బాబోయ్.. ఇదేం ‘పంచాయితీ’

31 Dec, 2013 23:44 IST|Sakshi

సాక్షి, సంగారెడ్డి: నిరుద్యోగుల భవిష్యత్తుతో సర్కారు చెలగాటమాడుతోంది. పంచాయతీ కార్యదర్శి(గ్రేడ్-4) పోస్టుల భర్తీలో సర్కార్ అవలంబించిన ద్వంద్వ ప్రమాణాలు నిరుద్యోగులకు శాపంగా మారాయి. ఖాళీ పోస్టుల సంఖ్యను విడగొట్టి రెండు వేర్వేరు నియామక ప్రకటనలు జారీ చేయడంతో నిరుద్యోగుల్లో గందరగోళం సృష్టిస్తోంది. జిల్లాలో 1,066 గ్రామ పంచాయతీలుంటే 514 క్లస్టర్లుగా విభజించి ఒక్కో క్లస్టర్‌కు ఒక్కో పంచాయతీ కార్యదర్శి పోస్టు మంజూరు చేశా రు. ప్రస్తుతం 318 పంచాయతీ కార్యదర్శులు మాత్రమే పనిచేస్తుండగా అందులో 208 మంది కాంట్రాక్టు ఉద్యోగులే. 110 మంది మాత్రమే రెగ్యూలర్ పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తున్నారు.

దాదాపు 504 ఖాళీలను భర్తీ చేయాల్సి ఉండగా.. ప్రభుత్వం ఈ పోస్టులను విభజించి రెండు వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేయడం నిరుద్యోగుల్లో గందరగోళాన్ని సృష్టిస్తోంది. ఏళ్ల తరబడి కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న 208 మంది కార్యదర్శులను నేరుగా క్రమబద్ధీకరిస్తే ఇతర శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను సైతం క్రమబద్ధీకరించాల్సివస్తుందనే భావనతో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. గత అక్టోబర్ 31న కలెక్టర్ 210 పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేశారు. పదో తరగతి మార్కులపై వెయిటేజీ ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకోడానికి నిరుద్యోగులందరికీ అందరికీ అవకాశం ఇచ్చినా కాంట్రాక్టు కార్యదర్శులకు 75 మార్కులను అదనపు వెయిటేజీగా కేటాయించారు. ఏకంగా 15,434 మంది దరఖాస్తు చేసుకున్నారు.

 కాంట్రాక్టు కార్యదర్శులను క్రమబద్ధీకరించాలనే ఉద్దేశంతోనే ఈ నోటిఫికేషన్ జారీ చేసినట్లు ప్రభుత్వ వైఖరీ స్పష్టం చేస్తోంది. ఈ నియామకు ప్రక్రియపై అభ్యంతరాలు తెలుపుతూ 90 మంది కాంట్రాక్టు కార్యదర్శులు ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి స్టే తెచ్చుకోవడంతో ఈ భర్తీ ప్రక్రియ అర్ధంతరంగా నిలిచిపోయింది. ఇదిలా ఉండగా.. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) సోమవారం జిల్లాలో మరో 182 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేయడంతో నిరుద్యోగులు మళ్లీ రెండో సారీ దరఖాస్తు చేసుకోక తప్పడం లేదు. రాత పరీక్ష ఆధారంగా ఈ పోస్టుల భర్తీ జరగనుంది. జనవరి 4 నుంచి 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఒక వేళ ఎవరైనా అభ్యర్థులకు రెండు చోట్లా కొలువు వస్తే తీసుకోవాల్సిన చర్యలపై తర్వాత ఆలోచిస్తామని అధికారులు పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు