చంద్రయాన్‌-2 చూసేందుకు వి'ల'క్షణ వేదిక

20 Jul, 2019 15:26 IST|Sakshi
షార్‌లో ఎంతో అందంగా నిర్మించిన సందర్శకుల గ్యాలరీ

సాక్షి, సూళ్లూరుపేట : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ నెల 22న మధ్యాహ్నం 2.43 గంటలకు ప్రయోగించనున్న చంద్రయాన్‌–2 ప్రయోగాన్ని వీక్షించేందుకు సందర్శకుల కోసం విలక్షణమైన గ్యాలరీని షార్‌ అధికారులు నిర్మించారు. తొలుత ఈ నెల 15వ తేదీ తెల్లవారుజామున చంద్రయాన్‌–2 ప్రయోగానికి సిద్ధం చేశారు. ఈ ప్రయోగం ఇస్రోకే ప్రతిష్టాత్మకం కావడంతో ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు దేశా వ్యాప్తంగా పౌరులను ఆహ్వానించింది.

వీరి కోసం షార్‌లోని శబరి గిరిజన కాలనీ ప్రాంతంలో సుమారు 60 ఎకరాల అటవీ భూమిలో సుమారు 5 వేల మంది సందర్శకులు కూర్చుని రాకెట్‌ ప్రయోగాన్ని వీక్షించేందుకు వీలు కల్పిస్తూ గ్యాలరీ నిర్మాణం చేపట్టారు. ఈ తరహా గ్యాలరీ నిర్మాణాన్ని సైతం షార్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. అయితే ప్రయోగానికి గంట వ్యవధిలో సాంకేతిక కారణాలతో కౌంట్‌ డౌన్‌ ప్రక్రియను నిలిపివేసిన విషయం తెలిసిందే.

ఆహ్వానితులకు మళ్లీ అవకాశం
ఈ నెల 15న ప్రయోగం నిర్వహించతలపెట్టినప్పుడు సందర్శకులు దేశంలోని నలుమూలల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఇస్రో వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకుని ఆ పాస్‌లతో రాకెట్‌ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా తిలకించాలని ఎన్నో ఆశలతో వచ్చారు. అర్ధరాత్రి వేళ అని చూడకుండా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులు ప్రయోగం వాయిదా పడడంతో నిరుత్సాహంగా వెనుదిరిగి వెళ్లిపోయిన విషయం తెలిసిందే.

అందుకే వారిని సంతృప్తి పరిచేందుకు గతంలో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న వాళ్లకు ఇచ్చిన సీరియల్‌ నంబర్‌లో వెబ్‌సైట్‌లో కొడితే అనుమతి వస్తోంది. కొత్తగా రావాలనుకునే వారికి మాత్రం సైట్‌ ఓపెన్‌ కాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. కొత్త వారికి కూడా చంద్రయాన్‌–2 ప్రయోగాన్ని వీక్షించే భాగ్యాన్ని కల్పించాలని పలువురు సందర్శకులు కోరుతున్నారు.   

మరిన్ని వార్తలు