నేస్తానికో గుమ్మడి..!

15 Jan, 2020 09:08 IST|Sakshi
నేస్తం ఇంటికి గుమ్మడికాయతో వెళుతున్న గిరిజన కుటుంబం

సాక్షి, శ్రీకాకుళం: సంక్రాంతి అంటేనే సందడి. ఒక్కొక్కరిదీ ఒక్కో రకమైన వేడుక. గిరిజనుల్లో సంక్రాంతిని చాలా మంది విభిన్నంగా జరుపుకుంటారు. కొండల్లో పోడు పంటలను పండించుకుని జీవించే గిరిజనులు దిగువ ప్రాంతాల్లో ఉంటున్న ఇతర కులాల వారితో నేస్తరికం (స్నేహం) చేస్తుంటారు. సంక్రాంతి పండగతో పాటు దసరా, దీపావళి, ఉగాది వంటి పండగలు వచ్చాయంటే గిరిజన సంప్రదాయ ప్రకారం నేస్తం ఇంటికి వారు అప్పటికి పండించే రకరకాల పంటలను తీసుకుని వెళుతుంటారు.

భోగీ రోజున నేస్తం ఇంటికి వెళ్లే గిరిజనులు గుమ్మడికాయ, పెండ్లం (కూరకోసం), అరటి కాయలు, అర టి పళ్లు, కందికాయలు, కందులు, అరటి ఆకులు తీసుకుని వెళుతుంటారు. పండగకు వచ్చే తమ గిరిజన నేస్తానికి దిగువ ప్రాంతంలోని వారు రకరకాల వంటలతో భోజనం పెట్టి కొత్తబట్టలు, బియ్యం, పప్పులు, పిండి వంటలు, దారి ఖర్చులకు కొంత మొత్తం డబ్బులు ఇచ్చి నేస్తాన్ని సంతృప్తి పరిచి పంపిస్తారు. ఇలా సంతృప్తి పొందిన గిరిజన నేస్తం మనసు నిండా దీవించడం ఆనవాయితీ.  

 

మరిన్ని వార్తలు