ఆరోగ్యశ్రీకి ఉరి | Sakshi
Sakshi News home page

ఆరోగ్యశ్రీకి ఉరి

Published Mon, Sep 16 2013 4:09 AM

ఆరోగ్యశ్రీకి ఉరి - Sakshi

సాక్షి, సిటీబ్యూరో : జీహెచ్‌ఎంసీలో డ్రైవర్‌గా పనిచేస్తున్న జిల్లెలగూడకు చెందిన సుధాకర్‌కు శనివారం అర్ధరాత్రి ఉన్నట్టుండి గుండెనొప్పి వచ్చింది. చికిత్స కోసం బంధువులు ఆయన్ను మలక్‌పేటలోని ఓ ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆయనకు ఆరోగ్యశ్రీతో పాటు ఈఎస్‌ఐ కూడా ఉంది. అయినా రూ.50 వేలు అడ్వాన్స్‌గా చెల్లిస్తేనే అడ్మిషన్ ఇస్తామని స్పష్టం చేశారు.

ఒకేసారి అంత డబ్బు కట్టడం తమ వల్ల కాదని, తెల్లవారిన తర్వాత చెల్లిస్తామని బాధితుని బంధువులంతా వేడుకున్నా ఆస్పత్రిలో చేర్చుకోలేదు. దీంతో ఆయన్ను బైరామల్‌గూడలోని మరో కార్పొరేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ కూడా అదే అనుభవం ఎదురైంది. ఇక చేసేది లేక రూ.40 వేలు అడ్వాన్స్‌గా చెల్లించి అడ్మిట్ చేయాల్సి వచ్చింది. అదేవిధంగా బేగంపేట సమీపంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్ర ంగా గాయపడిన ఐటీ ఉద్యోగి హేమంత్ వైద్యం కోసం సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి చేరుకున్నాడు.

తన వద్ద ఉన్న న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కార్డును ఆస్పత్రి సిబ్బందికి చూపడంతో చికిత్సకు వారు విముఖత చూపారు. అత్యవసర విభాగంలో పడకలు ఖాళీ లేవంటూ అక్కడి నుంచి తిప్పి పంపారు. మహబూబ్‌నగర్‌కు చెందిన నారాయణకు కిడ్నీలో రాళ్లు పేరుకుపోయాయి. చికిత్స కోసం తన వద్ద ఉన్న ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుని మలక్‌పేటలోని ఓ కిడ్నీ సెంటర్‌ను ఆశ్రయించాడు.

ఆరోగ్యశ్రీ జాబితాలో ఆ శస్త్రచికిత్స లేదని పేర్కొంటూ అడ్మిషన్‌కు నిరాకరించారు. ఇలా ఒక్క సుధాకర్, హేమంత్, నారాయణలకు మాత్రమే కాదు.. ఆరోగ్యశ్రీ, ఈఎస్‌ఐ, ఇతర ఆరోగ్య భద్రత కార్డులను కలిగి ఉన్న లబ్ధిదారులందరికీ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఇలాంటి చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. ఆస్పత్రికి గిట్టుబాటయ్యే శస్త్రచికిత్సలైతే సరి.. లేదంటే పడకలు ఖాళీ లేవనే పేరుతో చికిత్సలకు నిరాకరిస్తుండటంతో ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు సైతం డబ్బు చెల్లించి వైద్యం చేయించుకోవాల్సి వస్తోంది. అసలే అంతంత స్తోమత కలిగిన వీరికి ఆరోగ్యం అందని ద్రాక్షే అవుతుంది.
 
ఆరోగ్యశ్రీ రోగులపై కార్పొరేట్ల చిన్నచూపు

ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 400కి పైగా ఆస్పత్రులు ఉండగా, వీటిలో హైదరాబాద్‌లోనే వందకుపైగా ఉన్నాయి. అత్యధిక శస్త్రచికిత్సలు ఇక్కడే జరుగుతున్నాయి. లబ్ధిదారులందరికీ ఉచితంగా శస్త్రచికిత్సలు చేస్తామని హామీ ఇచ్చిన కార్పొరేట్ ఆస్పత్రులు తీరా అక్కడికి చేరుకున్న రోగులను చిన్నచూపు చూస్తున్నాయి. ఆస్పత్రి ఆవరణలో దూరంగా ఇరుకైన గదుల్లో ఓ చిన్నవార్డు ఏర్పాటుచేసి, వారికేదో ఉచిత సేవలు చేస్తున్నట్లు హడావుడి చేస్తున్నాయి. ఆస్పత్రికి ఆర్థికంగా గిట్టుబాటు అయ్యే గుండె, కాలేయం, మూత్రపిండాల వ్యాధులు, క్యాన్సర్ వంటి పెద్ద శస్త్రచికిత్సలు మినహా తక్కువ ఖర్చుతో కూడిన సర్జరీలను చేసేందుకు నిరాకరిస్తున్నాయి.

