సీమాంధ్రుల కుట్రలు ఇకపై సాగవు: డీకే అరుణ

22 Aug, 2013 23:47 IST|Sakshi
సీమాంధ్రుల కుట్రలు ఇకపై సాగవు: డీకే అరుణ

మహబూబ్‌నగర్, న్యూస్‌లైన్: సీమాంధ్ర ప్రజాప్రతినిధులు, ప్రజలు సాగిస్తున్న కుట్రలు, కుంత్రాలు ఇకపై సాగవని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని మంత్రి డీకే అరుణ వెల్లడించారు.  స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో బుధవారం ఆమె జిల్లా టీజేఏసీతోపాటు అన్ని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు, ప్రైవేట్ స్కూల్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

మంత్రి మాట్లాడుతూ.. ఎన్నో అభ్యంతరాలు, ఒత్తిళ్లు వచ్చినా రాజకీయంగా కఠిన నిర్ణయమని తెలిసి కూడా కాంగ్రెస్ చైర్ పర్సన్ సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడానికే కట్టుబడ్డారని స్పష్టంచేశారు. అందుకే తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన ఉన్న పాలమూరు జిల్లా నుంచే అన్నివర్గాల ప్రజలు సోనియాగాంధీకి ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం ఉందన్నారు.

అందులో భాగంగానే  27న జిల్లా కేంద్రంలోని జెడ్పీ మైదానంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడానికి నిర్ణయించామన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో  తెలంగాణ బిల్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఏకగ్రీవ తీర్మానాలు చేద్దామన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, మాజీ ఎంపీ డాక్టర్ మల్లు రవి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు