పది మంది మృత్యువాత

7 Sep, 2014 00:39 IST|Sakshi
పది మంది మృత్యువాత

రసాయనాలు రవాణా చేస్తున్న ట్రక్కులో ప్రయాణించిన ఏడుగురి మృతి
అనంతపురం సంఘటనలో వోల్వో బస్సు ప్రయాణికుల దుర్మరణం

 
విజయవాడ/వీరవల్లి/చిలమత్తూరు: కృష్ణా,అనంతపురం జిల్లా ల్లో శనివారం తెల్లవారు జామున జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో పదిమంది మృత్యువాత పడ్డారు. కృష్ణాజిల్లా బాపులపాడు మండలం వీరవరం వద్ద జరిగిన దుర్ఘటనలో ఏడుగురు మృతిచెందారు. ఆరుగురు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. మృతిచెందిన వారిలో పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం చేగూరుపాడు గ్రామానికి చెందిన వెల్లిపల్లి శ్రీనివాసరావు(45), వేగేశ్వరపురానికి కూనాల మరాఠీ(35),  కూనాల మణికంఠ(12),వీరవల్లి మండలం అనంతపల్లికి చెందిన శ్రీకృష్ణ(6), తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం వేములపాలేనికి చెందిన పుట్టా నాగభూషణం(40), నాగమణి(35) దంపతులు, ఇదే మండలంలోని పెద్దిపాలెంకు చెందిన బంధం లోవరాజు(50) ఉన్నారు.మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కాగా ముగ్గురు పరిచయస్తులు ఉన్నారు.  పోలీసుల కథనం మేరకు  హైదరాబాద్‌లోని శంషాబాద్ సమీప బుద్దివెల్లు వద్ద కూలి పనులు చేసుకుంటున్న శ్రీనివాసరావు కుటుంబీకులు, పరిచయస్తులతో కలసి తమ బంధువు పెద్ద కర్మలో పాల్గొనేందుకు  స్వస్థలాలకు బయలుదేరారు. వారు పటాన్‌చెరునుంచి పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు  రసాయనాలు రవాణా చేస్తున్న ట్రక్కులో ఎల్బీనగర్ వద్ద శుక్రవారం రాత్రి ఎక్కారు. ట్రక్కులోని కెమికల్స్ పీపాల మధ్యలో  కూర్చున్నారు. వాహనం వీరవల్లి సమీపానికి చేరుకున్నప్పుడు ఆగి ఉన్న లారీని  ఢీకొంది. దీంతో వ్యాన్‌లోని డెఫైనాయల్ మిథైన్ పీపాలు పగిలి దట్టమైన పొగలు కమ్మాయి. నలుగురు అక్కడే మృతి చెందారు. ఆసుపత్రికి తరలిస్తుండగా ఒకరు, చికిత్స పొందుతూ మరో ఇద్దరు విగతజీవులయ్యారు.

ప్రాణాలను తీసిన వోల్వో...

అనంతపురం జిల్లా చిలమత్తూరు సమీప 44వ నంబరు జాతీయ రహదారిపై  సిమెంటు లోడుతో వెళుతున్న లారీని ప్రైవేట్ వోల్వో బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పెనుకొండ డీఎస్పీ సుబ్బారావు కథనం మేరకు... శుక్రవారం రాత్రి  ఓ వోల్వో బస్సు 36 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయల్దేరింది. శనివారం తెల్లవారుజామున కోడూరు తోపు- కొడికొండ చెక్‌పోస్టు మధ్యలో ఉన్న జువారి సీడ్‌‌స ఫ్యాక్టరీ సమీపంలో వెళ్తున్న సిమెంటు లారీని 15 మీటర్ల దూరంలో గుర్తించిన  బస్సు డ్రైవర్ జలీల్‌ఖాన్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో ముందు సీట్లల్లో ఉన్న ఇద్దరు ప్రయాణికులు బస్సు అద్దాలు పగలడంతో తుళ్లుకుంటూ రోడ్డుపై పడిపోయారు.వారిపై నుంచి  బస్సు దూసుకెళ్లి లారీని ఢీకొంది. రోడ్డున పడ్డవారు దుర్మరణం చెందారు. మరో ప్రయాణికుడు లారీ-బస్సుకు మధ్యలో ఇరుక్కుపోయి ప్రాణాలు వదిలాడు. మృతుల్లో బెంగళూరుకు చెందిన రాహుల్ అగర్వాల్ (30), హైదరాబాద్ నాంపల్లికి చెందిన బాబుపిళ్లై (34)తోపాటు మరొకరు (హైదరాబాద్ రాజేంద్రనగర్‌కు చెందిన మద్దిశెట్టి వీరశేఖర్‌గా అనుమానం) ఉన్నారు. ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు.

మరిన్ని వార్తలు