క్షమించండి!

31 Jul, 2015 02:27 IST|Sakshi

శ్రీకాకుళం న్యూకాలనీ: పండిత, పీఈటీ పోస్టుల అప్‌గ్రేడేషన్ ప్రక్రియకు తీవ్రంగా కృషిచేస్తున్నానని, నిర్దేశించిన సమయంలో పూర్తికావడంలో లోపం జరిగినందున పెద్ద మనసుతో తనను క్షమించాలని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు కోరారు. పట్టణంలోని కోడిరామ్మూర్తి స్టేడియం దరి అంబేడ్కర్ ఆడిటోరియంలో జిల్లా పీఈటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న మూడు రోజుల వ్యాయామ ఉపాధ్యాయుల సెమినార్ కమ్ వర్క్‌షాప్ సదస్సుకు గురువారం ఆయన హాజరై ప్రసంగించారు.
 
  పండిత, పీఈటీ పోస్టుల అప్‌గ్రేడేషన్ ప్రక్రియ కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పూర్తికావాల్సిందన్నారు. చెరో 2500 ఉపాధ్యాయ పండితులు, పీఈటీల పోస్టుల అప్‌గ్రేడేషన్ పక్రియకు ఫైల్ కూడా పూర్తయిందని, అయితే అప్పటి మెజారిటీ కేబినెట్ సమ్మతి లేకపోవడంతో ఫైల్ తటస్థంగా ఉండిపోయిందన్నారు. ఇంతలోగా సమైక్య ఉద్యమాలు, రాష్ట్రవిభజనతో కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో గందరగోళం నెలకొన్నమాట వాస్తవమని అంగీకరించారు.
 
 యోగాతోనే ఆరోగ్యం సొంతం
 అనంతరం యోగా గురువు రామారావు మాస్టారు ఆధ్వర్యంలో ప్రత్యేక యోగా తరగతులు నిర్వహించి అవగాహన కల్పించారు. వివిధ యోగాసనాలను వేయించి, దాని ఉపయోగం, తీరుతెన్నులు గురించి విపులంగా వివరించారు. సంపూర్ణమైన ఆరోగ్యం ఒక్క యోగాతోనే సాధ్యమని చెప్పారు. మధ్యాహ్నం డాక్టర్ అన్నెపు శివప్రసాద్ ఫిజియోథెరపీ గురించి వివరించారు.
 
 అనంతరం బేస్‌బాల్, సాఫ్ట్‌బాల్ క్రీడాంశాల ఆటతీరు, మైదాన కొలతలతో పాటు వివిధ అంశాలపై పీడీ కె.రవికుమార్(జెడ్పీహెచ్‌స్కూల్, ఇప్పిలి) ఎల్‌సీటీ ప్రొజక్టర్ సహాయంతో వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి పి.సుందరరావు, జిల్లా పీఈటీ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వై.పోలినాయుడు, ఎం.సాంబమూర్తి, కె.రాజారావు, వెంకటరమణ, సూరిబాబు, హరిబాబు, ఎమ్మెస్సీ శేఖర్, విశ్రాంత పీడీ టి.రామజోగినాయుడు, పీఆర్‌టీయూ, ఏపీటీఎఫ్ ప్రతినిధులు వి.హరిశ్చంద్రుడు, రాజశేఖర్, భానుమూర్తి, తదితరులు పాల్గొన్నారు. కాగా శుక్రవారం సాయంత్రంతో సెమినార్ ముగియనుంది.

మరిన్ని వార్తలు