రుయాలో కీచక వైద్యులు

5 May, 2018 04:53 IST|Sakshi

     పీజీ విద్యార్థినిపై లైంగిక వేధింపులు

     ముగ్గురు వైద్యులపై గవర్నర్‌కు ఫిర్యాదు 

     విచారణ చేపట్టిన ప్రత్యేక కమిటీ

తిరుపతి (అలిపిరి): రుయా చిన్నపిల్లల ఆస్పత్రిలో కీచకపర్వం వెలుగుచూసింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులే లైంగిక వేధింపులకు దిగారు. వారి వేధింపులు భరించలేని ఎస్వీ మెడికల్‌ కళాశాల పీడియాట్రిక్‌ పీజీ ఫైనలియర్‌ విద్యార్థిని ఇటీవల గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. తనకు రక్షణ కల్పించాలంటూ ఈ మెయిల్‌ ద్వారా మొరపెట్టుకుంది. దీనిపై స్పందించిన గవర్నర్‌... విచారణ చేపట్టాల్సిందిగా హెల్త్‌ యూనివర్సిటీ వీసీకి ఆదేశాలు జారీ చేశారు.

పీడియాట్రిక్‌ విభాగాధిపతి డాక్టర్‌ రవికుమార్, ప్రొఫెసర్‌ కిరీటి, ప్రొఫెసర్‌ శశికుమార్‌లు తన పట్ల అవమానకరంగా ప్రవర్తిస్తున్నారని బాధితురాలు లేఖలో పేర్కొంది. ప్రతిరోజు లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని, అభ్యంతరకర పదాలతో హింసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రాక్టికల్‌ పరీక్షలు వారి చేతుల్లో ఉన్నాయని వేధిస్తున్నారని ఆరోపించింది.

ఓ పాపకు తల్లినైన తాను వారి బాధలు భరించలేక ఓ సారి ఆత్మహత్యకు యత్నించగా, తన భర్త కాపాడినట్లు వివరించింది. పలుమార్లు ఎస్వీ మెడికల్‌ కళాశాల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయింది. దీనిపై స్పందించిన గవర్నర్‌... లైంగిక వేధింపులపై విచారణ చేపట్టాలని హెల్త్‌ వర్సిటీ వీసీని ఆదేశించారు. రుయాఆస్పత్రి అనస్థీషియా విభాగాధిపతి జమున, జనరల్‌ మెడిసిన్‌ విభాగాధిపతి డాక్టర్‌ జయా భాస్కర్, రుయా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సిద్ధానాయక్‌లతో విచారణ కమిటీని నియమించారు. ఈ కమిటీ 4 రోజులుగా అత్యంత గోప్యంగా విచారణ చేస్తోంది. 

మరిన్ని వార్తలు