నేడు ఒంటిమిట్ట రాములోరి కల్యాణం!

10 Apr, 2017 09:04 IST|Sakshi
నేడు ఒంటిమిట్ట రాములోరి కల్యాణం!

అంగరంగ వైభవంగా ముస్తాబైన కళ్యాణవేదిక
ఒంటిమిట్ట (వైఎస్సార్‌ జిల్లా): ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం రాత్రి నిర్వహించే రాములోరి కల్యాణవేదిక అంగరంగ వైభవంగా ముస్తాబైంది. ముఖద్వారాన్ని భారీసెట్టింగులతో ఏర్పాటుచేశారు. సాంప్రదాయబద్దంగా ఏర్పాటుచేసిన ఈ సెట్టింగులు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. కల్యాణవేదిక లోపలిభాగంలో కళ్యాణం వీక్షించేందుకు పెద్దపెద్ద ఎల్‌ఈడీలను ఏర్పాటుచేశారు. కల్యాణవేదిక సమీపంలో ప్రముఖులతోపాటు గవర్నర్, సీఎం కూర్చోవడానికి ప్రత్యేక ఏర్పాటు చేశారు. కళ్యాణవేదిక ప్రాంగణమంతా దేవతామూర్తుల విద్యుత్‌దీపాలు, భారీలైట్లను ఏర్పాటుచేశారు. దాదాపు 70వేల మంది స్వామివారి కల్యాణాన్ని వీక్షించడానికి అనుకూలంగా ఏర్పాటుచేశారు. కళ్యాణోత్సవంలో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యలరావు పట్టువస్త్రాలను సమర్పించనున్నారు.

ఆలయ సంప్రదాయబద్దంగానే..
తరతరాలుగా వస్తున్న ఆలయ సంప్రదాయబద్దంగానే రాములోరి కల్యాణం నిర్వహిస్తున్నారు. అన్ని చోట్ల పగలు సీతారామకళ్యాణం జరుగుతోంది. కానీ ఒక్క ఒంటిమిట్టలో పండువెన్నలలో రాములోరి కల్యాణం నిర్వహించడం కొనసాగుతోంది. ఇదే సంప్రదాయంలో టీటీడీ కూడా రాములోరి కళ్యాణంకు ఏర్పాటుచేసింది. కల్యాణం ముందు రామాలయంలో ఎదుర్కోలు కార్యక్రమం కూడా నిర్వహించనున్నారు. అక్కడి నుంచి ఉత్సవ మూర్తులను కల్యాణవేదిక వద్దకు తీసుకొస్తారు. వైఖానస ఆగమశాస్త్రమ ప్రకారం స్వామి వారి కళ్యాణోత్సవంను టీటీడీ అర్చకస్వాములు చేపట్టనున్నారు.

రాముడు రామచంద్రుడైన వేళ....
శ్రీరామ నవమి పండుగ సందర్బంగా శ్రీ సీతారాముల కల్యాణోత్సవాలను నిర్వహిస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. తెలుగు రాష్ట్రాలలోని అన్ని ప్రముఖ శ్రీ రామాలయాలలోనూ ఇదే సంప్రదాయాన్ని ఆచరిస్తున్నారు. కానీ ఒంటిమట్ట శ్రీ కోదండరాముని కల్యాణోత్సవానికి మాత్రం ప్రపంచంలో ఇంకెక్కడా లేని విశిష్ఠత ఉంది. ఇక్కడ బ్రహ్మోత్సవాల సందర్బంగా చైత్ర శుద్ద చతుర్దశి నాడు అది కూడా రాత్రి పూట మాత్రమే కల్యాణోత్సవం నిర్వహిస్తున్నారు. దీని వెనుక ప్రచారంలో గల పురాణ, చారిత్రక విశేషాలను ఓసారి గమనిద్దాం!

పురాణ గాథ.....
శ్రీరాముని జననం పగలు జరిగింది. దీన్ని తిలకించలేకపోయానని చంద్రుడు బాధపడ్డాడు. శ్రీకృష్ణవతారంలో తన జన్మను తిలకించే అవకాశం ప్రసాదిస్తానని రాముడు చంద్రునికి వరం ఇచ్చాడు. అప్పటి నుంచి ఆయన రామచంద్రుడయ్యాడు. శ్రీరాముని కల్యాణం పగలు జరగడంతో ఆ అద్బుత దృశ్యాన్ని చూసే అదృష్టం లభించలేదని విచారిస్తున్న చంద్రునికి ఒంటిమిట్టలో జరిగే కల్యాణాన్ని తిలకించే భాగ్యాన్ని ప్రసాదిస్తానని కూడా మాట ఇచ్చాడు. రాముడు ఈ మాటలను నిలుపుకున్నాడు.

