ఆత్మగౌరవం..అధికారం

16 Sep, 2013 04:14 IST|Sakshi


 వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ :
 ఆత్మగౌరవం.. రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీలంతా ఒక్కటై ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైందంటూ బీసీ డిక్లరేషన్ చాటిచెప్పింది.  2014 సాధారణ ఎన్నికలే లక్ష్యంగా రాజ్యాధికారంలో  బీసీలు తమ భాగస్వామ్యాన్ని దక్కించుకునేందుకు ద్విముఖ వ్యూహంతో ముందుకు సాగాలంటూ తేల్చిచెప్పింది. విప్లవాల పురిటిగడ్డగా ఖ్యాతిగాంచిన ఓరుగల్లు.. బీసీ డిక్లరేషన్‌ను దేశం ముందుంచింది. అన్ని రంగాల్లోనూ బీసీలకు జరుగుతున్న అన్యాయంపై వివిధ రంగాల్లోని నిపుణులు, విద్యావంతులు, రాజకీయ నాయకులు చర్చించి ఈ డిక్లరేషన్ రూపొందించారు. హన్మకొండ ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియంలో జరిగిన బీసీల ఆత్మగౌరవ సభలో ఈ డిక్లరేషన్‌ను వెల్లడించారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి బీసీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
 
 రాజకీయ అభివృద్ధే ఎజెండాగా..
 బీసీల సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధే ఎజెండాగా డిక్లరేషన్‌ను ప్రతిపాదించారు. సభకు హాజరైన రాజకీయ పక్షాల నేతలు దేవేందర్‌గౌడ్, కె.కేశవరావు, మధుయాష్కీ, ఈటెల రాజేందర్, గుండు సుధారాణి, దాస్యం వినయభాస్కర్, మొలుగూరి భిక్షపతి, బోడకుంటి వెంకటేశ్వర్లు, నాగపురి రాజలింగంగౌడ్, పూల రవీందర్ డిక్లరేషన్‌ను ఆవిష్కరించారు. కాంగ్రెస్, టీ డీపీ, టీఆర్‌ఎస్, బీజేపీ తదితర రాజకీయ పక్షాలకు చెందిన బీసీ నేతలు ఈ ఆత్మగౌరవ సభ సాక్షిగా ఒక్కటిగా నిలిచారు.
 
 అన్ని రంగాల్లోనూ నిర్లక్ష్యం
 డిక్లరే షన్ అవసరం, ఆవశ్యకత గురించి అకాడమీ ఆఫ్ బ్యాక్‌వర్డ్ క్యాస్ట్ డెవలప్‌మెంట్ అండ్ ఎంపవర్‌మెంట్(ఏబీసీడీఈ) అధ్యక్షుడు ప్రొఫెసర్ మురళీమనోహర్ క్లుప్తంగా వివరించారు.  రాజ్యంగంలో పొందుపరిచిన హక్కులు, ప్రణాళిక సంఘం రూపొందించిన నిబంధనల మేరకు జిల్లా, రాష్ట్రం, దేశం సరాసరి ఆదాయాల ప్రాతిపదికన గణాంకాల ఆధారంగా ఈ డిక్లరేషన్‌ను రూపొందించినట్లు వివరించారు. జనాభాలో 56శాతంగా ఉన్నప్పటికీ అన్ని రంగాల్లో కనీస భాగస్వామ్యం లేక పోవడం బాధాకరమన్నారు. వీరి అభివృద్ధికి కాలేల్కర్, మండల్ తదితర  కమిషన్‌లు వేసినప్పటికీ అమలుకు నోచుకోలేదన్నారు. పార్టీలు, ప్రభుత్వాలు ఈ డిక్లరేషన్‌ను హెచ్చరికగా తీసుకోవాలని డిమాండ్ చేశారు. 144 కులాలున్నప్పటికీ జనాభా దామాషా ప్రకారం ఏ రంగంలోనూ సముచిత స్థానం దక్కలేదన్నారు. రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడం ద్వారానే ఇది సాధ్యమవుతుందని తేల్చిచెప్పారు. వనరుల పునఃపంపిణీ, సమన్యాయం, హక్కులు, స్వేచ్ఛ, నిర్ణయాధికారం, భాగస్వామ్యం, సాధికారత లభించాల్సి ఉందన్నారు. దీన్ని సాధించేందుకు సంఘటితం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
 
 కుల సంఘాల భారీ ర్యాలీ
 సభ ప్రారంభానికి ముందు జిల్లావ్యాప్తంగా బీసీ కుల సంఘాలు, ప్రజాసంఘాలు, విద్యార్థులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నేత, గీత, వడ్డెర, స్వర్ణకార, కమ్మరి, వడ్రంగి, పద్మశాలి, మేదరి, రజక, కటిక, కాపు, పెరిక సంఘాలతో పాటు వ్యవసాయ మార్కెట్ బీసీ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో మంత్రి పొన్నాల, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే వినయ్ పాల్గొన్నారు. సభలో ప్రొఫెసర్లు వి.రవీందర్, పి.నరేందర్, డాక్టర్ బండాప్రకాష్, డాక్టర్ సంగని మల్లేశ్వర్, తిరునహరి శేషు, కోలా జనార్దన్‌గౌడ్, చింతం ప్రవీణ్, దిడ్డి కుమారస్వామి, పులిసారంగపాణి, ప్రభంజన్‌యాదవ్, బీఎస్ రాములుతో పాటు కుల, ప్రజా సంఘాల నాయకులు చొల్లే టి కృష్ణమాచారి, తాళ్ల సంపత్‌కుమార్, బి.యాదగిరి, చిర్రరాజు, మిర్యాల్‌కార్ దేవేందర్, ప్రతాపగిరి రాజయ్య, పి.అశోక్, జి. రాంచందర్, ఓదెల చందర్‌రావు, పి.సాంబరాజు, బి.రామకృష్ణ, గుండు ప్రభాకర్, విజయ్‌కుమార్, జంగయ్య, పాక ఓంప్రకాష్, మిరిదొడ్డి శ్రీధర్, నర్సయ్య, కేదారి యాదవ్, నరేందర్, గట్టయ్య, కె.రవి, ులసంఘాల నాయకులు పాల్గొన్నారు.  
 
 రాజ్యాధికారం చేజిక్కించుకోవాలి
 మీకు రాజ్యసభలో ఏ పదవి కావలని ప్రధాని మన్మోహన్‌సింగ్ నన్ను అడిగితే బీసీలకు సంబంధించిన కమిటీలో సభ్యత్వం కావాలని చెప్పా. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీల శాతం ఏడుశాతమే. 27శాతం రిజర్వేషన్లు ఉంటే ఏడుశాతం ఉద్యోగాల్లో మాత్రమేబీసీలున్నారు. ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్తే ఆయన మౌనం వహించారు. బీసీల్లో ఉన్నత విద్య అభ్యసించాల్సిన వారి సంఖ్య పెరగాల్సిన అవసరం ఉంది. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన 67ఏళ్లకు తిండికోసం బిల్లు పెట్టడం అసమర్థ నాయకత్వానికి నిదర్శనం.  బలహీనవర్గాల పోరాటంతోనే తెలంగాణ రాష్ట్ర ప్రకటన వచ్చింది. తెలంగాణ సాయుధ పోరాటంలో నాలుగువేలమంది చనిపోతే అందులో బీసీలే అధికం. ప్రస్తుత తెలంగాణ ఉద్యమంలో బీసీలు త్యాగాలు చేస్తుంటే నాయకత్వం మాత్రం అగ్రకులాల చేతుల్లో ఉంది. ఇక త్యాగాలు చేయాలో.. నాయకత్వం వహించాలో బీసీ నాయకులే తేల్చుకోవాలి. ప్రపంచీకరణతో కులవృత్తులు సంక్షోభంలోకి వెళ్లిపోయాయి. ఇవి మరుగున పడకుండా ఉండేందుకు ఏం చేయాలో ప్రొఫెసర్లు ఆలోచించాలి. దేశంలో అపార  వనరులున్నా.. కష్టజీవు ఆకలిచావులకు కారణం ఏమిటో గమనించాలి. బీసీలకు.. టీడీపీ వంద సీట్లు ఇస్తామని ప్రకటించింది. వారు రాజకీయంగా ఎదగడానికి స్థానికసంస్థల్లో  ఎన్టీ రామారావు రిజర్వేషన్లు  కల్పించారన్నారు. బీసీ కార్పొరేషన్‌కు పదివేలకోట్ల రూపాయలు కేటాయిస్తామని టీడీపీ ప్రకటించింది. రాజ్యాధికారం కోసం బీసీలంతా ఒక్కటి కావాల్సిన సమయం ఆసన్నమైంది.
 - టి.దేవేందర్‌గౌడ్, రాజ్యసభ ప్లోర్ లీడర్

మరిన్ని వార్తలు