స్పెషల్ బ్రాంచ్ ఏంచేస్తున్నట్లు?

8 Jul, 2015 00:54 IST|Sakshi

 సరుబుజ్జిలి : ఆమదాలవసలో సోమవారం నకిలీనోట్ల ముఠా చిక్కడంతో వారిని విచారించి మరింత సమాచారం సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమైనట్లు తెలుస్తోంది. పాతపట్నం మండలానికి చెందిన ఈ ముఠాతో సరుబుజ్జిలి మండలానికి చెందిన పలు గ్రామాలకు చెందిన యువకులు ఈ నకిలీనోట్ల వ్యవహారంలో పాలుపంచుకున్నట్లు సమాచారం. దీంతో ఇంతకాలం మన మధ్య తిరుగుతున్న వ్యక్తులు ఫేక్ కరెన్సీ ముఠాలతో కుమ్మక్కాయ్యారా అంటూ మండలవాసులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అడ్డదారిలో అధిక సొమ్ము గడించాలన్న దురాశతో పలువురు ఉపాధ్యాయులు కూడా ఈ దొంగనోట్ల చలామణిలో తెరవెనుక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.
 
 తెరవెనుక...
 దొంగనోట్ల వ్యవహారంలో ముఠా సభ్యులు పట్టుబడి సుమారు 24 గంటలు గడుస్తున్నా ఇంతవరకు పోలీసులు ఈ కేసు పురోగతిపై వేగం పెంచకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసులో పాలకపక్షానికి చెందిన కొంతమంది వ్యక్తుల పేర్లు ప్రధానంగా వినిపించడంతో పోలీసులు వెనుకంజవేస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
 మొద్దునిద్రలో స్పెషల్ బ్రాంచ్!
 మండలంలో నకిలీ నోట్ల ముఠాలు సంచరిస్తున్నట్లు చాలా కాలం నుంచి విమర్శలున్నాయి. ప్రధానంగా గ్రామాల్లో జరుగుతున్న పరిణామాలను ముందస్తుగా అంచనాలు వేసి పోలీసు ఉన్నతాధికారులకు పంపించడం స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది విధి. నకిలీ క రెన్సీ ముఠాల విషయంలో పలుమార్లు స్వయంగా, పత్రికలు ద్వారా వారిని అప్రత్తంచేసినా స్పందనలేదు. దీంతో ముందస్తు సమచారంలేక పోలీసులు నకిలీ కరెన్సీ ముఠాలను అరికట్టడంలో విఫలమయ్యారని చెప్పవచ్చు.

 

మరిన్ని వార్తలు