సినీదిగ్గజానికిది.. సెంటిమెంట్ సిటీ

19 Feb, 2015 01:15 IST|Sakshi
సినీదిగ్గజానికిది.. సెంటిమెంట్ సిటీ

నగరంతో రామానాయుడుకు విడదీయరాని అనుబంధం
ప్రతి సినిమా బాక్స్‌కు దుర్గమ్మ సన్నిధిలో, దాసాంజనేయ ఆలయంలో పూజలు
కోలవెన్ను వినాయకుడిపైనా మక్కువ ఎక్కువే..  అక్కడే సోగ్గాడు షూటింగ్

 
విజయవాడ కల్చరల్/ కంకిపాడు/ భవానీపురం : తెలుగు సినిమా చరిత్రలో ఒక అధ్యాయం ముగిసింది. జిల్లాతో విడదీయలేని అనుబంధం గల ఒక దిగ్గజం దివికేగింది. ప్రతి అపజాయాన్ని విజయానికి మెట్లుగా మార్చుకుని సినీప్రపంచంలో ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిన మూవీ మొఘల్.. ఇటీవల కాలం వరకు తన ప్రతి చిత్రం విడుదలకు ముందు మెట్లమార్గంలో నడిచి వెళ్లి దుర్గమ్మను దర్శించుకునేవారు. సినిమా బాక్స్‌లను కూడా ఆయన మోసుకెళ్లి అమ్మవారి చెంత ఉంచి పూజలుచేయించేవారు. మాచవరంలోని దాసాంజనేయ స్వామి ఆలయంపైనా దగ్గుబాటి రామానాయుడుకు అచంచల విశ్వాసం. తాను నిర్మించిన సినిమా బాక్సులకు మాచవరంలోని దాసాంజనేయ స్వామి దేవస్థానంలో పూజలు చేయిస్తే విజయం లభిస్తుందని నమ్మేవారు. నగరంలోని మమత హోటల్ కూడా ఆయన బాగా సెంటిమెంట్. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కువసార్లు ఆ హోటల్‌లోని ఒకే గదిలో ఉండేవారు. నగరంలో ఉన్న తన బంధువులైన విజయ ఫిలిమ్స్ అధినేతలు సురేటి వెంకటరత్నం, రాజేంద్రప్రసాద్‌ల నివాసానికి కూడా వెళ్లి వారి యోగక్షేమాలు తెలుసుకునేవారు. మరో బంధువు సురేటి శాంతాదేవి నివాసానికి కూడా పలుమార్లు వచ్చారు.నగరంలోని పలువురు ప్రముఖులు ఆయనతో సన్నిహితంగా మెలిగేవారు. సురేష్ ప్రొడక్షన్స్ కార్యాలయంలో రామానాయుడు చిత్ర పటం వద్ద ఉద్యోగులు, అభిమానులు ఘన నివాళి అర్పించారు.

కామినేనితో బంధుత్వం : రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్‌కు రామానాయుడుకు మధ్య దగ్గర బంధుత్వం ఉంది. రామానాయుడు చిన్న కుమారుడు, సినీ హీరో వెంకటేష్‌కు కామినేని అక్క ఉషారాణి చిన్న కుమార్తె నీరజను ఇచ్చి వివాహం చేశారు. ఆయన అనేకసార్లు కామినేని స్వగ్రామమైన కైకలూరు మండలం వరహాపట్నం గ్రామానికి వచ్చారు.
 
కోలవెన్నుతో ప్రత్యేక అనుబంధం

డాక్టర్ రామానాయుడుకు కంకిపాడు మండలం కోలవెన్ను గ్రామంతో ప్రత్యేక అనుబంధం ఉంది. శోభన్‌బాబు నటించిన ‘సోగ్గాడు’, జితేంద్ర, రేఖ నటించిన దిల్‌దార్ చిత్రాలను రామానాయుడు ఈ గ్రామంలో చిత్రీకరించారు. గ్రామానికి చెందిన వెంకటరత్నం నివాసంలో నెల రోజులపాటు ఉండి 1975లో సోగ్గాడు చిత్రాన్ని నిర్మించారు. వెంకటరత్నానికి చెందిన ఎడ్ల జతను సోగ్గాడు చిత్రంలో ఎంతో అందంగా చూపి సినిమాలో ఎడ్లకు ప్రత్యేక స్థానాన్ని కల్పించారు. గ్రామంలో వేంచేసి ఉన్న వరసిద్ధి వినాయకుడి విగ్రహంపై పాటను చిత్రీకరించారు. ఆ సినిమా విజయం సాధించడంతో అప్పటి నుంచి ప్రతి సినిమా టైటిల్స్‌లోనూ ఈ వినాయకుడి విగ్రహాన్ని సెంటిమెంట్‌గా చూపిస్తున్నారు. రామానాయుడు మరణవార్త కోలవెన్ను వాసులను కలచివేసింది. నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుని పలువురు సంతాపం తెలిపారు. సినీ నిర్మాత, పీఏసీఎస్ అధ్యక్షుడు అడుసుమిల్లి వెంకటేశ్వరరావు (పసిబాబు), నకిరికంటి శేఖర్ సంతాపం తెలిపినవారిలో ఉన్నారు.
 
 విలువలకు ప్రాధాన్యత ఇస్తారు

 రామానాయుడు నాతో ఎంతో సన్నిహితంగా మెలిగేవారు. నగరానికి వచ్చిన ప్రతిసారి నా కోసం వాకబు చేసేవారు. నగరంలో గానీ, చుట్టుపక్కల గానీ సినిమా సభలు నిర్వహిం చినప్పుడు నన్నే అధ్యక్షత వహించాలని కోరేవారు. చీరాలలో 1971లో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవ సభకు నేనే అధ్యక్షత వహించాను. ఆయనలేని తెలుగు సినిమాను ఊహించలేం. కుటుంబ బంధాలు, విలువలకు ఆయన అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు.  
 - తుర్లపాటి కుటుంబరావు, సీనియర్ పాత్రికేయులు
 
 కన్నతండ్రిలా ఆదుకొనేవారు

 నేను 1987లో సురేష్ ఫిలిమ్స్‌లో చేరాను. అప్పటి నుంచి రామానాయుడు నిర్మించిన అన్ని సినిమాలను పంపిణీ చేశాం. విజ యవాడ వచ్చిన ప్రతిసారి తప్పక ఆఫీస్‌కు వచ్చేవారు. ప్రతి ఒక్కరినీ పేరుపేరునా పలకరించేవారు. కన్నతండ్రిలా ఆదుకొనేవారు.      
 - శ్రీరామ్, సురేష్ ఫిలిమ్స్ మేనేజర్
 
సున్నిత మనస్కుడు

రామానాయుడితో మా అనుబంధం 1953 నుంచి సాగుతోంది. ఆయనది చాలా సున్నితమైన మనసు. చాలా కష్టపడి పైకి వచ్చారు. దేవుడిని విపరీతంగా నమ్మేవారు. తాను నిర్మించిన సినిమా మొదటికాపీని విజయవాడ కనకదుర్గమ్మ, మాచవరం ఆంజనేయస్వామి ఆలయాలకు తీసుకెళ్లి ఆశీస్సులు కోరేవారు. విజయవాడ వచ్చినప్పుడల్లా హోటల్ మమతాలోని ఒకే గదిలో దిగేవారు. ఆయనకు సెంటిమెంట్ ఎక్కువ.
 - సురేటి వెంకటరత్నం
 
బంధుప్రీతి ఎక్కువ


మాది కూడా ప్రకాశం జిల్లా కారంచేడే. రామానాయుడికి బంధు ప్రీతి ఎక్కువ. నా వివాహం కూడా ఆయనే చేయించారు. విజయవాడ వచ్చినప్పుడల్లా మా ఇంటికి వచ్చేవారు. గత వారమే ఆయన్ని చూడటానికి హైదరాబాదు వెళ్లా. ఇంతలో ఇలా జరిగింది.        - సురేటి శాంతాదేవి
 
 
ఇలా జరుగుతుందనుకోలేదు  


కోలవెన్ను గ్రామంతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. చిట్టచివరి రోజుల్లో నన్ను పిలిపించారు. గ్రామానికి ఎంతో కొంత అభివృద్ధి పనుల్లో సాయపడదామనుకుంటున్నానని చెప్పారు. ఇంతలోనే ఇలా జరిగింది. ఆయన కుమారులైనా గ్రామంపై ఉన్న ఆపేక్షతో అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నా.
 - తుమ్మల చంద్రశేఖర్ (బుడ్డి), సర్పంచ్, కోలవెన్ను  
 
40 ఏళ్ల పరిచయం మాది

నాకు రామానాయుడుతో 40 ఏళ్ల నుంచి అనుబంధం ఉంది. ఆయన గతంలో నగరానికి వచ్చినప్పుడల్లా మమ్మల్ని కలిసే వారు. గతంలో మాకు లీలామహల్ సినిమా హాల్ ఉండేది. ఆయన అక్కడకు వచ్చి మావాళ్లతో మాట్లాడేవారు. ఎక్కువ చర్చలు సినిమాల గురించే ఉండేవి. ఆయనతో మాకు బంధుత్వం కూడా ఉంది. దీంతో రాకపోకలు ఎక్కువగా ఉండేవి. మేము హైదరాబాద్ వెళ్లినప్పుడల్లా ఫిలిం ఛాంబర్‌లో ఆయన్ను కలిసేవాళ్లం. సినిమా రంగంలో ఆయన నిజంగానే రాజు. ఒక్క సినిమా రంగంలోనే నాలుగు విభాగాల్లో అత్యద్భుతంగా రాణించిన అరుదైన వ్యక్తి ఆయన. రామానాయుడుకు ఒంగోలులో ఒక థియేటర్ ఉండేది. దానిలో ఇంగ్లిష్ సినిమా ఆడించాలన్నది ఆయన అభిమతం. దానికి సంబంధించి సినిమాల లిస్ట్‌లు, ఇతర కార్యక్రమాలు నన్ను చూడాలని కోరారు.
 - భూపాల్ ప్రసాద్, నవరంగ్ థియేటర్ అధినేత  
 

మరిన్ని వార్తలు