చారిత్రక గాథ
వాల్మీకి రామాయణం ప్రకారం చైత్ర మాసం ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో పగటిపూట శ్రీరాముని  కల్యాణం జరిగింది. ఒంటిమిట్టలో బుక్కరాయులు స్వామి బ్రహ్మోత్సవాలను ప్రారంభించి కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. రామాయణంలోని శ్రీరామ కల్యాణం జరిగిన నక్షత్రం ప్రకారమే ఒంటిమిట్టలో కూడా వివాహం నిర్ణయించారు. అప్పట్లో అది రాత్రి పూట వచ్చింది. ఆ సంప్రదాయాన్నే నేటికీ కొనసాగిస్తున్నారు. బుక్కరాయులు చంద్ర వంశానికి చెందిన వాడు. తమ వంశ మూల పురుషుడు చంద్రుడు చూస్తూ ఆనందిస్తుండగా శ్రీరామ కల్యాణం నిర్వహించిన సంతోషం పొందేందుకు బుక్కరాయలు రాత్రి కల్యాణాలను ఆ తర్వాత కూడా కొనసాగించాడు.

రామాలయంకు చేరిన గోటితో వలిచిన కోటి తలంబ్రాలు..
ఒంటిమిట్ట రామాలయంకు గోటితో వలిచిన కోటి తలంబ్రాలును ఆదివారం రామాలయం అధికారులకు అందచేశారు. గత మూడు సంవత్సరాలుగా తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ  శ్రీ కృష్ణచైతన్య సంఘం భక్త బృందం కళ్యాణం అప్పారావు,  చింతామణి, కె.సతీష్‌ ఆధ్వర్యంలో గోటితో రామనామస్మరణతో వడ్లను వలచి వారు చేసిన 20లక్షల తలంబ్రాలును తీసుకొచ్చారు. వీటిని ఆలయ ప్రధాన అర్చకులు వీణారాఘవచార్యులకు అందచేశారు. గత నాలుగు నెలల ఈ కార్యక్రమాన్ని భక్తులు చేపట్టారు. 200 మందితో స్వామివారిపై భక్తితో తలపెట్టిన కార్యక్రమాన్ని పూర్తి చేసామన్నారు. రామనామస్మరణ కలిగిన గింజలను తలంబ్రాలలో వినియోగించేందుకు పూజలు కూడా నిర్వహించారు.

భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు..
కల్యాణోత్సవంకు విచ్చేసే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు..సౌకర్యాలను కల్పించారు. ప్రసాదాలను పంపిణీ చేసేందుకు విస్తృతంగా కౌంటర్లను ఏర్పాటుచేశారు. కల్యాణం వేదిక ఎదరుగా ఉన్న అత్యా«ధునిక షెడ్లు, పక్క ఇరువైపుల షెడ్లు ఏర్పాటుచేయడం జరిగింది. అలాగే యాత్రీకులు వసతి సముదాయ మండపంను కూడా ప్రారంభించేందుకు సున్నహాలు చేస్తున్నారు. కల్యాణవేదిక వద్ద గవర్నరు, మంత్రులు వెళ్లేందుకు ప్రత్యేకమార్గాలను ఏర్పాటుచేశారు. రోడ్డుపై కల్యాక్యణవేదిక ఆకర్షణీయంగా, ఆకట్టుకునేలా వివిధ అలంకరణలు చేపట్టారు. కళ్యాణం వీక్షించేందుకు ఎల్‌ఈడీలను ఏర్పాటుచేశారు.

రాములోరి కల్యాణానికి తరలిరండి
సోమవారం ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న రాములోరి కల్యాణానికి భక్తులందరూ తరలిరావాలని తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మెన్‌ క్రిష్ణమూర్తి, జేఈఓ పోలాభాస్కర్‌లు పిలుపునిచ్చారు.  కళ్యాణానికి ముఖ్యమంత్రి, గవర్నర్‌లతోపాటు రాష్ట్రమంత్రులు హాజరవుతున్నారని వివరించారు. అదేవిధంగా ఇప్పటికే రాములోరి కళ్యాణవేదికను సుందరంగా ముస్తాబుచేశామన్నారు. వచ్చిన భక్తాదులకు ప్రసాదాలు పంపిణీ అందుబాటులో ఉంచామన్నారు. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేశామన్నారు. ఏప్రిల్‌ చివరినాటికి ఒంటిమిట్ట రామాలయానికి సంబంధించిన కేంద్రపురావస్తుశాఖ అనుమతులుకూడా వస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు.

కల్యాణోత్సవ సందర్బంగా భారీ బందోబస్తు
జిల్లాలోని ఒంటిమిట్టలో శ్రీ కోందడరామస్వామి కల్యాణోత్సవ సందర్బంగా ఈనెల 10వ తేదిన సోమవారం మూడు వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ  ఒక ప్రకటనలో తెలిపారు. రాయలసీమ ఐజీ శ్రీధర్‌రావు, కర్నూలు రేంజ్‌ డీఐజీ రమణకుమార్‌ పర్యవేక్షణలో బందోబస్తు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఎస్పీ చెప్పారు. ఈనెల 10న కల్యాణోత్సవ సందర్బంగా సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి కల్యాణోత్సవం ముగిసేవరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయని ఎస్పీ తెలిపారు. కల్యాణ వేదికకు వీవీఐపీ, వీఐపీ పాసులు ఉన్న వారికి ఒక్కొ పాసుకు ఒక్కరికే అనుమతి ఉంటుందని, నిబంధనలు ఖచ్చితంగా అమలు చేస్తామని, అందరూ సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

ట్రాఫిక్‌ ఆంక్షలు – వాహనాల దారి మళ్లింపు
మధ్యాహ్నం 3 గంటల తర్వాత తిరుపతి వైపు నుంచి కడప వైపుకు వచ్చే భారీ వాహనాలు వయా రేణిగుంట, రాయచోటి మీదుగా వెళ్లాలని, అలాగే కడప నుంచి తిరుపతి వైపు వెళ్లే భారీ వాహనాలు వయా రాయచోటి మీదుగా వెళ్లాలన్నారు.

తిరుపతినుంచి కడప వైపు వచ్చే ఇతరత్రా వాహనాలు సాయంత్రం 4 గంటల నుంచి సాలాబాద్‌ క్రాస్‌ నుంచి మలకాటిపల్లె, సాలాబాద్, రాచపల్లె, సీతానగరం, రాచగుడిపల్లె, ఇబ్రహీంపేట, గంగపేరూరు, పెన్నాపేరూరు, బ్రాహ్మణపల్లి, మోహిద్దీన్‌సాబ్‌ పల్లె, ముమ్మిడిగుండుపల్లె, మాధవరం, ఉప్పరపల్లె హైవే రోడ్డుకు చేరుకోవాలన్నారు.

అలాగే కడప నుంచి తిరుపతికి వెళ్లే ఇతరత్రా వాహనాలు సాయంత్రం 4 గంటల నుంచి మాధవరం, ఉప్పరపల్లె సాయిబాబా గుడి వైపు నుంచి ముమ్మిడి గుండుపల్లె, మోహిద్దీన్‌సాబ్‌ పల్లె, బ్రాహ్మణపల్లె, పెన్నపేరూరు, గంగపేరూరు, ఇబ్రహీంపేట, రాచగుడిపల్లె, సీతానగరం, రాచపల్లె, సాలాబాద్, మలకాటిపల్లె మీదుగా సాలాబాద్‌ క్రాస్‌ నుంచి వాహనాలు వెళ్లాలని ఎస్పీ సూచించారు.

పార్కింగ్‌ ప్రదేశాలు
కడప నుంచి వచ్చే భక్తుల వాహనాలు పార్కింగ్‌ ప్రదేశాలుగా కల్యాణ వేదిక పడమర వైపున ఓబుల్‌రెడ్డి వాటర్‌ప్లాంటు, సాయి కాళేశ్వర డిగ్రీ కళాశాల ఎడమవైపున, బ్రహ్మయ్య పెట్రోలు బంకు ఎడమవైపు, ఉప్పరపల్లె వద్దనున్న సాయిబాబా ఆలయం వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్‌ ప్రదేశాల్లో భక్తలు తమ వాహనాలను పార్కింగ్‌ చేయాలన్నారు.

రాజంపేట వైపునుంచి వచ్చే భక్తులు తమ వాహనాలను హరిత హోటల్, బాయ్స్‌ హాస్టల్‌ వద్దనున్న రాముడి గుడి ఎదురుగా ఉన్న ఖాళీ జాగా, సాలాబాద్‌ క్రాస్‌ వద్ద, మలకాటిపల్లెలో ఏర్పాటు చేసిన పార్కింగ్‌ ప్రదేశాల్లోనే తమ వాహనాలు పార్కింగ్‌ చేయాలన్నారు.

మరిన్ని వార్తలు