అమ్మవారిని దర్శించుకున్న అనాథాశ్రమ వృద్ధులు

14 Jan, 2020 14:24 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పండగ సందర్భంగా అనాథాశ్రమాల్లోని వృద్ధులు దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మ ప్రేమ ఆశ్రమం, వృద్ధుల సంక్షేమాశ్రమం నుంచి సుమారు 150 మంది వృద్ధులు మంగళవారం అమ్మవారిని దర్శించుకున్నారు. వీరికి అమ్మవారి ప్రసాదాలతోపాటు దుర్గమ్మ చీరలను ఆలయ ఈవో ఎంవీ సురేష్‌బాబు దగ్గరుండి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండగ రోజు వృద్ధులకు అమ్మవారి అనుగ్రహం ఉండాలని సంకల్పించామన్నారు.

అందులో భాగంగానే అనాధాశ్రమంలోని 150 మంది వృద్ధులకు అమ్మవారి దర్శనం కల్పించడంతోపాటు దుర్గమ్మ చీరలను ఇచ్చామని పేర్కొన్నారు. వారికి దుర్గమ్మ అండగా ఉంటుందన్న భరోసా కల్పించేందుకే అమ్మవారి దర్శనం చేయించామన్నారు. అనంతరం వృద్ధులు మాట్లాడుతూ ‘గతంలో కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి పండగను ఎంతో వైభవంగా జరుపుకునేవాళ్లం. ప్రస్తుతం పిల్లలు, కుటుంబ సభ్యులతో కాకుండా వృద్ధాశ్రమంలోనే సంక్రాంతి జరుపుకోవడం బాధగా ఉన్నా తప్పదు. ఒంటరిగా పండగ జరుపుకున్నప్పటికీ మాకు దుర్గమ్మ అండగా ఉందన్న నమ్మకం కలిగింది’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

చదవండి: జీన్స్‌ వేసుకుంటే అంతరాలయ దర్శనం కల్పించం

మరిన్ని వార్తలు