ఆరుగురి ఊపిరి తీసిన విషవాయువు

13 Jul, 2018 03:36 IST|Sakshi
ప్రమాదం జరిగిన గెర్డావ్‌ స్టీల్‌ప్లాంట్‌

తాడిపత్రిలోని గెర్డావ్‌ ఉక్కు పరిశ్రమలో విషాదం.. అండర్‌గ్రౌండ్‌లో కార్బన్‌ మోనాక్సైడ్‌ లీకై ప్రమాదం

యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే దుర్ఘటన!

రూ. 50 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని విపక్షాల డిమాండ్‌

ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన విపక్ష నేత వైఎస్‌ జగన్‌

తాడిపత్రి: అనంతపురం జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఉక్కు పరిశ్రమలో విషవాయువు లీక్‌ కావడంతో ఆరుగురు కార్మికులు మృత్యువాతపడ్డారు. తాడిపత్రి మండలంలోని అక్కన్నపల్లి సమీపంలో ఉన్న గెర్డావ్‌ ఉక్కు పరిశ్రమలో గురువారం సాయంత్రం 4.30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.

పరిశ్రమలోని పిగ్‌ఐరన్‌ (ముడి ఇనుము)వేడి చేసేందుకు ఉపయోగించే కార్బన్‌ మోనాక్సైడ్‌ వాయువు లీక్‌ కావడంతో కార్మికులు కుప్పకూలిపోయారు. పరిశ్రమలోని రోలింగ్‌ విభాగంలో సుమారు 400 అడుగుల లోతు అండర్‌గ్రౌండ్‌లో ఉన్న కార్బన్‌ మోనాక్సైడ్‌ పైపు వాల్వును ఓ కార్మికుడు తిప్పడంతో అందులోని వాయువు లీకై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.

ఈ విషయాన్ని గమనించిన మరో ముగ్గురు కార్మికులు.. స్పృహతప్పి పడిపోయిన సహచరుడిని బయటికి తీసుకొచ్చేందుకు అండర్‌గ్రౌండ్‌లోకి దిగారు. వారు కూడా లోపలికి వెళ్లిన కొన్ని క్షణాల్లోనే ఊపిరాడక అక్కడిక్కడే కుప్పకూలి పోయారు. అక్కడికి వచ్చిన మరో ఇద్దరు కార్మికులు కూడా విషవాయువు పీల్చి స్పృహతప్పిపోయారు. ఈ ఘటన తెలిసి పరిశ్రమలో అలజడి రేగింది. కార్మికులందరూ ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్పృహతప్పి పడిపోయిన వారిని చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

అయితే అప్పటికే వారందరూ మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. ఈఘటనతో తాడిపత్రిలో విషాదం అలుముకుంది. మృతుల కుటుంబీకులు, బంధువులు, స్నేహితుల రోదనలతో ఆస్పత్రి ప్రాంగణం దద్దరిల్లింది. మృతుల్లో వసీం, గురువయ్యలు పరిశ్రమ సిబ్బంది కాగా గంగాధర్, లింగమయ్యలు కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్నారు. విషయం తెలుసుకున్న జాయింట్‌ కలెక్టర్‌ డిల్లీరావు, ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్, ఆర్డీఓ మలోల హుటాహుటీన తాడిపత్రి  ప్రభుత్వాసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం: కార్మికులు
యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని కార్మికులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి పలు సంఘటనలు చోటు చేసుకున్నాయని, అయితే పరిశ్రమ యాజమాన్యం వాటిని సహజ మరణాలుగా చిత్రీకరించి వెలుగులోకి రానీయ కుండా చేసిందన్నారు. ప్రశ్నించిన కార్మికులపై యాజ మాన్యం బెదిరింపులకు దిగుతోందని చెప్పారు.

రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి..
మృతి చెందిన వారి కుటుంబాలకు పరిశ్రమ యాజమాన్యం రూ. 50 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆస్పత్రి ప్రాంగణంలో అఖిలపక్ష పార్టీలు ఆందోళన చేశాయి. అయితే టీడీపీకి చెందిన కొందరు నాయకులు రూ. 5 లక్షల చొప్పున చెల్లిస్తామని చెప్పారు. రూ. 50 లక్షలు ఇవ్వాల్సిందేనని వైఎస్సార్‌సీపీ నేతలు పట్టుబట్టారు.

దీంతో ఇరు పార్టీ నేతల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. పోలీసుల రంగప్రవేశం చేసి ఇరువురికి సర్దిచెప్పారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేసేంత వరకు ఆందోళన చేస్తామని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు కె.రమేశ్‌రెడ్డి, పైల నరసింహయ్య తేల్చిచెప్పారు. పరిశ్రమ యాజమాన్యంపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.

క్రిమినల్‌ కేసు నమోదు చేస్తాం..
గెర్డావ్‌ స్టీలు పరిశ్రమలో జరిగిన ఘటనపై విచారణ చేస్తున్నామని, ఇప్పటికే క్రిమినల్‌ కేసు కూడా నమోదు చేశామని జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్‌ తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున నష్టపరిహారం చెల్లిస్తామని జాయింట్‌ కలెక్టర్‌ ఢిల్లీరావు తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జరిగిన ఘటనపై విచారణను ఇప్పటికే ప్రారంభించామని పరిశ్రమల శాఖ ఇన్‌స్పెక్టర్‌ రాధాకృష్ణ తెలిపారు. పరిశ్రమలో ఉన్న సేఫ్టీ పరికరాలు పనిచేస్తున్నాయా లేదా అన్న వివరాలు విచారణలో తెలియాల్సి ఉందన్నారు.

మృతులు: 1. రంగనాథ్‌ (21) (తాడిపత్రి మండలం బోడాయిపల్లి), 2.గంగాధర్‌ (35) (అనంతపురం జిల్లా తుమ్మళ్ల మార్కపల్లి), 3.వసీమ్‌ (37) (కర్నూలు జిల్లా బేతంచెర్ల), 4.లింగయ్య (35) (వైఎస్సార్‌ జిల్లా కోడిగాండ్లపల్లి), 5.గురువయ్య (37) (ప్రకాశం జిల్లా గాండ్లపల్లి), 6.మనోజ్‌ (25) (అనంతపురం జిల్లా తాడిపత్రి).


వైఎస్‌ జగన్‌  దిగ్భ్రాంతి
సాక్షి, అమరావతి: అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఉక్కు కర్మాగారంలో గ్యాస్‌ లీకై ఆరుగురు కార్మికులు మృతి చెందడం పట్ల ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కార్మికుల మృతికి సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు  ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు