యాండే.. పులసొచ్చిందండీ

29 Jul, 2018 03:43 IST|Sakshi

గోదావరి పాయల్లోకి వచ్చిన సీజనల్‌ చేప

రుచికరమైన మీనం కోసం విస్తృతంగా వేట

కిలో రూ. 5 వేల వరకూ పలుకుతున్న ధర   

ఖర్చుకు వెనకాడకుండా కొంటున్న మత్స్య ప్రియులు

నరసాపురం: ‘చేపలందు పులస చేప రుచే వేరండి’ అంటారు గోదావరి ప్రియులు. పుస్తెలమ్మి అయినా పులస తినాలనే నానుడి కూడా గోదావరి జిల్లాల్లో ఉంది. వీటిని చూస్తేనే మీన ప్రియులకు పులసంటే ఎంత మక్కువో ఇట్టే అర్థమవుతుంది. ఈ ఏడాది మళ్లీ గోదావరి ప్రజలకు పులస సీజన్‌ వచ్చేసింది. నది పాయల్లోకి ఈదుకుంటూ వస్తున్న పులసలను ఒడిసి పట్టుకోవడానికి మత్స్యకారులు ఒక పక్క శ్రమపడుతుంటే.. మరోపక్క చేపల్ని కొనడానికి స్థానికులు ఎగబడుతున్నారు.

ఎగువ ప్రాంతాల్లో భారీగా కురిసిన వర్షాలతో గోదావరికి వరద వచ్చింది. ఆ ఎర్ర నీటిలో గుడ్లు పెట్టడానికి పులస చేపలు ఎదురు ఈదుకుంటూ వస్తున్నాయి. ఏటా వర్షాల సీజన్‌లో మాత్రమే పులస చేపలు గోదావరి పాయల్లోకి వస్తాయి. దీంతో కొన్ని రోజులుగా మత్స్యకారులు గోదావరి సముద్ర సంగమం నుంచి ధవళేశ్వరం ఆనకట్ట వరకూ పులస వేట కొనసాగిస్తున్నారు.

ఎక్కడి నుంచి వస్తుంది..
పులస నిజానికి సముద్ర చేప. దీని శాస్త్రీయ నామం హిల్సాహిల్సా. దీనినే ఇంగ్లిష్‌లో ఇలిష్‌ అని కూడా అంటారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ ప్రాంతాల్లోని సముద్ర జలాల్లో సంచరిస్తుంది. సంతానోత్పత్తి సమయంలో గుడ్లు పెట్టడానికి అంత దూరం నుంచి ఈదుకుంటూ గోదావరిలోకి వస్తుంది. ఆషాడ, శ్రావణ మాసాల్లో ఇక్కడ గుడ్లు పెట్టిన తర్వాత మళ్లీ సముద్రంలోకి వెళ్లిపోతుంది. అందువల్లే ఈ చేపను చెరువుల్లో పెంచడానికి వీలుండదు. బంగ్లాదేశ్, ఒడిశా తీరాల్లో ఈ చేప దొరికినా.. గోదావరి చేపకున్న రుచి ఉండదని చెబుతారు. 
 
‘ఇలస’ పులసయ్యేదిక్కడే
సముద్రంలో పులసను ఇలసగా పిలుస్తారు. వర్షాలు పడి గోదావరిలోకి ఎర్రనీరు రాగానే సముద్రంలోని ఇలసలు ఈదుకుంటూ వస్తాయి. గోదావరిలోకి వచ్చిన తర్వాత రెండు మూడు రోజుల్లోనే ఇలస పులసగా మారుతుందని మత్స్యకారులు చెబుతారు. రుచిలో కూడా మార్పు వస్తుందంటారు. ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వద్దనున్న వశిష్ట గోదావరి పాయలో పులసలు ఎక్కువగా దొరుకుతాయి.

ఇక్కడికి పది కిలోమీటర్లు దూరంలో ఉన్న అంతర్వేది వద్ద గోదావరి, సముద్ర సంగమ ప్రాంతం నుంచి నదిలోకి ఈ చేపలు వస్తాయి. ఇక తూర్పుగోదావరి జిల్లాలోని గోదావరి తీర ప్రాంతాలైన రాజోలు, గన్నవరం, ఎదుర్లంకలలో పులసల వేట ముమ్మరంగా సాగుతుంది. ప్రస్తుతం నరసాపురం, అంతర్వేది మార్కెట్‌ల్లోనూ రావులపాలెం, సిద్ధాంతం, చించినాడ వంతెనల వద్ద పులసల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. దీంతో ఆ ప్రాంతాలు కొనుగోలుదారులతో కళకళలాడుతున్నాయి. తాము రుచి చూడటమే కాకుండా.. దూర ప్రాంతంలోని తమ వారికి పంపడానికి ఎంత ఖర్చయినా లెక్కచేయకుండా స్థానికులు పులసలను కొనుగోలు చేస్తున్నారు.

సంప్రదాయ పద్ధతిలోనే వేట
గోదావరిలో పులసల వేట సంప్రదాయ నాటు పడవలతోనే సాగుతుంది. పులసల వేట కోసం చెక్క నావలపై మత్స్యకారులు ప్రత్యేక వలలను ఉంచుతారు. వీటిని ‘రంగపొల’ వలలుగా పిలుస్తారు. 20 మీటర్లు పొడవు ఉండే ఈ చిన్నపాటి వలలకే పులసలు చిక్కుతాయని మత్స్యకారులు చెబుతారు. సముద్రంలో వేట సాగించే పెద్ద బోట్లు ద్వారా సాగించే వేటకు ఎక్కువ పులసలు లభించవు. మరో విషయం ఏమిటంటే ఈ చేపలు ఎక్కువగా వేకువజామునే వలలకు చిక్కుతాయి. దీంతో మత్స్యకారులు అర్ధరాత్రి నుంచి వేట సాగిస్తారు.

ఎగుమతులకు ఆస్కారం లేదు..
మిగిలిన చేపల్లా మూడేసి, నాలుగేసి కిలోల చొప్పున పులసలు బరువుండవు. అరకిలో నుంచి కిలోన్నర వరకే బరువు ఉంటాయి. సైజు, డిమాండ్‌ను బట్టి వీటి రూ. 2 వేల నుంచి రూ. 5 వేల వరకు అమ్ముతున్నారు. పులసలకు పెద్దగా డిమాండ్‌ ఉన్నా ఎగుమతులకు ఆస్కారం లేదు. తక్కువ సంఖ్యలో పులసలు దొరకడమే ఇందుకు కారణం. అయితే పులస మనుగడపై పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విస్తృత వేట, గోదావరి నీరు కలుషితం కారణంగా ఈ చేప జాతి మనుగడ ప్రశ్నార్థకమవుతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు