-

‘పది’లం

2 Apr, 2014 03:32 IST|Sakshi

ఆలూరు, న్యూస్‌లైన్: వయస్సు మీదపడినా వారిలో ఆశయం సన్నగిల్లలేదు. పదో తరగతి పాసుకావాలనే దృఢసంకల్పంతో పరీక్షలు రాస్తున్నారు. ఒకరు ఉద్యోగంలో పదోన్నతి కోసం.. మరొకరు గుర్తింపు కోసం.. పట్టుదలతో ఇంకొకరు.. ఇలా రకరకాల లక్ష్యాలతో బాలబాలికలతోపాటు వీరు పరీక్ష హాలులోకి అడుగు పెడుతున్నారు. ఆలూరు ప్రభుత్వ బాలుర నంబర్ 2 పాఠశాలలో శ్రద్ధగా పరీక్ష రాస్తున్నారు. మంగళవారం ‘న్యూస్‌లైన్’ వారిని పలకరించగా పలు ఆసక్తికర విషయాలు చెప్పారు.  వారి మాటల్లోనే..
 
 గుర్తింపు కోసం.. బాలమ్మ, ఆదోని
 పేదరికంలో పుట్టడంతో నాకు చదువు అబ్బ లేదు. కూలి పనులు వెళ్లి కుటుంబాన్ని పోషించాల్సి వచ్చేది. అయితే ఇటీవల నాకు అంగన్ వాడీ ఆయాగా ఉద్యోగం వచ్చింది. దీంతో చదువు తప్పనిసరి అని తెలసుకున్నాను. చదువుతో మంచి గుర్తింపుకూడా వస్తుందని తెలిసింది. దీంతో 37 ఏళ్ల వయసులోనే పదో తరగతి పాస్ కావాలని పరీక్షలు రాస్తున్నాను.
 
 అంగన్‌వాడీ కార్యకర్తగా ఎదగాలని: లక్ష్మీదేవి, అంగన్‌వాడీ ఆయా
 ఆదోని పట్టణ కేంద్రంలోని అంగన్‌వాడీ సెంటర్లో నేను ఆయాగా పనిచేస్తున్నాను. నా వయస్సు 40 సంవత్సరాలు. పదో తరగతి కచ్చితంగా పాస్ కావాలనే పట్టుదలతో పరీక్షలు రాస్తున్నాను. పది పాస్ అయిన ఆయాలను అంగన్‌వాడీ కార్యకర్తలుగా నియమించాలని నిబంధనలు ఉన్నాయి. దీంతో తప్పని పరిస్థితుల్లో  పది పరీక్షలు రాస్తున్నాను.

 
 బీపీఎం కావాలని నా చివరి కోరిక:
లోకారెడ్డి, నేమకల్లు గ్రామ ఈడీఎంసీ
 నేను ఈడీఎంసీగా చిప్పగిరి మండలం నేమకల్లు గ్రామ పోస్టాఫీసులో పనిచేస్తున్నాను. నాకు తక్కువ జీతం వస్తోంది. నిజ జీవితంలో కొన్ని లక్ష్యాలను సాధించలేక పోయాను. నేను పదిపాసయితే బీపీఎంగా పదోన్నతి పొందే అవకాశం ఉంది. అందుకోసమే వయస్సు మీదపడినా(55) పది పరీక్షలను
 రాస్తున్నాను.  
 
 
 విద్యార్హత కోసం.. :
 నూర్‌అహ్మద్, ఆదోని ఆర్టీసీ బస్ డ్రైవర్
  చదువుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ విషయం గుర్తించడానికి నాకా చాలాకాలం పట్టింది. ప్రస్తుతం నా వయస్సు 55 ఏళ్లు. ఆదోని ఆర్టీసీ బస్ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాను. నాకింకా మూడేళ్లు సర్వీసు ఉంది. పేదరికంతో అప్పట్లో పదోతరగతి పూర్తి చేయలేకపోయాను. అవకాశం ఉండగా ఎందుకు వదులుకోవాలనుకున్నాను. ప్రధానంగా విద్యార్హత ఉండాలనే లక్ష్యంతో పదో తరగతి పరీక్షలు రాస్తున్నాను.
 

మరిన్ని వార్తలు