దాతృత్వాన్ని దోచేశారు..

4 Sep, 2019 08:42 IST|Sakshi
శిథిలమైపోయిన పురాతన కాలం నాటి సత్రం, ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి రియల్‌ ఎస్టేట్‌ ప్లాట్లకు సిద్ధం చేస్తున్న దృశ్యం

వందల మైళ్ల దూరమైనా కాలి నడకనే వెళ్లాల్సిన రోజులవి.. బాటసారులు దారి దోపిడీలు, క్రూరమృగాలతో భయాందోళన చెందుతూ ముందుకు సాగాల్సిన పరిస్థితి.. అలాంటి రోజుల్లో బాటసారుల సౌకర్యార్థం ఓ మాతృమూర్తి కొంత స్థలం ఇచ్చి సత్రం ఏర్పాటు చేయగా కొంతమంది దానిపై కన్నేశారు.. ప్రజాహితం కోసం ఇచ్చిన స్థలాన్ని నిర్లజ్జగా కబ్జా చేశారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. ఇళ్లు నిర్మించుకున్నారు. అదేమని అడిగేవారు లేకపోవడంతో అక్కడ మద్యం దుకాణాన్ని సైతం నిర్వహిస్తున్నారు. రూ.కోట్ల విలువ చేసే స్థలం ఆక్రమణలకు గురైనా సంబంధింత దేవదాయ, రెవెన్యూశాఖల అధికారులు పట్టించుకుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు పట్టణంలో విలువైన ప్రభుత్వ భూములను దర్జాగా ఆక్రమించి రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ వేసేస్తున్నారు.

సాక్షి, కావలి (నెల్లూరు): వందేళ్ల క్రితం వాహనాలు లేని రోజుల్లో ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి రాకపోకలు సాగించే బాటసారులు అలిసిపోతే సేద తీరేందుకు, అవసరరమైతే వంట చేసుకొని భోజనాలు చేయడానికి, రాత్రులు దొంగలు, క్రూర జంతువుల నుంచి రక్షణ నిమిత్తం దాతలు సత్రాలను నిర్మించేవారు. ఈ నేపథ్యంలో కావలి పట్టణంలోని ముసునూరు మీదుగా ఉండే కాలిబాటలో సత్రం నిర్మించి, దానిని నిర్వహించేందుకు బ్రాహ్మణులకు దేవరపల్లి అన్నపూర్ణమ్మ అనే దాత 200 అంకణాలు స్థలాన్ని ముసునూరులో ఇచ్చారు. ఆ స్థలంలో సత్రానికి అవసరమైన భవనాన్ని ఆ రోజుల్లోనే పూర్తిగా బొంతరాయితో నిర్మించారు. అలాగే సత్రాన్ని నిర్వహించడానికి 3.15 ఎకరాల భూమిని కూడా ఇచ్చారు. ఈ భూమిని కౌలుకు ఇవ్వడం ద్వారా వచ్చే రాబడితో సత్రాన్ని నిర్వహించాలనేది దాత లక్ష్యం.

కాలక్రమంలో రవాణా సౌకర్యాలు మెరుగై కాలినడకన రాకపోకలు సాగించే బాటసారులు తగ్గిపోయి అక్కడ వసతి పొందేవారు లేక సత్రం శిథిలమైపోయింది. దీంతో ఈ సత్రంపై ఆక్రమణదారుల కన్నుపడింది. ముసునూరులో సర్వే నంబర్‌ 146/2లో ఉన్న 200 అంకణాల స్థలానికి కొందరు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి 100 అంకణాల స్థలాన్ని కబ్జా చేశారు. ఇక్కడ అంకణం ధర రూ.లక్షకు పైగా ఉంది. అంటే రూ.కోటికి పైగా విలువ చేసే ఈ స్థలాన్ని కబ్జా చేసి దర్జాగా ఇళ్లు నిర్మించుకున్నారు. అలాగే సత్రం స్థలంలో కొంత, రోడ్డు భాగంలో కొంత స్థలాన్ని కబ్జా చేసి మద్యం షాపును నిర్వహిస్తున్నారు. మిగిలిన 100 అంకణాల స్థలాన్ని కబ్జా చేయడానికి ముసునూరులో ఉన్న ఒక వ్యక్తి తాను సత్రానికి ట్రస్టీగా ఉన్నానంటూ నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి శరవేగంగా ఏర్పాట్లు చేసుకొంటున్నాడు.

