అడ్డదారులు తొక్కుతున్న కొందరు మహిళా ఎస్‌ఐలు!

22 Jul, 2019 09:18 IST|Sakshi

ఎన్నికల అనంతరం జిల్లాలో 47 మంది నూతన ఎస్‌ఐలకు స్టేషన్‌ పోస్టింగ్‌లు

సత్తెనపల్లి సబ్‌ డివిజన్‌ పరిధిలో వసూళ్లకు పాల్పడుతున్న మహిళా ఎస్‌ఐ

గురజాల సబ్‌డివిజన్‌ పరిధిలో కేసు రాజీ కోసం మరో మహిళా ఎస్‌ఐ డబ్బులు డిమాండ్‌  

కొత్తగా వచ్చిన ఎస్‌ఐలను తప్పుదోవ పట్టిస్తున్న క్షేత్రస్థాయి సిబ్బంది

సాక్షి, గుంటూరు: కొత్తగా పోలీస్‌ శాఖలోకి ప్రవేశించిన నాలుగో సింహాలు తడబడుతున్నాయి. అనతికాలంలోనే తప్పటడుగులు వేస్తున్నాయి. కింది స్థాయి సిబ్బంది ప్రోత్సాహంతో వసూళ్లకు పాల్పడుతున్నాయి. ప్రజా సేవ చేయాలనే తలంపుతో పోలీస్‌ శాఖలోకి వచ్చిన యువ ఎస్‌ఐలను కింది స్థాయి సిబ్బంది తప్పుదోవ పట్టిస్తున్నారు. దీంతో వారు అవినీతి ముద్ర వేసుకుంటున్నారు.

సార్వత్రిక ఎన్నికల అనంతరం గుంటూరు అర్బన్‌ జిల్లాలో 11, రూరల్‌ జిల్లాలో 36 మంది ప్రొహిబిషన్‌ ముగించుకున్న కొత్త ఎస్‌ఐలకు అప్పటి ఎస్పీలు స్టేషన్‌ పోస్టింగ్‌లు ఇచ్చారు. వీరిలో కొంత మంది తప్పటడుగులు వేస్తున్నారు. కేసుల్లో రాజీ కుదురుస్తూ నిందితుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు.

సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో కోడెల కుటుంబంపై కే–ట్యాక్స్, ఉద్యోగాల్లో మోసాలు చేసిన కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. కోడెల కుటుంబంపై నమోదైన ఓ కేసులో కొత్తగా నియమితులైన ఓ మహిళా ఎస్‌ఐ రూ.లక్ష వసూలు చేసినట్టు సమాచారం. సత్తెనపల్లి సబ్‌ డివిజన్‌లో పని చేస్తున్న మహిళా ఎస్‌ఐ కోడెల కుటుంబంపై నమోదైన ఓ కేసులో రాజీ కుదిర్చి రూ.25 లక్షల నగదు ఫిర్యాదుదారునికి వెనక్కి ఇప్పించారు. నగదు వెనక్కు ఇప్పించిన ఎస్‌ఐ.. కేసు తీసేయాలని యత్నిస్తుండటంతో ఆ విషయం ఉన్నతాధికారికి తెలిసి మందలించారు. కేసులో బాధితునికి డబ్బు తిరిగి ఇప్పించిన ఈమె రూ.లక్ష కోడెల తరఫు వ్యక్తి నుంచి తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం.

మరో సందర్భంలో తన పట్ల యువకుడు అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటనపై వివాహిత ఫిర్యాదు చేయగా నిందితుడి నుంచి డబ్బు తీసుకుని సదరు మహిళా ఎస్‌ఐ నామమాత్రపు కేస నమోదు చేసి వదిలేశారు. ఆ మరుసటి రోజే బహిర్భూమికి వెళుతున్న వివాహితపై యువకుడు లైంగికదాడియత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయం వివాహిత.. భర్తకు చెప్పడంతో ఆయన తరఫు బంధువులు ఆ యువకుడిపై దాడికి పాల్పడ్డారు. దాడి ఘటనలో యువకుడు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయస్థితిలో గుంటూరులోని ఓ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. ఇదే తరహాలో వెలుగు చూడని మరికొన్ని ఆరోపణలు మహిళా ఎస్‌ఐపై ఉన్నట్టు తెలుస్తోంది. 

బియ్యం, గ్రానైట్‌ లారీలు చూసీచూడనట్టు..
నరసరావుపేట సబ్‌ డివిజన్‌ పరిధిలోని వినుకొండ నియోజకవర్గంలో ప్రొహిబిషన్‌ పూర్తి చేసుకుని పోస్టింగ్‌ పొందిన మరో మహిళా ఎస్‌ఐ బియ్యం, గ్రానైట్, ఇసుక అక్రమ రవాణాలను చూసీచూడనట్లు వ్యవహరిస్తూ మామూళ్లు రాబడుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల వినుకొండ టీడీపీకి చెందిన ఓ రేషన్‌ మాఫియా సభ్యుడు తరలిస్తున్న బియ్యం లారీని పట్టుకున్న మహిళా ఎస్‌ఐ అతని నుంచి డబ్బులు తీసుకుని వదిలేసినట్టు విశ్వసనీయ సమాచారం. చిన్న చిన్న ఆటోల్లో తరలిస్తున్న బియ్యాన్ని మాత్రం పట్టుకుంటూ లారీల్లో తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని మాత్రం ఈమె వదిలేస్తున్నారు.

ఇదే తరహాలో ప్రకాశం జిల్లా చీమకుర్తి నుంచి అనధికారికంగా గ్రానైట్‌ తరలిస్తున్న వారి నుంచి, గుండ్లకమ్మ నది నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేసే వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. గురజాల సబ్‌ డివిజన్‌ పరిధిలో పని చేస్తున్న మరో మహిళా ఎస్‌ఐ సివిల్‌ వివాదంలో తల దూర్చి తనను బెదిరిస్తున్నారని ఓ బాధితురాలు స్పందనలో రూరల్‌ ఎస్సీకి ఫిర్యాదు చేసింది. వీరి తరహాలోనే మరి కొందరు కొత్త ఎస్‌ఐ అడ్డదారులు తొక్కుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 
క్షేత్ర స్థాయి సిబ్బంది ప్రోత్సాహంతోనే..
కొత్తగా స్టేషన్‌ పోస్టింగ్‌ పొందిన ఎస్‌ఐలను క్షేత్ర స్థాయి సిబ్బంది తప్పుదోవ పట్టిస్తున్నారు. కొందరు ఏఎస్‌ఐలు, హెడ్‌ కానిస్టేబుళ్లు నిందితుల నుంచి డబ్బు వసూలు చేసి కేసుల్లో రాజీ కుదర్చడం, సివిల్‌ సెటిల్‌మెంట్‌లు చేయించడం వంటి కార్యకలాపాలకు ఎస్‌ఐలను ప్రోత్సహిస్తున్నారు. వీరే మధ్యవర్తులుగా వ్యవహరించి ఎస్‌ఐలకు డబ్బులు వసూలు చేసి పెడుతున్నారు.

మరి కొన్ని సందర్భాల్లో యువ ఎస్‌ఐలు దూకుడుగా వ్యవహరిస్తూ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులపై సైతం చేయి చేసుకుంటున్నారు. ప్రతి చిన్న విషయానికి లాఠీ ఝుళిపిస్తూ ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు తూట్లు పొడుస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై పోలీస్‌ బాస్‌లు దృష్టి సారించి యువ ఎస్‌ఐలను గాడిలో పెట్టాలన్న ప్రజలు కోరుతున్నారు. 

మరిన్ని వార్తలు