సంజీవనికి సంకెళ్లు

29 Nov, 2018 13:00 IST|Sakshi
మూతపడిన అన్న సంజీవని మెడికల్‌ దుకాణం

 పేదలకు అందని జనరిక్‌ మందులు

మూతబడుతున్న అన్న సంజీవని దుకాణాలు

ప్రకాశం, బేస్తవారిపేట: పేదలను ఆదుకుంటాయనుకున్న జనరిక్‌ మందులు ముఖం చాటేశాయి. దుకాణాల నిర్వహణను ప్రభుత్వం గాలికొదిలేయడంతో పేదల ఆరోగ్యం గాలిలో దీపంగా మారింది. ప్రజలు తమ ఆరోగ్యం కోసం రోజువారీ మందు బిళ్లలకు వందల రూపాయలు ఖర్చు చేయాల్సిన వస్తుంది. బీపీ, షుగరుతో పాటు కీళ్ల, కాళ్ల నొప్పులతో బాధపడుతుంటారు. ఈ నేపథ్యంలో సామాన్యులకు మందులు అందించాలన్న లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జనరిక్‌ మందులను వినియోగంలోకి తీసుకొచ్చాయి. దీంతో ఖర్చు తక్కువతో సాధారణ మందులు దొరుకుతాయని అంతా భావించారు. మందులను ప్రతి గ్రామంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు సైతం జారీ చేశారు.

ఏర్పాటు అంతంత మాత్రమే..
మండల కేంద్రాలతో పాటు, ఎక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో సైతం జనరిక్‌ మందుల షాపులు ఏర్పాటు చేయాల్సి ఉండగా, వెలుగు, డీఆర్‌డీఏ అధికారులు మండల కేంద్రాల్లో మాత్రమే ఒక్కో షాపు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. జిల్లాలో 56 మండలాలు ఉండగా కేవలం 25 జనరిక్‌ షాపులను మాత్రమే ప్రారంభించారు.

షాపులకు తాళాలు
డీఆర్‌డీఏ, వెలుగు–మండల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించే జనరిక్‌ దుకాణాలు మూతపడుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. నిత్యం పర్యవేక్షించి సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు, మండల సమాఖ్య పట్టించుకోకపోవడంతో ఒక్కోటిగా మూతపడుతున్నాయి. జిల్లాలోని చీమకుర్తి, సింగరాయకొండ, పొదిలి, గిద్దలూరు, బేస్తవారిపేట మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన అన్న సంజీవని జనరిక్‌ మెడికల్‌ దుకాణాలు చాలా కాలంగా తెరచుకోవడంలేదు.

అత్యంత చౌకగా..
మందుల షాపుల్లో దొరికే మందుల ధరలతో పోల్చితే జనరిక్‌ మందులు అత్యంత చౌకగా లభిస్తాయి. ముఖ్యంగా రోజువారీ వాడకంలో ఉన్న బీపీ, షుగర్‌ వ్యాధికి సంబంధించి మాత్రలు బయట మందుల షాపుల్లో అత్యధికంగా ఉంటే ఇక్కడ మాత్రం చాలా తక్కువకు లభిస్తాయి. బీపీ ట్యాబ్లెట్లు రూ.60–90 ధర ఉంటే జనరిక్‌లో రకాన్ని బట్టీ రూ.8 నుంచి రూ.18లోపు (పది మాత్రలు) లభిస్తాయి. ఇదే విధంగా క్యాల్షియం ట్యాబ్లెట్ల ధరలో రూ.60 వరకు వ్యత్యాసం ఉంటుంది. దగ్గుకు వాడే సిరప్‌ ధర జనరిక్‌లో రూ.15గా ఉంటే ఇదే బయట మందుల దుకాణంలో రూ.70పైగానే ఉంటోంది. ఇదే విధంగా అన్ని మందుల ధరల్లో వందల రూపాయల్లో తేడా ఉంటుంది. కొన్ని మందుల షాపుల్లో జనరిక్‌ మందులనే సాధారణ మందులుగా తెలియని వారికి అమ్మకాలు చేస్తున్నట్లు ఆరోపణలు వినపడుతున్నాయి.

ఈ పాపం ఏవరిది..?
రోజువారీ కూలీకి వెళ్లే కార్మికులు, పేద, మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధరకే మందులు వస్తుండటంతో జనరిక్‌ మందులు బాగా ఉపయోగపడ్డాయి. ఏర్పాటు చేసిన మొదటి రెండేళ్ల కాలంలో మంచి బిజినెస్‌ జరిగింది. రాను రాను జనరిక్‌ దుకాణాలకు మందులను సరఫరా చేసే ఏజెన్సీలు తక్కువ గడువు ఉన్న మందులు సరఫరా చేయడం ప్రారంభించాయనే ఆరోపణలు వినిపించాయి. జనరిక్‌ దుకాణాలకు సక్రమంగా మందులు సరఫరా చేయకపోవడంతో బిజినెస్‌ తగ్గిపోయిందనే సాకుతో పేదల సంజీవనిలను మూత పడేలా చేస్తున్నారు.

అధికార పార్టీ నాయకుల జోక్యంతో...
అక్కడక్కడా అధికార పార్టీ నాయకుల జోక్యంతో తమ వర్గానికో, బంధువులకో దుకాణాలు ఇప్పించుకోవాలని పావులు కదుపుతున్నారు. జనరిక్‌ షాపుల సమస్యలు పరిష్కరించకుండా వదిలివేస్తున్నారు. జనరిక్‌ దుకాణం మూత పడిన తర్వాత లెక్కలు చూసి మరొకరిని నియమించుకోవడమో, లేక పూర్తిగా తొలగించడమో చేయాలి. కానీ అలాగే వదిలివేయడంతో షాపునకు ప్రతి నెలా బాడుగ, ఫార్మసిస్ట్, కంప్యూటర్‌ ఆపరేటర్‌లకు జీతాలు చెల్లించాల్సి వస్తోంది. ఈ భారమంతా వెలుగు–మండల సమాఖ్య భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికార పార్టీ నాయకులు వెలుగు అధికారులపై ఒత్తిడి పెంచి నెలల తరబడి మూత పడిన దుకాణాలు తెరవకుండ, కొత్తవారిని నియమించుకునే అవకాశం ఇవ్వకపోవడంతో ప్రభుత్వానికి నష్టం జరగడమేకాకుండా, పేదలు కూడా నష్టపోతున్నారు.

జనరిక్‌ దుకాణాన్ని మూత వేస్తున్నాం:బేస్తవారిపేటలో అన్న జనరిక్‌ మెడికల్‌ దుకాణంలో రూ. 30 వేలు మెడిసిన్‌కు, రూ. 30 వేలు నిర్వాహణ నిధులు చూపించలేదు. వచ్చిన నగదు సకాలంలో సకాలంలో బ్యాంక్‌లో చెల్లించలేదు. ఇప్పటికే మండల సమాఖ్యకు రూ.2 లక్షలు నష్టం జరగడం, నూతన ఫార్మసిస్ట్‌ దొరకని కారణంగా అన్న జనరిక్‌ దుకాణానాన్ని పూర్తిగా తొలగిస్తున్నాం.వెలుగు ఏపీఎం నాగశంకర్, బేస్తవారిపేట.

మరిన్ని వార్తలు