Anukunnavanni Jaragavu Konni Movie Review: అనుకున్న‌వ‌న్నీ జ‌ర‌గ‌వు కొన్ని సినిమా రివ్యూ

3 Nov, 2023 23:49 IST|Sakshi
Rating:  

టైటిల్‌: అనుకున్నవన్నీ జరగవు కొన్ని
నటీనటులు: శ్రీరామ్ నిమ్మల, కలపాల మౌనిక, పోసాని కృష్ణ మురళి, బబ్లు మాయ్య, కిరీటి, స్నేహ మాధురి, సోనియా చౌదరి, గౌతమ్ రాజు, మిర్చి హేమంత్
దర్శకత్వం: జి.సందీప్‌
నిర్మాత: జి.సందీప్‌
సంగీతం: గిడియన్‌ కట్ట
ఎడిటర్‌: కేసీబీ హరి
విడుదల తేది: 3 నవంబర్‌, 2023

కరోనా తర్వాత సినీ ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది. ఈ భాష, ఆ భాష అనే తేడా లేకుండా ఓటీటీల‌లో అన్ని రకాల సినిమాలను చూసేస్తున్నారు. కథలో వైవిధ్యం ఉంటే తప్ప థియేటర్స్‌కి రావడం లేదు. అందుకే నూతన దర్శకులు కొత్త కాన్సెప్ట్‌తో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అలా ఓ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రమే అనుకున్నవన్నీ జరగవు కొన్ని. జి.సందీప్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేడు(నవంబర్‌ 3) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం..

కథేంటంటే..
కార్తీక్‌(శ్రీరామ్‌ నిమ్మల)కి రూ.30 లక్షలు అవసరం ఉంటుంది. మనీకోసం కాల్‌ బాయ్‌గా మారాతాడు. మరోవైపు మధు(కలపాల మౌనిక) కూడా ఓ కారణంగా కాల్‌ గర్ల్‌ అవతారమెత్తుతుంది. అయితే ఈ ఇద్దరు అనుకోకుండా ఓ సమస్యలో ఇరుక్కుంటారు. ఆ సమస్య నుంచి వాళ్లు ఎలా బయటపడ్డారు? ఈ క్రమంలో వారిద్దరికి ఎదురైన సమస్యలు ఏంటి? ఫ్లాట్‌లో హత్య చేయబడిందెవరు? ఎవరు చేశారు? ఈ ‍కథలో పొసాని కృష్ణ మురళీ, బబ్లూల పాత్రేంటి? అనేదే మిగతా కథ.

ఎలా ఉందంటే..
ఇదొక క్రైమ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌. హీరోహీరోయిన్లు ఇద్దర్ని డిఫరెంట్‌ పాత్రలో చూపిస్తూ..ఆసక్తికరంగా కథనాన్ని కొనసాగించాడు దర్శకుడు. సినిమా ప్రారంభంలో కథ కాస్త నెమ్మదిగా సాగినా.. అపార్ట్‌మెంట్‌లో జరిగిన హత్య తర్వాత కథలో వేగం పెరుగుతుంది. అసలు ఆ హత్యలు ఎవరు చేశారనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలిగిస్తూ.. మంచి ట్విస్టుల కథ ముందుకు సాగుతుంది. అయితే ఫస్టాఫ్‌లో కొన్ని కామెడీ సీన్స్‌ నవ్వించకపోవడమే కాకుండా..కథకి అతికినట్లుగా అనిపిస్తుంది. ఇంటర్వెల్‌ సీన్‌ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది.

ద్వితీయార్థంలో పోసాని, బబ్లూల కామెడీ అదిరిపోతుంది. అపార్ట్‌మెంట్‌లో జరిగిన రెండు హత్యలకు పొసాని, బబ్లూలతో సంబంధం ఉండడం.. ఈ విషయం బయటపడకుండా ఉండేందుకు వాళ్లు చేసే​ ప్రయత్నాలు నవ్వులు పూయిస్తాయి. ఈ సినిమాలో స్పెషల్‌ ఏంటంటే.. క్రైమ్‌ కామెడీ చిత్రమైనా..ఒక్క ఫైటూ ఉండదు, పాట ఉండదు. కేవలం కామెడీ సీన్స్‌తో అలా సాగిపోతుంది. ఫస్టాఫ్‌పై ఇంకాస్త ఫోకస్‌ పెట్టి ఆసక్తిరంగా కథను రాసుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. క్రైమ్‌ కామెడీ చిత్రాలను ఇష్టపడేవారికి ఈ చిత్రం నచ్చుతుంది.

ఎవరెలా చేశారంటే..
కార్తిక్‌, మధు పాత్రకు శ్రీరామ్‌ నిమ్మల, కలపాల మౌనిక న్యాయం చేశారు. వీరిద్దరి మధ్య ఆన్‌స్క్రీన్‌ కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయింది. మౌనికకు ఇది తొలి చిత్రమే అయినా చక్కగా నటించింది. చాలా కాలం తర్వాత పోసాని కృష్ణమురళి మంచి పాత్ర లభించింది. కాంట్రాక్టు కిల్ల‌ర్‌గా ఆయన నటన నవ్వులు పూయిస్తుంది.బబ్లు పాత్ర సినిమాకు ప్లస్‌ అయింది.

కిరీటి, స్నేహ మాధురి, సోనియా చౌదరి, గౌతమ్ రాజు, మిర్చి హేమంత్ తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక విషయాకొస్తే.. గిడియన్ కట్ట అందించిన మ్యూజిక్ సినిమాకు ప్లస్‌ అయింది. ఎడిటర్ కె సి బి హరి పనితీరు పర్వాలేదు.ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్‌ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.

చ‌ద‌వండి: ఓ ప‌క్క ట్రోలింగ్‌.. మ‌రోప‌క్క ఓటీటీలో ట్రెండ్ అవుతున్న తెలుగు సినిమా

Rating:  
(2.5/5)
మరిన్ని వార్తలు