‘జోలె’ పట్టిన దొర.. ‘జాలి’చూపిన పాలేరు

11 Feb, 2014 13:59 IST|Sakshi
‘జోలె’ పట్టిన దొర.. ‘జాలి’చూపిన పాలేరు

అనపర్తి: కోట్లకు పడగలెత్తిన వారుసైతం అక్కడ జోలెకట్టి బిక్షాటన చేస్తుంటారు.. కూటికి కూడా లేనివారు వారిపై జాలిచూపి ఐదో,పదో సమర్పిస్తారు. ఎలాంటి బిడియం లేకుండా భూస్వామి పట్టిన జోలెలో అతడి పొలంలో కూలిపని చేసేవారి కష్టార్జితమూ పడుతుంది. ఇది ఆ ఊళ్లో అందరూ మనసావాచాకర్మణా భక్తిశ్రద్ధలతో తరతరాలుగా ఆచరిస్తున్న సంప్రదాయం.

తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరంలో కొలువు తీరి, ‘కర్రి’ వంశీకుల ఆడపడుచుగా పరిగణన పొందుతూ, నిత్యపూజలందుకునే గ్రామదేవత సత్తెమ్మ తల్లి జాతర సందర్భంగా ఈ సంప్రదాయాన్ని కళ్లారా చూడొచ్చు. అమ్మవారి జాతర రెండేళ్లకోసారి మూడురోజుల పాటు జరుగుతుంది.

అంతకు ముందు తమ కోరికలు తీర్చమని అమ్మవారికి మొక్కుకున్న పురుషులు.. అవి తీరితే జాతరలో చివరి రోజున.. చిత్రవిచిత్ర వేషాలతో ఊరి వీధుల్లో భిక్షాటన చేస్తారు. నిత్యం వారిని చూసేవారే గుర్తించలేనంతగా ఈ వేషాలు రక్తి కట్టడం విశేషం. సోమవారం జాతర ముగింపు సందర్భంగా మహానేత వైఎస్, సాయిబాబా, పండితులు, పాములవాళ్లు, వికలాంగులు, గీత కార్మికులు, హిజ్రాలు, పలు దేవతల వేషాలు ఆకట్టుకున్నాయి.

మరిన్ని వార్తలు