వరదబాధితుల అవస్థలు ఇన్నిన్ని కాదు

8 Aug, 2013 04:12 IST|Sakshi

భద్రాచలం, న్యూస్‌లైన్ : గోదారమ్మ శాంతించింది.... భద్రాచలం వద్ద బుధవారం సాయంత్రం 42 అడుగుల నీటిమట్టం నమోదైంది. మొదటి ప్రమాద హెచ్చరికను కూడా ఉప సంహరిస్తున్నట్లు  భద్రాచలం సబ్ కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా ప్రకటించారు. అయితే వరద తొలగిన తర్వాత పరిస్థితులు దయనీయంగా ఉన్నాయి. గ్రామాలు బురద మయంగా తయారయ్యాయి. ముంపు తగ్గటంతో పునరావాసాల్లో తలదాచుకున్న బాధితులు ఇళ్లకు చేరుకుని పరిస్థితి చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోదావరి వరదకు ఇళ్లలోకి బురద చేరి  సామాగ్రి అంతా అందులో చిక్కుకుపోయింది. వాటిని బయటకు తీయడానికి నానా అవస్థలు పడుతున్నారు. కాగా,  ముంపు పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో చాలాచోట్ల రహదారులపై ఉన్న నీరు కూడా తొలగిపోయింది. అయితే వాజేడు మండల కేంద్రానికి సమీపంలో ఇంకా నడుం లోతు నీరు నిల్వ ఉంది. అదే విధంగా చీకుపల్లి వద్ద  పది అడుగులకు పైగానే నీరు ఉండటంతో అవతల ఉన్న 32 గ్రామాలకు ఇంకా పడవ ప్రయాణమే సాగుతోంది. భద్రాచలం నుంచి వాజేడు వరకూ మాత్రమే ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి. భద్రాచలం పట్టణంలోని రామాలయం వద్ద వరద నీరు పూర్తిగా తొలగిపోయింది. దీంతో  విస్తాకాంప్లెక్స్ వద్ద దుకాణాలు వారం రోజుల తరువాత బయట పడ్డాయి.  
 
 అంతా నష్టమే..
 గోదావరి వరదలతో పరీవాహక ప్రాంత వాసులకు అపార నష్టం వాటిల్లింది. భద్రాచలం, పాల్వంచ
 డివిజన్‌లలో ప్రాథమిక అంచనా వేసిన వ్యవసాయ శాఖ అధికారులు పూర్తి స్థాయి నివేదికల కోసం సర్వేను ముమ్మరం చేశారు. అదే విధంగా విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్‌లు నీటిలో మునిగిపోవటంతో పాటు చాలా చోట్ల స్తంభాలు నేలకొరగటంతో నష్టం సుమారు రూ.50 లక్షల వరకూ ఉంటుందని ఆ శాఖాధికారులు అంచనా వేస్తున్నారు.   వరదలతో వాజేడు మండలం, అదేవిధంగా భద్రాచలం నుంచి కూనవరం మండలాలకు వెళ్లే ఆర్‌అండ్‌బీ రహదారులకు పలు చోట్ల గ ండ్లు పడ్డాయి. భద్రాచలం నుంచి కూనవరం వెళ్లే రహదారిలో ఒండ్రు మట్టి చేరటంతో వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఈ రహదారిలో బుధవారం పలు చోట్ల వాహనదారులు బురదలో జారి  కింద పడిపోయారు. చాలా మందికి గాయాలయ్యయి.  రాకపోక లకు అంతరాయం లేకుండా ఉండేందుకు ఆర్‌అండ్‌బీ శాఖాధికారులు యుద్ద ప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టారు.
 
 ఏజెన్సీలో ప్రబలుతున్న వ్యాధులు :  గోదావరి తగ్గుముఖం పట్టాకా అంటు వ్యాధులు విజృంభిస్తుండటంతో ఏజెన్సీ వాసులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. దుమ్ముగూడెం, వీఆర్‌పురం, కూనవరం, చింతూరు మండలాల్లో పలువురు జ్వరంతో బాధపడుతున్నారు. కూనవరం మండలంలో  మంగళవారం అతిసార వ్యాధితో ఓ మహిళ మృతి చెందగా, బుధవారం జ్వరంతో కుంజా రాజు(35) మృత్యువాత పడ్డాడు. వరద ఉధృతి తగ్గినప్పటికీ గ్రామాల్లో బురద పేరుకుపోవటంతో వాటిని  ఇప్పటికిప్పుడు శుభ్రం  చేసే పరిస్థితి లేక ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీ అధికారులు సైతం పారిశుధ్య చర్యలపై దృష్టి సారించకపోవటంతో అంటువ్యాధులు విజృంభిస్తున్నాయి. గ్రామాల్లో కనీసం బ్లీచింగ్ కూడా చల్లటం లేద ని ఆయా గ్రామాల ప్రజలు అంటున్నారు. జిల్లా ఉన్నతాధికారులు యుద్ద ప్రాతిపదికన పారిశుధ్య నివారణ చర్యలు చేపట్టక పోతే విష జ్వరాలు విజృంభించే అవకాశం ఉందని ఏజెన్సీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు