సిటింగ్‌లకు సీట్లు గల్లంతే..!

1 Jan, 2019 12:20 IST|Sakshi

రెండు రోజులుగా అసెంబ్లీ సీట్లపై సీఎం కసరత్తు

జిల్లాలో పలువురు సిటింగ్‌లకు మొండిచేయి

కనిగిరి, మార్కాపురం, వై.పాలెం, ఎస్‌.ఎన్‌.పాడు అభ్యర్థుల మార్పు

కందులకు ఎమ్మెల్సీ, డేవిడ్‌రాజులకు ఎస్సీ కార్పొరేషన్‌ హామీలు

సాక్షి ప్రతినిధి, ఒంగోలు : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అల్లాలో అధికార పార్టీకి చెందిన పలువురు సిటింగ్‌లకు సీట్లు ఎగనామం పెట్టేందుకు ఆ పార్టీ అధిష్టానం సిద్ధమైంది. రెండు రోజులుగా అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక కసరత్తు చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకాశం జిల్లాకు సంబంధించి నలుగురు సిటింగ్‌లకు సీట్లు ఇవ్వకూడదని నిర్ణయించినట్లు విశ్వశనీయ సమాచారం. ఆదివారం రాజధానిలో ముఖ్యమంత్రి తుది కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై జిల్లాకు చెందిన ముఖ్య నేతలతో పలుమార్లు సంప్రదించిన ముఖ్యమంత్రి తుది జాబితా సిద్ధం చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా పశ్చిమ ప్రకాశం పరిధిలోని కనిగిరి, యర్రగొండపాలెం, మార్కాపురంతో పాటు బాపట్ల పార్లమెంటు పరిధిలోని సంతనూతలపాడు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

కనిగిరి బరిలో నిలిచేదెవరో...
కనిగిరి సిటింగ్‌ ఎమ్మెల్యే కదిరి బాబూరావును తప్పించి, ఆయన స్థానంలో మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నర్సింహారెడ్డిని పార్టీలోకి ఆహ్వానించి ఆయనకు టిక్కెట్‌ ఇచ్చేందుకు సీఎం సిద్ధమైనట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే ఉగ్రకు పార్టీ అధిష్టానం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లోనూ తనకే టిక్కెట్‌ ఇవ్వాలంటూ కదిరి బాబూరావు పలుమార్లు కోరారని, చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణకు సన్నిహితుడైన బాబూరావు అటు బాలకృష్ణ ద్వారా కూడా టిక్కెట్‌ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో బాబూరావును ఒప్పించే బాధ్యతను చంద్రబాబు బాలకృష్ణకు అప్పగించినట్లు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. 

అభ్యర్థుల గెలుపు బాధ్యత కందుల భుజాన..
ఇక మార్కాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ కందుల నారాయణరెడ్డిని సైతం తప్పించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే నిర్ణయించినట్లు తెలుస్తోంది. కందుల స్థానంలో ఇన్ఫోటెక్‌కు చెందిన మోహన్‌రెడ్డి సోదరుడు, టీటీడీ బోర్డు సభ్యుడు అశోక్‌రెడ్డిని మార్కాపురం అభ్యర్థిగా నిలపాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. కందుల నారాయణరెడ్డికి ఎమ్మెల్సీ పదవితో పాటు పశ్చిమ ప్రకాశం అభ్యర్థుల గెలుపు బాధ్యతలు అప్పగించేందుకు చంద్రబాబు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే రాబోయే ఎన్నికల్లో మార్కాపురం నుంచి తానే పోటీ చేస్తానని, టిక్కెట్‌ రాని పక్షంలో ఇండిపెండెంట్‌గానైనా పోటీలో ఉంటానని నారాయణరెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి నిర్ణయం నారాయణరెడ్డి అంగీకరించే పరిస్థితి కానరావడం లేదు. అదే జరిగితే మార్కాపురంలో టీడీపీకి చావు తప్పి కన్ను లొట్టపోవడం ఖాయమని ఆ పార్టీ వర్గాల్లోనే ప్రచారం సాగుతోంది. 

వై.పాలెంలో గ్రూపుల గోల..
యర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరుపున ఎమ్మెల్యేగా ఎన్నికైన డేవిడ్‌రాజు ఆ తర్వాత పార్టీ ఫిరాయించి టీడీపీలోకి వెళ్లారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోటగా ఉన్న యర్రగొండపాలెం నుంచి టీడీపీ తరుపున పోటీ చేసేందుకు ఎవరూ ముందుకొచ్చే పరిస్థితులు లేవు. డేవిడ్‌రాజును ఈ నియోజకవర్గం నుంచే టీడీపీ అభ్యర్థిగా నిలిపితే డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితి లేదన్నది టీడీపీ వర్గాలే చెబుతున్న మాట. ఈ పరిస్థితుల్లో డేవిడ్‌ రాజును తప్పించి రాజశేఖరంను యర్రగొండపాలెం టీడీపీ అభ్యర్థిగా నిలపాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో డేవిడ్‌ రాజుకు ఎమ్మెల్సీ లేదా ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి కట్టబెట్టే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. యర్రగొండపాలెంలో టీడీపీ ఇప్పటికే గ్రూపులుగా విడిపోయింది. టీడీపీ అభ్యర్థికి అందరూ కలిసి పనిచేసే పరిస్థితి కానరావడం లేదు. 

ఎస్‌.ఎన్‌.పాడులో 
ఇక బాపట్ల పార్లమెంటు పరిధిలోని సంతనూతలపాడు నియోజకవర్గంలోని అభ్యర్థి మార్పు ఖాయంగా కనిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌ను అధికార పార్టీకి చెందిన ముఖ్యమంత్రి సామాజిక వర్గం నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని మార్చాలని, విజయ్‌కుమార్‌ను అభ్యర్థిగా నిలిపితే తాము పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తామని అసమ్మతి వర్గం ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు లోకేష్‌లకు సైతం పలుమార్లు ఫిర్యాదు చేశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి నియోజకవర్గ సమావేశాన్ని నిర్వహించి అసమ్మతి నేతలకు వార్నింగ్‌లు ఇచ్చినా ఇక్కడ పరిస్థితి చక్కబడలేదు. దీంతో అభ్యర్థి మార్పు ఖాయమని ఆ పార్టీ వర్గాలే ప్రచారం చేస్తున్నాయి. ఇక్కడి నుంచి ఎవరిని అభ్యర్థిగా నిలుపుతారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. విజయ్‌కుమార్‌ను మార్చే పక్షంలో ఆయన వర్గం టీడీపీ కొత్త అభ్యర్థికి మద్దతు పలికే పరిస్థితి కానరావడం లేదు. దీంతో ఇక్కడ టీడీపీ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. 

చీరాలలోనూ సందేహమే..
ఇక చీరాల నియోజకవర్గంలోనూ అభ్యర్థి ఎంపికపై సందిగ్ధత నెలకొన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ టీడీపీని వీడతారన్న ప్రచారం జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ వర్గాల్లోనే ఉంది. ఆమంచి పార్టీని వీడే పక్షంలో టీడీపీ అభ్యర్థిగా పాలేటి రామారావును ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఆమంచి పార్టీని వీడే పక్షంలో ఇక్కడ టీడీపీకి గడ్డు పరిస్థి«తి తప్పదు. మొత్తంగా రాబోయే ఎన్నికల్లో పలువురు సిటింగ్‌లకు టీడీపీ అధిష్టానం సీట్లు ఇవ్వడం లేదని ఆపార్టీకి చెందిన ముఖ్యనేతలే పేర్కొంటుండడం గమనార్హం. 

మరిన్ని వార్తలు