ముసురు మేఘం.. ఆశల రాగం..

3 Aug, 2019 07:59 IST|Sakshi

కొద్ది రోజులుగా పట్టిన ముసురు

జిల్లాలో విస్తారంగా వర్షాలు

పొలాల బాట పట్టిన రైతులు

సాగులో ఉన్న పంటలకు జీవం

హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు

అంతా కోలాహలం.. ఎటుచూసినా సాగు సంబరం.. మబ్బుల మాటున నీటి కుండ చిరుజల్లులై జాలు       వారుతుంటే అన్నదాతల గుండె ఆశల సవ్వడి చేస్తోంది. ముసురేసిన మేఘమాల ముత్యాల వాన కురిపిస్తుంటే పుడమి తల్లి నుదుటిన నీటి బొట్టు పచ్చని బొట్టై మెరుస్తోంది. ముడుచుకున్న మొగ్గ చినుకు స్పర్శ తాకగానే ఒళ్లు    విరుచుకుని వయ్యారాలు ఒలకబోస్తోంది. ఎదురింటి కృష్ణన్న, పక్కింటి రామన్న..       వెనకింటి సుబ్బన్న తలపాగా చుట్టి, పంచె ఎగ్గట్టి కదులుతుంటే.. పొలాల దారుల్లో పూల వాన స్వాగతం పలుకుతోంది. పంట చేలల్లో పల్లె పడుచు కూనిరాగాల్లో నండూరి ఎంకి పాటకు.. జాలువారిన చినుకు చిటపటల దరువేస్తోంది. ఇప్పటికే గలగలమంటూ పరుగులు పెడుతున్న కృష్ణమ్మ, గోదావరి నదుల అలలపై చిరుజల్లుల నాట్యం చేస్తోంది. ఈ ఏడాది వాన వెల్లువై కర్షకుడి కంట కష్టాల కన్నీటిని కడిగేస్తానంటూ వాతావరణ శాఖ ద్వారా మేఘ సందేశం పంపిందియ

సాక్షి, గుంటూరు: వర్షాలకు పుడమికి పచ్చని రంగు అందినట్లు పొలాలు కళకళలాడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా గత పదిహేను రోజుల నుంచి ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటిదాకా డీలా పడిన రైతుల్లో కొంగొత్త ఆశలు రేకెత్తుతున్నాయి. అన్ని రకాల పొలాలు పదునెక్కాయి. ఉందిలే మంచి కాలం ముందుముందునా అంటూ అన్నదాతలు నాగలి చేతపట్టి పొలంలోకి రెట్టింపు ఉత్సాహంతో అడుగు పెడుతున్నారు. ఇప్పటి వరకు కొందరు వెద పద్ధతిలో నాట్లకు శ్రీకారం చుట్టగా...మరి కొందరు రైతులు విత్తనాలు చల్లుకునే పనిల్లో నిమగ్నమయ్యారు.

తీర ప్రాంతాల్లోని రైతులు పొలాల్లో ఎరువులు చిమ్ముకోవడం, పొలాలకు ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లపై ఎరువులు తొలుకోవడం, వాటిని చిమ్ముకునే పనులకు శ్రీకారం చుట్టారు. ముందుగా కురిసిన వర్షాలకు నార్లు పోసుకున్న రైతులు నారుమడులను జాగ్రత్త చేసుకుంటున్నారు.జిల్లాలో గురువారం రాత్రి నుంచి ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. గుంటూరు నగరం, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, పెదకూరపాడు, తాడికొండ, వేమూరు, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో అధికంగా వర్షపాతం నమోదైంది. మాచర్ల, రేపల్లె, బాపట్ల, గురజాల, చిలకలూరిపేట, వినుకొండ నియోజకవర్గాల్లో జల్లులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షం పడింది.

పంటలకు మేలు
ఖరీఫ్‌ సీజన్లో వేసిన మెట్ట పంటలకు వర్షం మరింత మేలు చేకూర్చనుంది. ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో రైతులు పత్తి, మిరప పంటలు వేశారు. పంటలు వర్షాభావ పరిస్థితులను అధిగమించడంతో రైతుల్లో ఆనందం నెలకొంది. వాణిజ్య పంటలు సకాలంలో వేయడం అందుకు అనుగుణంగా వర్షం కురుస్తుంటంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

లోతట్టు ప్రాంతాలు జలమయం
గుంటూరు నగరంలోని శివారు కాలనీ, ఎక్స్‌టెన్షన్‌ ఏరియాల పరిధిలోని లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులపై నీరు ప్రవహించింది. డ్రెయిన్లు, మురుగు కాలువలు పొంగి పొర్లాయి. దీంతో ట్రాఫిక్‌కు పలు ప్రాంతాల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్లపైకి వరద నీరు చేరడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శివారు కాలనీలో రహదారులు చిత్తడిమయంగా మారాయి. యూజీడీ పనులు జరిగిన ఏరియాల్లో గుంతల్లో నీరు భారీగా చేరింది.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా