Chandrayaan-3: Vikram lander successfully separated from propulsion module - Sakshi
Sakshi News home page

చంద్రయాన్‌-3లో కీలక ఘట్టం..మాడ్యూలర్‌ నుంచి విడిపోయిన ల్యాండర్‌

Published Thu, Aug 17 2023 1:47 PM

Chandrayaan 3: Vikram Lander successfully separated from propulsion module - Sakshi

చంద్రయాన్‌-3లో కీలక ఘట్టం పూర్తయ్యింది. ప్రోపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి విక్రమ్‌ ల్యాండర్‌ మాడ్యూల్‌ విడిపోయింది. ఈ మేరకు గురువారం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రకటించింది. దీంతో చంద్రయాన్‌-3 వ్యోమననౌక చంద్రుడికి మరింత చేరువైంది. ఈ నెల 23న సాయంత్రం 5.47 గంటలకు ల్యాండర్‌ను చంద్రుడి ఉపరితలంపై దక్షిణ ధృవ ప్రాంతంలో మృదువైన ప్రదేశంలో ల్యాండ్‌ కానుంది.

బెంగళూరులోని మిషన్‌ ఆపరేటర్‌ కాంప్లెక్స్‌(ఎంఓఎక్స్‌), ఇస్రో టెలీమెట్రీ ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌(ఇస్ట్రాక్‌), బైలాలులో ఉన్న ఇండియన్‌ డీప్‌ స్పేస్‌ నెట్‌వర్క్‌ (ఐడీఎస్‌ఎన్‌) లాంటి భూ నియంత్రతి కేంద్రాల నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు నేటి నుంచి ముఖ్యమైన ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి ల్యాండర్‌ మాడ్యూల్‌ విడిపోగా.. ల్యాండర్‌లో వున్న ఇంధనాన్ని మండించి ఈ నెల 19, 21న రెండుసార్లు ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టనున్నారు. 

చంద్రయాన్‌–3 ఇప్పుడు చంద్రుడి చుట్టూ 153 కిలోమీటర్లు, 163 కిలోమీటర్ల స్వల్ప దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతోంది. కాగా చందమామపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గత నెల 14న చంద్రయాన్‌–3ప్రయోగించిన విషయం తెలిసిందే. మిషన్‌ కక్ష్య దూరాన్ని ఐదోసారి పెంచే ప్రక్రియను బుధవారం విజయవంతంగా నిర్వహించిందిదే. దీంతో కక్ష్య దూరాన్ని పెంచే ప్రక్రియలన్నీ పూర్తయ్యాయి. 

Advertisement
Advertisement