ఖరీదైన కార్పొరేట్ ఆస్పత్రుల్లోనే కాదు ఉస్మానియా, నిమ్స్, గాంధీ వంటి ప్రభుత్వాస్పత్రుల్లోనూ రోగులకు చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. చేతిలో కార్డున్నా పర్సులో పైసల్లేకపోతే అక్కడ కనీస చికిత్సలు అందడం లేదు. నిజానికి ఆరోగ్యశ్రీ కార్డుంటే చాలు పైసా ఖర్చు లేకుండా వైద్యం చేయించుకోవచ్చని చాలామంది రోగులు భావిస్తుంటారు. కానీ ప్రభుత్వాసుపత్రుల్లో సైతం చికిత్సల కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈసీజీ తీయించాలన్నా.. ఎక్సరే కావాలన్నా.. రక్త, మూత్ర పరీక్షలు చేయించుకోవాలన్నా డబ్బులు విధిగా చెల్లించాల్సి వస్తోంది. మందులూ బయటే కొనాల్సి వస్తోంది. ఇందుకోసం ఒక్కో బాధితుడు రూ.20వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది.

 పెద్ద శస్త్రచికిత్సలకే అనుమతి

 వైద్యం ఖరీదు కావడంతో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వివిధ కార్పొరేషన్లు, కంపెనీల్లో పనిచేస్తున్న చిరుద్యోగులు ఆరోగ్య భద్రత కోసం వివిధ ఇన్సూరెన్స్ కంపెనీల్లో పాలసీలు పొందుతున్నారు. మిధాని, ఈసీఐఎల్, సీజీహెచ్‌ఎస్ స్కీమ్‌లు కూడా ఉన్నాయి. నిబంధనల ప్రకారం ఆయా ఇన్సూరెన్స్ కంపెనీలతో  ఒప్పందం కుదుర్చుకున్న నెట్‌వర్క్ ఆస్పత్రులన్నీ ఉచితంగా చికిత్సలు చేయాలి. ఇందుకు అయిన ఖర్చులను ఆయా కంపెనీల నుంచి తీసుకోవాలి. కానీ ఆర్థికంగా గిట్టుబాటు కాని శస్త్రచికిత్సలను వదిలేసి, అధిక బిల్లులు వసూలు చేసుకునేందుకు అవకాశం ఉన్న ఓపెన్‌హార్ట్, క్యాన్సర్, కిడ్నీ, కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలను మాత్రమే అనుమతిస్తున్నారు. చిన్నచిన్న శస్త్రచికిత్సల కోసం వచ్చిన బాధితులను పడకలు ఖాళీ లేవంటూ తిప్పి పంపుతున్నారు. ఒక వేళ ఈ శస్త్రచికిత్సలు చేసేందుకు అంగీకరించినా.. నిబంధనలకు విరుద్ధంగా రోగుల నుంచి అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారు.
 
 ఆరోగ్యశ్రీ అనగానే బెడ్స్ లేవన్నారు
 నేను కిడ్నీ సమస్యతో బాధపడుతున్నా. ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుని ఆదివారం సికింద్రాబాద్‌లోని ఓ ఆస్పత్రికి వెళ్లాను. బెడ్స్ ఖాళీ లేవని చెప్పారు. పడక దొరికే వరకు ఉంటానని చెప్పినా సిబ్బంది విన్పించుకోలేదు. సెక్యూరిటీని పిలిపించి బయటికి గెంటేశారు. ఎటుపోవాలో తెలియక ఉదయం నుంచి ఆస్పత్రి ముందే ఇలా గడుపుతున్నా.    
 - జయమ్మ, సంగారెడ్డి
 
 ఈఎస్‌ఐ కార్డు ఉందన్నా చేర్చుకోలేదు
 మా ఆయన జీహెచ్‌ఎంసీ కాంట్రాక్ట్ డ్రైవర్. మూడు రోజుల క్రితం అర్ధరాత్రి ఆయనకు గుండె నొప్పి వచ్చింది. ఈఎస్‌ఐ కార్డు తీసుకుని మలక్‌పేటలోని యశోద ఆస్పత్రికి తీసుకెళ్లాను. ఈఎస్‌ఐ అని చెప్పగానే బెడ్డు ఇచ్చేందుకు నిరాకరించారు. రూ.50 వేలు చెల్లిస్తేనే చికిత్స చేస్తామన్నారు. అర్ధరాత్రి అంత చెల్లించే స్తోమత లేకపోవడంతో మరో ఆస్పత్రికి తీసుకెళ్లాం. అక్కడా ఇదే అనుభవ ం ఎదురైంది. చేసేది లేక అడిగినంత చెల్లించి వైద్యం చేయిస్తున్నా.    
 - జ్యోతి సుధాకర్, జిల్లెలగూడ
 

Advertisement

తప్పక చదవండి

Advertisement