తేలని ‘పంచాయితీ’!

31 Jul, 2018 02:42 IST|Sakshi

రేపటితో ముగియనున్న సర్పంచుల పదవీకాలం

పర్సన్‌ ఇన్‌చార్జిలా?.. ప్రత్యేక అధికారులా?

2 నుంచి గ్రామ పంచాయతీల్లో పాలనపై ఎటూ తేల్చని సీఎం

చంద్రబాబు వద్ద నెల రోజులుగా పెండింగ్‌లోనే ఫైల్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా సర్పంచ్‌ల పదవీకాలం రేపటితో ముగిసిపోతున్నప్పటికీ అనంతరం పంచాయతీల్లో పాలనను ఎవరికి అప్పగించాలనే అంశంపై ప్రభుత్వం ఎటూ తేల్చకుండా సస్పెన్స్‌ కొనసాగిస్తోంది. రాష్ట్రంలో 12,918 గ్రామ పంచాయతీలు ఉండగా 12,850 చోట్ల సర్పంచ్‌ల పదవీకాలం ఆగస్టు 1వ తేదీతో ముగియనుంది.

సర్పంచ్‌ల పదవీకాలం పూర్తవుతున్నా పంచాయతీల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫైల్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద దాదాపు నెల రోజులుగా పెండింగ్‌లో ఉన్నట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. సకాలంలో ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం పది నెలల ముందు నుంచే కసరత్తు ప్రారంభించినా కీలకమైన రిజర్వేషన్ల అంశాన్ని తేల్చకుండా టీడీపీ సర్కారు ఎన్నికల వాయిదాకే మొగ్గు చూపింది.


3 రకాల ప్రతిపాదనలతో సీఎంకు నివేదిక
పదవీకాలం ముగిసే సర్పంచులనే పర్సన్‌ ఇన్‌చార్జిలుగా కొనసాగించాలా..? లేక ప్రత్యేకాధికారులను నియమించాలా..? లేదంటే సర్పంచ్‌లు, వార్డు సభ్యులతో కలిసి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలా? అనే మూడు రకాల ప్రతిపాదనలతో పంచాయితీరాజ్‌ శాఖ ఉన్నతాధికారులు నెల రోజుల క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదిక అందజేశారు. దీనిపై ముఖ్యమంత్రి తీసుకునే రాజకీయ నిర్ణయానికి అనుగుణంగా అధికారులు పంచాయతీల్లో పాలనకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సి ఉంది.

అయితే ముఖ్యమంత్రి ఎటూ తేల్చకపోవడంతో అధికారులు హైరానా పడుతున్నారు. సోమవారం సాయంత్రంలోగా ముఖ్యమంత్రి ఓ నిర్ణయం తీసుకుంటారని అధికారులు ఆశించినా రాత్రి వరకు అటువంటిదేమీ వెలువడలేదు. ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవడానికి కనీసం రెండు మూడు రోజులైనా సమయం అవసరమని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

మరిన్ని వార్తలు