ఇక ఈ సత్రానికి సంబంధించి సర్వే నంబర్‌ 753–756లలో 3.15 ఎకరాల భూమి ఉంది. మాగాణి భూమి అయిన ఈ పొలానికి కౌలు రూపంలో ఏడాదికి కనీసం రూ.50,000 వస్తుంది. 40 ఏళ్లుగా ఈ భూమిని ముసునూరుకు చెందిన చిన్నబ్బాయ్‌ అనే టీడీపీ నాయకుడు ఆక్రమించుకొని దర్జాగా అనుభవిస్తున్నాడు. ఎకరా కనీసం రూ.50 లక్షలు ధర ఉంటుంది. సత్రానికి సంబంధించిన విలువైన స్థలాన్ని, భూమిని కాపాడాల్సిన దేవదాయశాఖ, రెవెన్యూశాఖలు అసలు దాని గురించి పట్టించుకోకపోవడంతో కబ్జాదారులు అడ్డూఅదుపూ లేకుండా తమ పని తాము చేసుకుపోతున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి కావలికి వచ్చిన సమయంలో సత్రం స్థలాన్ని కబ్జా చేసిన విషయం, పొలాన్ని టీడీపీ నాయకుడి ఆక్రమణలో ఉన్న అంశాన్ని కావలి బ్రాహ్మణ సంఘం నాయకులు తీసుకెళ్లారు. సత్రం స్థలాన్ని, పొలాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, తాను ఉన్నతాధికారులతో మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చారు. సత్రం స్థలంలో బ్రాహ్మణ కల్యాణ మండపం నిర్మించేందుకు రూ.50 లక్షలు నిధులు మంజూరు చేయిస్తానని డిప్యూటీ స్పీకర్‌ ప్రకటించారు.

ప్రభుత్వ స్థలంలో వెంచర్‌..
ముసునూరులోనే పమిడి స్కూలును ఆనుకొని సర్వే నంబర్‌ 179లో 1.04 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అక్కడ అంకణం కనీసం రూ.లక్ష ధర పలుకుతోంది. అంటే సుమారు రూ.5 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని కబ్జాదారులు ధైర్యంగా ఆక్రమించుకొని రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ను వేస్తున్నారు. ఈ విషయం రెవెన్యూ శాఖకు తెలిసినప్పటికీ కిందిస్థాయి ఉద్యోగులు కబ్జాదారుల వద్ద మామూళ్లు తీసుకొని వారి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రూ.కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలాలను, భూములను తమ తాతలు ముత్తాల ఆస్తులుగా కబ్జాదారులు చెర పెడుతుండడం కావలిలో నిత్యకృత్యమైపోయింది. అలాగే పట్టణంలో ఉన్న మందాటి చెరువుకు కట్ట కింద నెల్లూరు వైపు వెళ్లే ప్రధాన రోడ్డు వైపు కబ్జాలు ప్రారంభమయ్యాయి. సుమారు 20 అంకణాల స్థలాన్ని ఆక్రమించుకోవడానికి రాళ్లు పాతారు. ఇక్కడ కూడా అంకణం రూ.లక్షకు పైనే పలుకుతోంది. అంటే రూ.20 లక్షల విలువ చేసే స్థలాన్ని కబ్జా చేయడానికి భూకబ్జాసురులు ఏర్పాట్లు చేసుకొంటున్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా