ప్రజాసంకల్ప యాత్రతో ముఖ్యమంత్రికి దడ

9 Nov, 2017 08:21 IST|Sakshi

భీమవరం టౌన్‌:  ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్రకు తరలివస్తున్న అశేష జనవాహినిని చూసి ముఖ్యమంత్రి చంద్రబాబుకు గుండెదడ పట్టుకుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కొయ్యే మోషేన్‌రాజు విమర్శించారు. భీమవరంలోని తన నివాసంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజల కష్టాలు, సమస్యలు తెలుసుకుంటూ అధికారంలోకి రాగానే ఏంచేస్తానో స్పష్టంగా హామీ ఇస్తూ జగన్‌ ముందుకు సాగుతున్నారన్నారు. వృద్ధుల సమస్యలు విని చ లించి మండలానికో వృద్ధాశ్రమం, ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ, అందరికీ ఇళ్లు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు అదనంగా రూ.3 వేలు, రైతులకు భరోసా కల్పిస్తూ ప్రజా దీవెనలతో ప్రజాసంకల్ప యాత్ర ముందుకు సాగుతోందన్నారు. 

జగన్‌ ను చూసి అధికారపక్షానికి నిద్రపట్టడం లేదని ఎద్దేవా చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు గడుస్తున్నా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఇప్పటికీ నెరవేర్చలేదని విమర్శించారు. అధికార పక్షానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు నిరంకుశంగా వ్యవహరిస్తూ ప్రజలను, ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆం దోళన వ్యక్తం చేశారు. అధికారపక్ష నేతల తీరును ప్రజల తరఫున ఎదిరించి, ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని, అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాలన తీరుతో ప్రజలు పడుతున్న కష్టాలు, సమస్యలపై శాసనసభలో ప్రస్తావించేందుకు ప్రధాన ప్రతిపక్షనేత జగన్‌కు సరిగా అవకాశం ఇవ్వకుండా స్పీకర్‌ అధికారపక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 

అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని 25 జిల్లాలుగా ఏర్పాటుచేసి ప్రజలకు పరిపాలన అందుబాటులోకి తీసుకువస్తానని జగన్‌ చెప్పారని అందుకు అనుగుణంగా ప్రతి పార్లమెంట్‌ పరిధికి పార్టీ జిల్లా అధ్యక్షులను నియమించారన్నారు. రాజమండ్రి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడిగా తనను నియమించినందుకు పార్టీ అధినేత జగన్, విజయసాయిరెడ్డి, నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఏలూరు, నరసాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులుగా నియమితులైన ఆళ్ల నాని, ముదునూరి ప్రసాదరాజు ఎంతో అనుభవం గల సమర్థ నాయకులని వారితో కలిసి సమన్వయంతో కార్యకర్తలతో మమేకమై వైఎస్సార్‌ సీపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కష్టించి పనిచేస్తానని చెప్పారు. పార్టీ నాయకులు నౌడు రామారావు, నూకల జగన్‌మోహనరావు, వాసర్ల ముత్యాలరావు, గంటా సుందర్‌కుమార్, పాలపర్తి జోనా, జంగం మాణిక్యాలరావు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు