కొబ్బరికి మహర్దశ

12 Oct, 2023 05:38 IST|Sakshi

‘వన్‌ డిస్ట్రిక్ట్‌.. వన్‌ ప్రొడక్ట్‌’గా ఎంపిక 

కోనసీమకు నేడు కేంద్ర బృందం  

క్వాయర్‌ యూనిట్, ఎఫ్‌పీవో, డ్వాక్రా సంఘాల పరిశీలన 

విలువ ఆధారిత ఉత్పత్తుల ప్రోత్సాహంపై వివరాల సేకరణ 

కొబ్బరి కొత్త ప్రాజెక్టులు వచ్చేందుకు అవకాశం 

సాక్షి అమలాపురం: ఒకవైపు పరిశ్రమల లోటు తీర్చడం.. మరోవైపు స్థానికంగా పండే పంటలను ఉప ఉత్పత్తులుగా తయారు చేస్తే రైతుకు లాభసాటి ధర వస్తుందనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభు­త్వం తీసుకుంటున్న చర్యలు రైతుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరి­జిల్లాల్లో వరి తరువాత అతి పెద్ద సాగు కొబ్బరి. దశాబ్దాల కాలం నుంచి సాగవు­తున్నా.. వీటి విలు­వ ఆధారిత పరిశ్రమలు స్థానికంగా లేకపోవడంతో కొబ్బరి మార్కెట్‌ తరచు ఒడుదొడుకులకు లోనవుతోంది. రాష్ట్రంలో సుమా­రు మూడులక్షల ఎకరాల్లో కొబ్బరి సాగ­వుతుండగా.. ఉమ్మ­డి ఉభయ గోదావరి జిల్లాల్లోనే 1.78 లక్షల ఎకరాల్లో సాగులో ఉంది.

దీన్లో ఒక్క డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోనే సుమారు 1.10 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగవుతోంది. గోదావరి జిల్లాలోనే ఏడాదికి 124.72 కోట్ల కాయల  దిగుబడి వస్తున్నట్లు అంచనా. ఇంత పెద్ద దిగుబడి వస్తున్నా తరచు కొబ్బరి సంక్షోభంలో కూరుకుపోవడా­న్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం..  ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక జిల్లా.. ఒక ఉత్పత్తి (వన్‌ డి్రస్టిక్ట్‌.. వన్‌ ప్రొడక్ట్‌)కు కొబ్బరిని ఎంపిక చేసింది. ఈ పథకం కింద జిల్లాలో ఏయే పరిశ్రమలు ఏర్పాటు చేయాలనేదానిపై జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది.

ఒక జిల్లా.. ఒక ఉత్పత్తి ప్రో­త్సాహంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇన్వెస్ట్‌ ఇండియా బృందం గురువారం డా­క­్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిలా­్ల­లో క్షేత్రస్థాయిలో పర్యటించనుంది. హరిప్రీత్‌ సింగ్‌ నేతృత్వంలోని బృందం సభ్యు­లు ముమ్మిడివరం వద్ద ఉన్న వర్జిన్‌ కోకోనట్‌ ఆయిల్‌ యూనిట్‌ను, పేరూరులో మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీల) ఆధ్వర్యంలోని కొబ్బరి తాడు పరిశ్రమను, మామి­డి­కుదు­రు మండలం పాశర్లపూడిలో క్వాయ­ర్‌ బొమ్మల దు­కాణం, క్వాయర్‌ మాట్‌ యూనిట్, చీపుర్ల యూ­నిట్,  కోప్రా యూనిట్, చార్‌కోల్‌ యూనిట్‌లను సందర్శించనున్నారు. ఉద్యానశాఖతోపా­టు జిల్లా పరిశ్రమలశాఖ, డీఆర్‌డీఏ, కేవీఐబీ, హ్యాండ్‌లూమ్‌ అధికారులు వారికి జిల్లాలో కొబ్బరి పరిశ్రమల అవసరాన్ని, అవకాశాలను వివరించనున్నారు.  

వందకుపైగా ఉప ఉత్పత్తులు 
కొబ్బరి నుంచి వందకుపైగా ఉప ఉత్పత్తులను తయారు చేసే అవకాశం ఉంది. కానీ ఉమ్మడి గోదావరి జిల్లాల్లో చెప్పుకొనే స్థాయిలో పెద్ద పరిశ్రమలు లేవు. ఒకటి రెండు ఉన్నా అవి కేవలం క్వాయర్‌ పరిశ్రమలు మాత్రమే. ఇక్కడ పలు రకాల ఉత్పత్తులను తయారు చేసే పరిశ్రమలను ఏర్పాటు చేయవచ్చని ప్రణాళిక సిద్ధం చేశారు. పరిశ్రమలు ఏర్పాటైతే స్థానికంగా యువతతోపాటు మహిళా స్వయంశక్తి సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు అధికంగా మేలు జరుగుతుంది. కొబ్బరికి స్థానికంగా డిమాండ్‌ పెరిగి మంచి ధర లభిస్తుందని రైతులు ఆశిస్తున్నారు.  

మరిన్ని వార్తలు