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో హెల్త్‌ విభాగంలోని ఓ ఉద్యోగి కృష్ణమ్మ మృతిచెందినట్లు ధ్రువీకరణ పత్రం సృష్టించారు. కృష్ణమ్మ కూతురుగా మరో మహిళను పారిశుద్ధ్య కార్మికురాలిగా నియమించారు. ఈ వ్యవహారం వెనుక హెల్త్‌ విభాగం అధికారులు, సిబ్బంది పాత్ర ఉందని స్పష్టమవుతోంది. అయితే ఆమె తన ఆరోగ్యం కుదుటపడిందని తిరిగి పనిలో చేర్చుకోవాలని గతంలో అధికారులను వేడుకోగా ఆమె స్థానంలో వేరే వాళ్లను నియమించామని చెప్పి పంపించేశారు. దీంతో ఆమె అప్పటి నుంచి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. మరోసారి కార్పొరేషన్‌ అధికారుల వద్ద తన పరిస్థితిని తెలియజేసేందుకు రెండు రోజుల క్రితం కార్పొరేషన్‌ కార్యాలయానికి వచ్చింది. మున్సిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ వెంకటరమణ వద్ద తన గోడు వినిపించింది

విచారణలో బట్టబయలైన నిజాలు  
కృష్ణమ్మ తాను గతంలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేశానని, ఆరోగ్యం సరిగాలేక రాలేకపోయానని, తిరిగి తనను పారిశుద్ధ్య కార్మికురాలిగా తీసుకోవాలని ఎంహెచ్‌ఓ వెంకటరమణను కోరింది. దీంతో ఆమె గతంలో పనిచేసిన వివరాలను పరిశీలించారు. 2012లో అప్పటి ఉద్యోగులు చేసిన అక్రమాలు వెలుగుచూశాయి. బతికి ఉన్న మహిళను చనిపోయినట్లుగా పత్రాలు సృష్టించి ఆమె స్థానంలో మరో మహిళను పారిశుద్ధ్య కార్మికురాలిగా నియమించిన ఘటన వెలుగుచూసింది. కృష్ణమ్మ కూతురుగా రమాదేవి అనే మహిళను పారిశుద్ధ్య కార్మికురాలిగా నియమించారు. ఈ ఘటన వెనుక అప్పటి నాయకులు, అధికారులు పాత్ర ఉందని తెలుస్తోంది. ఈ విషయంపై ఎంహెచ్‌ఓ వెంకటరమణ విచారిస్తున్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు