ఆశల చిగురింత...

10 Jun, 2016 01:16 IST|Sakshi

నైరుతి రుతుపవనాల    పలకరింత
జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
వాగులు, వంకల్లో  చేరుతున్న వర్షపునీరు
ఖరీఫ్ పంటల సాగుకు సిద్ధమైన అన్నదాత
రైతుల కోసం 6 వేల మెట్రిక్ టన్నుల సూక్ష్మ పోషకాలు

 

ఖరీఫ్ సాగుకు జిల్లా రైతాంగం సిద్ధమవుతోంది. నైరుతి రుతుపవనాల పలకరింతతో పులకరించిన పుడమితల్లి పంటల సాగుకు సమాయత్తం కమ్మని అన్నదాతలను ఆహ్వానిస్తోంది. వరి, వేరుశనగ పంటలను సాగుచేసే రైతాంగం ముందుగా పొలంబాట పట్టేందుకు సమాయత్తమవుతోంది. జిల్లా అంతటా సాగునీటి లభ్యత తక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ సీజనులో వరి, చెరకు సాగు విస్తీర్ణాలను తగ్గించి తృణధాన్యాలు, కూరగాయల పంటల సాగు వైపు రైతాంగాన్ని ప్రోత్సహించాలని కలెక్టర్ సిద్ధార్థజైన్ అధికారులను ఆదేశించారు.       


తిరుపతి :  ఖరీఫ్ సీజను ప్రారంభంలోనే వర్షాలు జిల్లాను పలకరించాయి. బుధ, గురువారాల్లో చాలా ప్రాంతాల్లో 6 సెంటీమీటర్లకు పైగా వర్షం నమోదైంది. ఈనెల ప్రథమార్థం నుంచీ అడపాదడపా వర్షాలు కురుస్తుండటంతో రైతన్నలు అదనులోనే పంటల సాగుకు సిద్ధమయ్యారు. జిల్లాలోని 13 వేల హెక్టార్లలో వరి, 1.36 లక్షల హెక్టార్లలో వేరుశనగ పంటలను సాగు చేయాలన్నది అంచనా. వారం రోజుల నుంచి అప్పుడప్పుడూ కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని స్వర్ణముఖి, కుశస్థలి, భీమ, బహుదా, కల్యాణి, అరణియార్, పెద్దేరు, సిద్ధలగండి నదుల్లోకి  స్వల్పంగా వర్షపునీరు చేరుతోంది. వీటి ఎగువనున్న పంట పొలాల్లో పడ్డ వర్షపునీరు దిగువకు ప్రవహించి వాగుల ద్వారా నదుల్లోకి చేరుతోంది. దీంతో పాటు అక్కడక్కడా చిన్నపాటి చెరువుల్లోనూ నీరు చేరడంతో వాటి కింద ఆయకట్టు భూముల రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ధైర్యంగా పంటల సాగు చేపట్టవచ్చన్న భరోసా కనిపిస్తోంది.

 

 
పశ్చిమాన వేరుశనగ..

శ్రీకాళహస్తి, సత్యవేడు, పుత్తూరు, నగరి నియోజకవర్గాల్లో రైతులు వరి సాగుకు సమాయత్తమవుతుంటే, పశ్చిమ మండలాలైన మదనపల్లి, పలమనేరు, పుంగనూరు, పీలేరు సెగ్మెంట్లలోని మండలాల్లో రైతులు వేరుశనగ సాగుకు సిద్ధమవుతున్నారు. వాతావరణ పరిస్థితులు, సాగునీటి లభ్యతలను అంచనా వేసుకుంటున్న అధిక శాతం రైతాంగం వేరుశనగ సాగుపై దృష్టి సారిస్తోంది. జులై 15 లోగా వేరుశనగ సా గు శ్రేయస్కరమని వ్యవసాయ శాఖ హె చ్చరిస్తోన్న నేపథ్యంలో రైతాంగం మేలైన విత్తు కోసం ఆరాటపడుతోంది. ఇకపోతే ఈ ఏడాది జిల్లాలో వరి, చెరకు సాగు విసీ ్తర్ణం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. సా గునీటి లభ్యతతో పాటు గిట్టుబాటు, మ ద్దతు ధరల ఆశాజనకంగా లేకపోవడంతో ఈ పంటల సాగు విషయంలో పలు మం డలాల రైతులు వెనుకంజ వేస్తున్నారు.


సూక్ష్మపోషకాలు సిద్ధం...
జిల్లా వ్యాప్తంగా వేరుశనగ సాగుచేసే రైతులు సూక్ష్మపోషకాలపై ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని వ్యవసాయ శాఖ చెబుతోంది. రైతుల కోసం మొత్తం 6 లక్షల మెట్రిక్ టన్నుల సూక్ష్మపోషకాలను సిద్ధం చేసి పంపిణీ చేస్తున్నామని జిల్లా వ్యవసాయ శాఖ జేడీ  విజయకుమార్ వివరించారు. ఎకరాకు 200 కిలోల జిప్సం, 20 కిలోల జింకు, 250 గ్రాముల బోరాన్‌లను పొలంలో వాడటం వల్ల పంట సాగు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. సూక్ష్మపోషకాల వాడకంతో పాటు పచ్చిరొట్ట ఎరువుల ద్వారా భూసారాన్ని పెంచుకోవాలని జేడీ సూచించారు. అలసందలు, కందులు, అనప, జొన్న ఇతరత్రా తృణధాన్యాలను కూడా రైతుల కోసం సబ్సిడీ ధరల్లో అందుబాటులో ఉంచామని జేడీ విజయ్‌కుమార్ పేర్కొన్నారు.

 

మరిన్ని వార్తలు