నాన్న భారమయ్యాడు

14 May, 2018 07:56 IST|Sakshi
అందరూ ఉన్న అనాథ వృద్దుడు ఆంజనేయులు

వృద్ధాప్యంలో కొడుకుల ఆదరణ కరువు

అనాథగా పాములపాడు చేరిన ప్రకాశం జిల్లా వృద్ధుడు

ఆకలి తీరక, అవమానాలు భరించలేక ఇంటి నుంచి బయటకు

ప్రకాశం, పాములపాడు: కడుపున పుట్టిన కొడుకులే కన్నోళ్లపై కాఠిన్యం చూపుతున్నారు. వృద్ధాప్యంలో పిడికెడు మెతుకులు పెట్టి ఆకలి తీర్చి అండగా ఉండాల్సింది పోయి పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. ఫలితంగా వృద్ధులు అందరూ ఉన్న అనాథలుగా రోడ్డున పడుతున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం కొలనుభీమునిపాడు సమీప కె.కొత్తపల్లికి చెందిన చిన్న ఆంజనేయులు (70) దీనగాథ ఇదే. వృద్ధాప్యం మీదపడడం, కోడళ్ల ఛీదరింపులు పెరిగిపోవడం, భార్య సహకారం లేకపోవడంతో ఇంటి నుంచి బయటకు వచ్చాడు. ఎటు పోవాలో తెలియక లారీ ఎక్కి ఆత్మకూరుకు, అక్కడి నుంచి ఆటోలో పాములపాడు చేరాడు. ఐదు రోజులుగా స్థానికులు ఓ ముద్ద పెడితే తినడం, హోటళ్లు, దుకాణాల మెట్ల మీదే పడుకుని నిద్రిస్తూ కాలం వెళ్లదీస్తున్నాడు.

బాధిత వృద్ధుని వివరాల మేరకు.. ఆంజనేయులకు నక్కా వెంకటరమణ, శివయ్య కుమారులు. ఇద్దరికీ వివాహం చేశారు. ప్రస్తుతం గౌండా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.  పెద్దల నుంచి సంక్రమించిన రెండున్నర ఎకరాలతోపాటు కూలినాలికి వెళ్లి సంపాదించి మరో ఎకరన్నర పొలం, రెండు ఇళ్లను వారికే అప్పగించాడు. ఇద్దరు కూతుళ్లకు కట్నం ఇచ్చి పెళ్లి చేశాడు. ఉన్న డబ్బులు అయిపోయే సరికి కుటుంబీకులకు వృద్ధుడు భారమయ్యాడు. కొడుకులు పట్టించుకోకపోవడం, కోడళ్లు చీటికి మాటికి ఈసడించుకోవడం, భార్య సైతం నిర్లక్ష్యం చేయడంతో ఆకలి తీరక, అవమానాలు భరించలేక కుంగిపోయాడు.

పోలీసులు మందలించినా..
తన పట్ల కొడుకులు అనుసరిస్తున్న తీరుపై బాధిత వృద్ధుడు మార్కాపురం స్టేషన్‌లో ఫిర్యా దు చేయగా పోలీసులు కుమారులను పిలిపించి మందలించారు. అయితే కొద్ది రోజులకే పరిస్థితి మొదటికి రావడంతో భరించలేక ఇంటి నుంచి బయటకు వచ్చాడు. పాములపాడులో ఉంటూ స్థానికులు పెట్టింది తింటూ కడుపు నింపుకొంటున్నాడు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి  వృద్ధాశ్రమంలో చేర్పిస్తానని చెప్పాడని, అప్పటి వరకు హోటల్‌ మెట్లే ఆశ్రయం అని, ఇంటి నిర్మాణానికి ఉంచిన ఇసుక దిబ్బనే పాన్పు అంటూ నిట్టూర్చాడు.

మరిన్ని వార్తలు