సీఎం డెరైక్షన్‌లోనే సమైక్య ఉద్యమం: మురళీధర్‌రావు

21 Aug, 2013 22:00 IST|Sakshi
సీఎం డెరైక్షన్‌లోనే సమైక్య ఉద్యమం: మురళీధర్‌రావు

ఇల్లంతకుంట/బెజ్జంకి, న్యూస్‌లైన్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి డెరైక్షన్‌లోనే సమైక్యాంధ్ర ఉద్యమం నడుస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పొల్సాని మురళీధర్‌రావు ఆరోపించారు. కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి, ఇల్లంతకుంట మండలం ముస్కానిపేట గ్రామాల్లో బుధవారం ఇంటింటికీ బీజేపీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన ప్రజల సమస్యల్ని విన్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇంతకాలం నాన్చుడు ధోరణి అవలంభించిన కాంగ్రెస్ సర్కారు రానున్న ఎన్నికల్లో రాజకీయ లబ్ధికోసం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై డ్రామాలాడుతోందన్నారు. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ప్రకటన చేసినప్పటి నుంచి రాష్ర్ట ఏర్పాటును అడ్డుకునేందుకు సీమాంధ్రులు కృత్రిమ ఉద్యమాన్ని నడిపిస్తున్నారని విమర్శించారు. సమైక్య ఉద్యమానికి సీఎం కిరణే అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. తెలుగు ప్రజలున్న ఆంధ్రప్రదేశ్‌ను రెండు రాష్ట్రాలుగా విడదీయవద్దంటున్న సీఎం గల్ఫ్‌లో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులను ఎందుకు రక్షించడం లేదని ప్రశ్నించారు.

యూపీఏ సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని అంతవరకు తాము పోరాడుతామన్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుంటే 2014లో ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

మరిన్ని వార్తలు