స్కిల్‌ స్కామ్‌పై టీడీపీ నేతలు అబద్ధాలు:మంత్రి కాకాణి

29 Sep, 2023 13:06 IST|Sakshi

సాక్షి, నెల్లూరు జిల్లా: స్కిల్ డెవలప్‌మెంట్‌ పథకంలో కుంభకోణం జరిగిందని సీఐడీ గుర్తించిందని మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు ప్రభుత్వ హయాంలో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో స్కిల్ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయలేదు, కానీ ఇక్కడికి వచ్చి టీడీపీ నేతలు తాము స్కిల్ డెవలప్‌మెంట్‌ సెంటర్ ఏర్పాటు చేశామని హడావుడి చేశారు. అప్పట్లో నెల్లూరు జిల్లాలో కేవలం రెండు కళాశాలలలో మాత్రమే ఈ కేంద్రాలు ఏర్పాటు చేశారు. చంద్రబాబు హయాంలో యూనివర్సిటీల్లో ఏర్పాటు చేశామని టీడీపీ నేతలు అబద్ధాలు చెప్పారు’’ అని మంత్రి మండిపడ్డారు.

‘‘రూ.3 వేల 370 కోట్ల పథకంలో 370 కోట్లను చంద్రబాబు కొట్టేశారు. సీమెన్స్ కంపెనీ పేరుతో డబ్బులు స్వాహా చేశారు. మాకు ఈ పథకంతో సంబంధం లేదని సీమెన్స్  ఇండియా సంస్థ చెబుతోంది. టీడీపీ నేతలు ఆలోచన లేకుండా యూనివర్సిటీకి వచ్చి అబద్దాలు చెప్పారు. చంద్రబాబు కుంభకోణానికి పాల్పడలేదని యూనివర్శిటీలోని కంప్యూటర్లు చూపెడుతున్నారు. విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో నిర్మించిన స్కిల్ డెవలప్‌మెంట్‌ సెంటర్ భవనానికి తిరుపతి ఎంపీ గురుమూర్తి నిధులు ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వ హయాంలోని స్కిల్ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ఇక్కడ ఏర్పాటు చేశారు’’ అని మంత్రి కాకాణి పేర్కొన్నారు.

‘‘ఈ కేంద్రాన్ని చూపించి టీడీపీ ప్రభుత్వంలో వచ్చిందని ఆ పార్టీ నేతలు అబద్ధాలు చెబుతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా విశ్వవిద్యాలయానికి రూ.57 కోట్లు నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు.. కానీ పైసా కూడా నిధులు ఇవ్వలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో విశ్వవిద్యాలయంలో లైబ్రరీ.. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌తో పాటు హాస్టళ్లను నిర్మించాం’’ అని మంత్రి కాకాణి తెలిపారు.
చదవండి: వామ్మో చినబాబు.. రింగ్‌రోడ్డులో ఎన్ని మలుపులో! 

మరిన్ని వార్తలు