Aligarh: రూ.8 లక్షలకు కొడుకును అమ్మేందుకు బేరం!

31 Oct, 2023 08:24 IST|Sakshi

అలీగఢ్‌: కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధం అవుతుండటాన్ని మనం చూస్తుంటాం. అయితే తమ కుమార్తెను పోషించేందుకు కన్న కొడుకును అమ్మకానికి పెట్టిన తల్లిదండ్రుల ఉదంతం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఈ హృదయ విదారక ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో చోటుచేసుకుంది.

అలీగఢ్‌లో వడ్డీ వ్యాపారుల వేధింపులకు విసిగిపోయిన ఓ తండ్రి తన కొడుకును అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తండ్రి తన 11 ఏళ్ల కుమారుడిని విక్రయించడానికి నగరంలోని గాంధీపార్క్ బస్టాండ్ కూడలిలో భార్య, కొడుకు, కూతురితో సహా కూర్చున్నాడు. తన మెడలో ఒక ప్లకార్డును వేలాడదీసుకున్నాడు. ‘నా కుమారుడు అమ్మకానికి ఉన్నాడు’ అని రాసి ఉంది. తన కుమారుని ధర రూ.6 నుంచి 8 లక్షలు ఉందని ఆ తండ్రి చెబుతున్నాడు. 

మహుఖేడా పోలీస్ స్టేషన్ పరిధిలోని అసద్‌పూర్ కయామ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ తండ్రి కొన్ని నెలల క్రితం ఓ భూమిని కొనుగోలు చేశాడు. ఇందుకోసం ఓ వ్యక్తి నుంచి కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాడు. అప్పు ఇచ్చిన కొద్ది రోజులకే వేధింపులు ప్రారంభమయ్యాయని బాధితుడు తెలిపాడు. ‘నా చేతిలో డబ్బు లేదు. ఇటువంటి పరిస్థితిలో రుణం చెల్లించాలంటూ రౌడీలు  నిరంతరం ఒత్తిడి తెస్తున్నారు. కొద్ది రోజుల క్రితం రౌడీలు నా ఈ-రిక్షాను లాక్కున్నారు. దీంతో కుటుంబ పోషణకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎవరైనా నా కుమారుడిని రూ.6 నుంచి 8 లక్షలకు కొనుక్కోవాలని, అప్పడే తాను తన కూతురిని సక్రమంగా  పోషించుకోగలనని’ ఆ తండ్రి కనిపించిన అందరికీ చెబుతూ కంటనీరు పెట్టుకుంటున్నాడు. 

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు తండ్రిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తన బంధువు వద్ద తాను అప్పు తీసుకున్నానని, తిరిగి చెల్లించలేకపోయానని బాధిత తండ్రి తెలిపాడు. అనంతరం పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పారు. ఈ నేపధ్యంలో బాధితుడు డబ్బులు త్వరలో ఇచ్చేస్తానని చెప్పాడు. దీంతో ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిరింది.
ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్- హమాస్ యుద్ధంతో భారత్‌కు నష్టం ఏమిటి?

మరిన్ని వార్తలు