రాజేష్‌ కోసం ఆశగా నిరీక్షణ

15 Nov, 2018 10:50 IST|Sakshi
రాజేష్‌ కోసం తీరం వైపు ఆశగా చూస్తున్న స్నేహితులు

కుమారుడి కోసం తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు

మల్కాపురం(విశాఖ పశ్చిమ): యారాడ తీరంలో గల్లంతై నాలుగు రోజులు గడిచినప్పటికీ రాజేష్‌ ఆచూకీ లభ్యం కాకపోవడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. గడిచిన ఆదివారం విహారానికి యారాడ వచ్చిన 12 మంది యువకులలో ఆరుగురు సముద్రంలో గల్లంతైన విషయం తెలిసిందే. వీరిలో సోమవారం ఇద్దరు, మంగళవారం ముగ్గురి మృతదేహాలు తీరానికి చేరాయి. మిగిలిన రాజేష్‌ ఆచూకీ కోసం న్యూ పోర్టు పోలీసులు బుధవారం ముమ్మరంగా గాలించారు.

సాయంత్రం చీకటిపడేంత వరకూ గాలించినా ఫలితం లేకపోయింది. గురువారం మళ్లీ గాలింపు కొనసాగించనున్నారు. మరోవైపు నాలుగు రోజులు గడుస్తున్నా తమ కుమారుడి ఆచూకీ లభ్యం కాకపోవడంతో రాజేష్‌ తల్లిదండ్రులు తీవ్రంగా రోదిస్తున్నారు. తమ కుమారుడు క్షేమంగా తిరిగి వస్తాడని గంగమ్మ వైపు ఆశగా చూస్తున్నారు. నెల రోజుల కిందటే ప్రమాదంలో కాలు విరిగిపోతే శస్త్రచికిత్స చేయించామని, మోడ్రన్‌గా ఉండాలనుకునే కుమారుడు కనిపించకుండా పోయాడని విలపిస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి గడిపేందుకు ఇష్టపడే రాజేష్‌ కోసం ప్రస్తుతం ఆ కుటుంబమంతా తీరంలో ఆశగా నిరీక్షిస్తుండడం చూపరులను కలిచివేస్తోంది. మరోవైపు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజేష్‌ కోసం కనీసం బోట్లుపై కూడా గాలించడం లేదని ఆరోపిస్తున్నారు.

మరిన్ని వార్తలు